న్యూఢిల్లీ: హైదరాబాద్ లో భూములుంటే అమ్ముకోండని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ తమకు వివరించినట్లు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సతీమణులు తెలిపారు. శనివారం దిగ్విజయ్ తో భేటీ అయిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదని ఆయన తెలిపారన్నారు. తెలంగాణపై ముందుకేనని దిగ్విజయ్ తమకు సంకేతాలిచ్చారన్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్రకు ఏర్పాటు చేసే రాజధాని పేరును కూడా వెల్లడించారు.
సీమాంధ్రలో సమస్యలు ఏమిటో ఇప్పటికీ ఆ ప్రాంత నేతలు చెప్పడం లేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏకపక్ష వైఖరితో కాంగ్రెస్ పార్టీ ముందుకెళితే సీమాంధ్రలో పార్టీ నష్ట పోతుందని వారు సూచించినా ఆ మాటను దిగ్విజయ్ సింగ్ పెడచెవిన పెట్టారన్నారు. సీమాంధ్రలో పార్టీ నష్ట పోయిన ఫర్వాలేదని, అక్కడ పూర్తిగా నష్టపోయిన ఫర్వాలేదని దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ సీమాంధ్ర 13 జిల్లాల్లో పార్టీ లేకపోయినా ఏమి నష్టం వాటిల్లదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారన్నారు.