
ప్రముఖ నటుడు.. తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్(Kamal Haasan) కేంద్రంలోని బీజేపీపై భగ్గుమన్నారు. హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దే ప్రయత్నం ఏమాత్రం సహించరానిదని.. అన్ని రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారాయన.
బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీకి మక్కల్ నీది మయ్యం తరఫున కమల్ హాసన్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం హిందీ భాషను తప్పించడంతో పాటు.. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టాలని కేంద్రానికి వ్యతిరేకంగా డిమాండ్లతో ఈ భేటీలో ఓ తీర్మానం చేశారు. అనంతరం.. జరిగిన ఎంఎన్‌ఎం పార్టీ మీటింగ్‌లో కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మన కల ఇండియా. కానీ వాళ్ల కల హిందీయా. బలవంతంగా హిందీని హిందీయేతర ప్రాంతాలకు రుద్దాలన్నదే వాళ్ల ప్రయత్నం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది నెరవేరకుండా తమిళులంతా ఏకమై పోరాడాలి’’ అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారాయన.
అయితే హిందీయా కామెంట్లు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయడం గమనార్హం. 2019లో హిందీ దివస్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉన్న ఏకైక భారతీయ భాష హిందీనేనని పేర్కొన్నారాయన. అయితే.. ఈ పోస్టుకి నాడు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇండియా అని.. హిందీయా కాదని కౌంటర్ పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొట్టిపడేశారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాల తమ ఆందోళనను వ్యక్తంచేస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రలోని బీజేపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందదని.. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించమని ఓ ప్రకటనలో తెలిపారాయన.
Comments
Please login to add a commentAdd a comment