నేడు సీఎం కిరణ్ రాజీనామా? | Kiran Kumar Reddy may resign as Chief Minister | Sakshi
Sakshi News home page

నేడు సీఎం కిరణ్ రాజీనామా?

Published Tue, Feb 18 2014 1:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

నేడు సీఎం కిరణ్ రాజీనామా? - Sakshi

నేడు సీఎం కిరణ్ రాజీనామా?

నేడు రాజీనామా?
 బిల్లును సాకుగా చూపి తప్పుకోవాలని సీఎం నిర్ణయం
  పార్లమెంటులో ఓటింగ్‌కు ముందే రాజీనామా!
  కొత్త పార్టీ ఏర్పాటుపై మంత్రులు, 
  సన్నిహితులతో సమాలోచనలు
  రాజీనామా, కొత్త పార్టీపై 
  ఆరు నెలలుగా లీకులిస్తున్న కిరణ్
  ఇంత ప్రచారం చేసుకున్నాక ఇప్పుడు 
  తప్పుకోక తప్పదంటున్న మంత్రులు
  పార్టీపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్న 
  సీఎం, ఎన్జీవో నేత, లగడపాటి
 
 సాక్షి, హైదరాబాద్: మరో వారం, పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉండటం, కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. సీఎంకు సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. సీఎం వ్యతిరేకవర్గం కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంట్లో సమావేశమై, కిరణ్‌పై ఎదురుదాడికి వ్యూహరచన చేయడమూ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ బిల్లు మంగళవారం లోక్‌సభలో చర్చకు వస్తుండటంతో, దాన్ని కారణంగా చూపి పదవి నుంచి తప్పుకోవాలన్న యోచనలో సీఎం ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. కొత్త పార్టీ పెడితే ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని కిరణ్ అంచనా వేసుకుంటున్నారు. దీనిపై కొందరు మంత్రులు, సన్నిహితులతో సమాలోచనలు సాగిస్తున్నారు.
 
 రాష్ట్రాన్ని విభజించాలని ఆరు నెలల క్రితం సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన రోజు నుంచే తన పదవికి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలకు సీఎం లీకులిస్తూ గడిపారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటం పేరుతో రాజీనామాను వాయిదా వేస్తూ వచ్చారు. విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో రాజీనామాపై ప్రచారం బలంగా సాగింది. అయితే, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ వాదనను సాకుగా చూపించి, ఆయన రాజీనామాను చివరి వరకు సాగదీస్తూ వచ్చారు. ఈలోగా చకచకా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. ఈనెల 21న పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు వేచి చూడాలని ఓ దశలో భావించారు. అయితే, రాజీనామాపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించుకున్న నేపథ్యంలో ఇక తప్పుకోకపోతే పరువు పోతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై  చర్చ ముగిసి ఓటింగ్ జరగడానికి ముందు రాజీనామా చేసే అవకాశముందని, గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారని సీఎం సన్నిహిత నేతలు చెబుతున్నారు. ఏ కారణం చేతనైనా విభజన బిల్లు లోక్‌సభలో ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే రాజీనామా చేయకూడదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్టు మంత్రులు అంటున్నారు. మరోపక్క, కొత్త పార్టీ ఏర్పాటుపై సీఎం కిరణ్, ఎన్టీవో నేత, కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ లగడపాటి తదితరులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయినప్పటికీ, ఇప్పటికీ వారొక నిర్ణయానికి రాలేకపోయారని మంత్రులు చెప్పారు. సీఎం ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో రాజీనామాపై సమాలోచనలు జరిపారు. అయితే, సోమవారం అలాంటి హడావిడి ఏమీ కనిపించలేదు. ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. మంత్రులు పితాని సత్యనారాయణ, మహీధర్‌రెడ్డి, పార్థసారథి, ఇతర నేతలు మాత్రమే కిరణ్‌తో భేటీ అయ్యారు.
 
 చర్చ మొదలైన వెంటనే సీఎం రాజీనామా : పితాని
 పార్లమెంటులో బిల్లుపై చర్చ మొదలుకాగానే సీఎం రాజీనామా చేయనున్నారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సోమవారం సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కొత్త పార్టీ పెడితే ఆయన వెంటే ఉంటామని చెప్పారు. అసలు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనప్పుడు చర్చ ఎలా అన్న ప్రశ్న పార్లమెంటులో తలెత్తక మానదని అన్నారు. ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టడంపై బీజేపీ, ఇతర పక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున అవి ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని అన్నారు.
 
 బొత్స తెరవెనుక మంత్రాంగమంతా విభజన కోసమే : మంత్రి ఏరాసు ధ్వజం
 రాష్ట్ర విభజనపై బిల్లును ఆమోదించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో వద్దని చెప్పే ప్రయత్నాల చేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,  చివరి నిమిషంలో ఢిల్లీ వెళ్దామని నేతలకు లేఖలు రాయడంలోని ఆంతర్యమేమిటని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి 30 మంది వెళ్లిపోతారని చెప్పిన బొత్స ఏనాడైనా వారిని పిలిచి మాట్లాడారా అని ప్రశ్నించారు. బొత్స ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ సమైక్యమని ప్రకటించారన, అయితే ఆయన తెరవెనుక నెరపిన మంత్రాంగం పూర్తిగా విభజన, పదవుల కోసమేనని ప్రజలందరికీ తెలుసునన్నారు. సీఎం మొదటినుంచీ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెడతారన్నారు. కార్యకర్తలతో చర్చించాక తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement