
తెలంగాణకు చంద్రబాబు ద్రోహం: జీవన్‌రెడ్డి
సారంగాపూర్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ జీవించి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను స్వాగతించేవారని, సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమం పుట్టుకొచ్చేది కాదని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వైఎస్సార్ 2009 ఫిబ్రవరి 12 అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ తన పాలనలో ఏనాడూ సమైక్యాంధ్ర అన్న పదం వాడలేదన్నారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తెలంగాణకు మరోసారి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు శతాబ్దాల చరిత్రగల హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రమంత్రి చిరంజీవి కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌లో భూములు అమ్మిన సొమ్ములో తెలంగాణలో ఒక్కశాతం ఖర్చు చేస్తే, సీమాంధ్రలో 99శాతం ఖర్చు పెట్టుకున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇప్పుడు దానిని వ్యతిరేకించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జీవన్‌రెడ్డి అన్నారు.