సమైక్యానికి సస్పెన్షన్
-
15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలపై వేటు
-
చర్చను అడ్డుకుంటున్నారనే సాకుతో ఒక రోజు సస్పెన్షన్
-
తర్వాత విభజన బిల్లుపై చర్చ కొనసాగించిన కాంగ్రెస్, టీడీపీ
-
విభజనపై ముందడుగు పడిందంటూ వ్యక్తమైన ఆనందం
-
ఎమ్మెల్యేలపై ఆద్యంతం దమనకాండ.. అరెస్టు, నిర్బంధం
-
మీడియాతోనూ మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కిన ఖాకీలు
-
లాగి వాహనాల్లో పడేసి గోషామహల్ స్టేడియానికి తరలింపు
-
ఓటింగ్ పెట్టాలని అడిగితే అరెస్టు చేస్తారా: విజయమ్మ ధ్వజం
-
అంతకుముందు బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబట్టిన గౌరవాధ్యక్షురాలు
-
ఓటింగ్ కోరుతూ పోడియాన్ని చుట్టుముట్టిన పార్టీ ఎమ్మెల్యేలు
-
స్పీకర్ ఆదేశాలతో వారందరినీ సభ నుంచి ఈడ్చుకెళ్లిన మార్షల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలని, లేదా దానిపై చర్చ చేపట్టడానికి ముందే సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. ‘‘సమైక్యాంధ్రే మా లక్ష్యం. ఓటింగ్ జరగకుండా చర్చను కొనసాగిస్తే విభజనను అంగీకరించినట్టే. ముందు ఓటింగ్ జరపాల్సిందే. పూర్తి సమాచారం లేని అసమగ్ర బిల్లుపై చర్చ అర్థరహితం’’ అంటూ నిరసన వ్యక్తం చేసినందుకు గెంటేశారు. విభజన బిల్లుపై చర్చను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. సమైక్య నినాదాలతో ఉభయ సభల్లో పోడియాలను చుట్టుముట్టిన వైఎస్సార్‌సీపీ సభ్యులపై ఒక్క రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది. మార్షల్స్‌ను పెట్టి మరీ వారిని సభల నుంచి బయటికి గెంటించింది. అలా ఐదుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన అనంతరం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విభజన బిల్లుపై సభల్లో చర్చను కొనసాగించాయి.
పల్లె రఘునాథరెడ్డి (టీడీపీ), గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్) అసెంబ్లీలో చర్చను కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను సస్పెండ్ చేసి చర్చను ముందుకు తీసుకెళ్లడం పట్ల తెలంగాణ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పెద్దల సభ సంప్రదాయాలను తోసిరాజంటూ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి! దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి అవరణలో ధర్నా చేశారు. నిన్నటిదాకా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టి, బిల్లుపై చర్చ వద్దని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు రాత్రికి రాత్రే వైఖరి మార్చి కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తోందంటూ ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే టీడీపీకి ఏం న్యాయం జరిగిందంటూ నిలదీశారు. తమ సభ్యుల సస్పెన్షన్‌ను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా నిరసించారు. సమైక్యం కోసం గళమెత్తితే సభ నుంచి గెంటేయడం ఏమిటంటూ నిలదీశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు సస్పెన్షన్‌తో ఆగకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అణచివేత చర్యలకు దిగింది.
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా 21 మంది ఎమ్మెల్యేలను ఖాకీలు అమానుష రీతిలో అరెస్టు చేశారు. దాదాపు ఈడ్చుకెళ్లి మరీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా వారికి అవకాశమివ్వలేదు. ఈ ఉదంతాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందిని కూడా దురుసుగా అడ్డుకున్నారు. చేతికి అందిన వారినల్లా విసురుగా లాగిపడేశారు. వారెవరూ ఎమ్మెల్యేల సమీపానికి కూడా వెళ్లకుండా నిరోధించారు. అనంతరం ఎమ్మెల్యేలను గోషా మహల్ స్టేడియానికి తరలించారు. అసెంబ్లీ వాయిదా పడేదాకా వారిని గంటల తరబడి నిర్బంధంలోనే ఉంచారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మధ్యాహ్నం సభ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఇన్నర్ లాబీల వద్ద మొదలైన పోలీసుల అణచివేత, రవీంద్రభారతి చౌరాస్తా సమీపంలో ఎమ్మెల్యేలను అరెస్టు చేసేదాకా పకడ్బందీగా కొనసాగింది. అంతేగాక వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి కవరేజీ రాకుండా చూడటమే తమ ఉద్దేశమన్నట్టుగా పోలీసులు ఆద్యంతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ దమనకాండను విజయమ్మ సహా ఎమ్మెల్యేలంతా తీవ్రంగా నిరసించారు. స్టేడియంలో ధర్నా చేశారు. అరెస్టు అమానుషమని, తమ ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు.