
పూటకో మాటొద్దు బాబూ..: కోదండరాం
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడిన తీరు తెలంగాణ ప్రాంత ప్రజలను గందరగోళంలోకి నెట్టింది.. ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు.
ఖమ్మం/బోనకల్, న్యూస్‌లైన్ : ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడిన తీరు తెలంగాణ ప్రాంత ప్రజలను గందరగోళంలోకి నెట్టింది.. ఆయన స్పష్టమైన వైఖరి ప్రకటించాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఖమ్మంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎవరిని ఇష్టపడుతావని అడిగినట్లు తెలంగాణ, సమైక్యాంధ్ర విషయాన్ని పోల్చడం సరికాదన్నారు. తెలంగాణది హక్కులకోసం చేస్తున్న పోరాటమని, సీమాంధ్ర ప్రాంత నాయకులు చేస్తున్న ఉద్యమం ఆధిపత్యం కోసమని ఆరోపించారు. రెండింటికి పొంతనే లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు అడ్డుకాదని చంద్రబాబుతోపాటు అన్నిపార్టీ లు ప్రకటించాయని, ఇప్పుడు మళ్లీ మాటమార్చే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన లేఖకు టీడీపీ కట్టుబడి ఉండాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు జాప్యం చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పారు. ఇరుప్రాంతాల వారితో చర్చలు జరపాలని అభిప్రాయపడుతున్న వారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలెత్తే సమస్యలపైనా.. లేదా రాష్ట్ర విభజనపైనా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరు ప్రాంతాల సమస్యలను కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చర్చించుకోవచ్చని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈనెల 29న హైదరాబాద్‌లో సకలజనుల భేరి సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, అలాగే యూటీ వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. చంఢీగఢ్‌మాదిరిగా హైదరాబాద్‌ను చేసి ఇబ్బంది పడొద్దన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి హైదరాబాద్‌తో ముడిపడి ఉందని, ప్రస్తుతమున్న పది జిల్లాల సరిహద్దులతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తుకాదని, తెలంగాణ సొత్తు అని కోదండరాం అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలంటే ఆ ప్రాంతానికి విభిన్నమైన సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, అభిమతాలు ఉండాలని అటువంటి పరిస్థితితులు హైదరాబాద్‌లో లేవని అన్నారు. సీమాంధ్ర నాయకులు ఢిల్లీలో మకాం వేసి రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకట్ట వేసే విధంగా పావులు కదుపుతున్నారన్నారు.
ఆంగ్లేయులు వెళ్లారు.. కానీ ఆంధ్రోళ్లు వెళ్లేట్లులేదు
‘‘హైదరాబాద్ ఎవడబ్బ సొత్తుకాదు. ముమ్మాటికీ తెలంగాణ సొత్తు. 200 సంవత్సరాల పాలించిన ఆంగ్లేయులు వెళ్లమంటే వెళ్లారు కానీ, ఆంధ్రవాళ్లుమాత్రం వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణరాష్ర్టం ఏర్పడినపుడే తెలంగాణ సంక్షేమం సాధ్యమవుతుంది. వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు’’.
- ఖమ్మం జిల్లా బోనకల్‌లో జయశంకర్ విగ్రహావిష్కరణలో కోదండరాం