భద్రాచలం, న్యూస్‌లైన్ : తెలంగాణలోనే ఉంటామని పోరాడుతున్న భద్రాచలం ప్రాంత ప్రజలు ఒంటరి కాదని, వారి వెనుక నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ వాసులు ఉన్నారని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. డివిజన్ టీఎన్‌జీవో ఆధ్వర్యంలో భద్రాచలంలోని తానీషా కల్యాణమండంపం ఆవరణలో సోమవారం రాత్రి జరిగిన ఉద్యోగ గ ర్జన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. మూడు తరాల పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతోందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాట తప్పే నాయకులను భూస్థాపితం చేయాలన్నారు.
విభజనతో సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలన్నారు. సీమాంధ్రకు చెందిన సుమారు 1.40 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారని, వీరంతా వెళ్లిపోతే జిల్లాకు చెందిన పది వేల మంది తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ కొలువులు వస్తాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు ప్యాకేజీల కోసం ఒత్తిడి చేస్తున్నారని, అసలు వారికెందుకు ప్యాకేజీలు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇంత కాలం నదీ జలాలు, సహజ వనరులుదోపిడీ చేసినందుకు తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంతంలోని నదీ జలాలను, ఉద్యోగాలను దోచుకున్నది సరిపోక, ప్యాకేజీలంటూ గోలచేయటం సిగ్గుచేటన్నారు. కొత్త రాష్ట్రంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. 1/70, జీవో నంబర్ 3, అలాగే జీవో నంబర్ 68 ఇలా అన్ని రకాల గిరిజన చట్టాలు వారి అభివృద్ధి కోసం పకడ్బందీగా అమలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
రిజర్వేషన్ల అమలులో నూరు శాతం అమలయ్యేలా కొత్త ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తామన్నారు. భద్రాచలం ప్రాంత ప్రజల నుంచి నేర్చు కోవాల్సింది ఎంతో ఉందన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంచాలని ఈ ప్రాంత వాసులు ముక్కు సూటిగా నేతలను ప్రశ్నించటం, ఇక్కడ జర్నలిస్టులు 72 గంటల పాటు బంద్ చేయటం అభినందనీయమన్నారు. భద్రాచలం డివిజన్ జేఏసీ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీజేఏసీ రాష్ట్ర నాయకులు కె రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, రేచల్, గుంటుపల్లి వేణుగోపాలరెడ్డి డివిజన్ గెజిటడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె సీతారాములు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్కే గౌసుద్ధీన్, ఆవుల సుబ్బారావు, వెక్కిరాల, ఈశ్వర్,సోమశేఖర్, నలజాల శ్రీనివాస్, రేగలగడ్డ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ప్రజలు ఒంటరి కాదు: దేవీప్రసాద్
Published Tue, Nov 26 2013 5:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement