ఫిక్సర్లకు రాయితీలు..!
రాష్ట్ర విభజన అంశాన్ని నేతలు క్రికెట్‌తో పోలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తానింకా బ్యాటింగే మొదలుపెట్టలేదని సీఎం చెబుతుండగా విభజన ప్రక్రియ అంతా అయిపోతున్న సమయంలో చివరి బంతికి సెంచరీ ఎలా చేస్తారని తెలంగాణ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మ్యాచ్ ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొందరు సీమాంధ్ర నేతలతో ఫిక్సింగ్ చేసుకుని తన పని సాఫీగా చేసుకుపోతోందని అసెంబ్లీ లాబీల్లో చర్చ. సమైక్య బ్యాటింగ్ మొదలెట్టాలని కొందరు సీమాంధ్ర ఎంపీలను హైకమాండే ఫీల్డ్‌లోకి దింపిందట. బ్యాటు పట్టుకోవడమే తెలియని వారికి గేమ్‌ప్లాన్ వివరించిందట.
‘వీర లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించండి. మీకు మీరే చాంపియన్లుగా కూడా ప్రచారం చేసుకోండి. అవసరమైతే చివరి బంతిలోనూ సెంచరీ చేస్తామని చెప్పండి. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే కొద్ది రోజుల్లో మరో కొత్త మ్యాచ్ ప్రారంభించాల్సి ఉంటుంది’ అంటూ నూరిపోసిందట. ఇంకేం.. వారంతా రంగంలోకి దిగి స్లోగన్లు, పోస్టర్లు, హోర్డింగ్‌లు, చానెళ్లలో నినాదాలను ఊదరగొట్టడం మొదలెట్టారు. దాంతో.. సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం కావాలని హైకమాండ్ ఆదేశించిందట. మళ్లీ ఇదేమిటని అనుకుంటున్నారా! కొత్త పార్టీ పెట్టి జనంలోకి వెళ్లడం.., ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చి పాత టీమ్ (కాంగ్రెస్)లో చేరిపోవడం. ఇటీవలే ఏఐసీసీ మీటింగ్‌కు హాజరైన ఓ నేత అసెంబ్లీ లాబీల్లో ఈ మ్యాచ్ (ఫిక్సింగ్) వివరాలను వెల్లడించారు. దీనివల్ల మనోళ్లకి లాభమేనండీ అని కూడా చెప్పారట. ‘సెకండ్ ఇన్సింగ్స్‌కయ్యే ఖర్చులకు భారీఎత్తున జేబులు నింపడంతో పాటు ఆ ప్లేయర్లకు చెందిన కంపెనీలకు హైకమాండ్ అనేక రాయితీలు ప్రకటించింది. లేదంటే ఈ ‘ఫిక్సర్లు’ ఊరికే ఫీల్డ్‌లోకి దిగుతారనుకుంటున్నారా?’ అని ఆయన చెప్పడంతో అక్కడున్న వారంతా ‘ఓహో! దీని వెనుక ఇంత కథ ఉందా!’ అనుకున్నారు.