రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయాలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన, అఖిలపక్ష సమావేశానికి కేంద్రం తేదీలు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రాష్ట్ర విభజన, వరద సాయంపై రాష్ట్రపతిని కలిసి విన్నవించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సీమాంధ్ర నేతలు అభ్యంతరం చేస్తున్నాయి. రాష్ట్రపతి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరనున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న ప్రణబ్ విభజన సమస్యకు పరిష్కారం చూపగలరని రాష్ట్ర నాయకులు నమ్ముతున్నారు. రాష్ట్రపతిగా విభజనను అడ్డుకునే శక్తి ఆయనకే ఉందని భావిస్తున్నారు. అలాగే భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కూడా రాష్ట్రపతికి రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేయనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాత రాష్ట్రపతిని కలవనున్నారు. సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు; టీడీపీ సీమాంధ్ర ప్రతినిధులు వేర్వేరుగా రాష్ట్రపతిని కలవబోతున్నారు. అటు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం తేదీలు ఖరారు చేయడంతో పార్టీలు చర్చల్లో మునిగితేలుతున్నాయి. అఖిలపక్ష భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయి.