రాజీనామాలు చేయండి: కేంద్రమంత్రులకు ఏపీఎన్జీఓల అల్టిమేటం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల (ఎపీఎన్జీఓ)లను బుజ్జగించ లేక సీమాంధ్ర మంత్రులు, ఎంపీల తల ప్రాణం తోకకు వస్తున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీఎన్జీఓ, సీమాంధ్ర ప్రాంత నాయకుల మధ్య వాడివేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గంటకుపైగా సాగిన ఈ సమావేశానికి కిషోర్ చంద్ర దేవ్ తప్ప మిగితా కేంద్ర మంత్రులందరూ హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎపీఎన్జీఓ నాయకులు సంధించిన ప్రశ్నలకు సీమాంధ్ర నేతల వద్ద సమాధానం కరువైనట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సీమాంధ్ర మంత్రుల, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయకుండా..మౌనం పాటించడంపై ఎపీఎన్జీఓ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వెంటనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ఏపీఎన్జీఓలు సూచించినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతుందని, హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 తేదిన తలపెట్టే సభకు అనుమతి వచ్చేలా చూడాలని విజ్క్షప్తి చేయగా, రాష్ట విభజన చేసేందుకు కేంద్రం ముందుకెళితే తాము రాజీనామాలు సమర్పిస్తామని ఎపీఎన్జీఓలు బుజ్జగించినట్టు తెలిసింది.