కుట్రలతో కడుపులు మండుతున్నాయి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలతో ఈ ప్రాంత ప్రజల కడుపులు మండిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేంద్రమంత్రుల స్థాయిలో ఉన్నవారు కూడా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు ఆగ్రహావేశాలు వస్తున్నాయన్నారు.
హైదరాబాద్ విషయం మాట్లాడితే నాలుకలు చీరేస్తామంటూ టీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే చెప్పారని, ప్రజలకు కూడా అదే స్థాయిలో ఆగ్రహం వస్తోందని కేకే హెచ్చరించారు. తెలంగాణకు 60 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని, అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్న ప్రజల్లో ఓపిక, సహనం పెరిగి సీమాంధ్రులపై ఇప్పటిదాకా ఎలాంటి దాడులు జరుగలేదని తెలిపారు.ఈ ప్రాంత ప్రజల మంచితనాన్ని, సహనాన్ని చేతకానితనం అనుకోవటం మంచిది కాదని కేకే హెచ్చరించారు. రాష్ట్రం సిద్ధించేదాకా సహనం, ఓపికతో ప్రజాస్వామ్యయుతమైన పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ భాగస్వామిగా ఉంటుందని కేకే వివరించారు. కేసీఆర్ సహా పార్టీ నేతలందరికీ పదవులు, అధికారం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి కాంగ్రెస్, టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని కేకే చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటం న్యాయబద్దమైన, ధర్మబద్దమైన డిమాండుకోసమేనని అన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.
రెచ్చగొట్టడం సీపీఎంకు మంచిదికాదు : వినోద్
రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ వ్యతిరేక ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కోరటాన్ని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. సీమాంధ్ర నాయకులు పదవులకు రాజీనామాలు చేయాలంటూ రాఘవులు మాట్లాడటం శోచనీయమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నందున రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ఇప్పటిదాకా చెప్పిన సీపీఎం వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో చెప్పాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.