భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
రాష్ట్ర విభజన సెగను సీమాంధ్రులు భోగి మంటల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చూపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీపీఆర్ గ్రౌండ్స్లో నిర్వహించిన భోగి మంటల్లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో టీ.బిల్లును దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో నేతలు బషీర్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేత కరణం బలరాం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీఎన్జీవో నేతలు మాట్లాడుతూ దేశంలోనే తొలి భాష ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుండా విభజించిందని మండిపడ్డారు.
ఇక సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో భోగి మంటలలో బిల్లు ప్రతులను తగలబెట్టారు. గుంటూరులో టీడీపీ నాయకులు కూడా ఇలాంటి నిరసనే తెలియజేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో కూడా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు టీ బిల్లును తగలబెట్టారు.