తెలంగాణ వ్యతిరేకితో పొత్తా? | ‍Harish Rao Questions To Uttam Kumar Reddy Over Alliance With TDP | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 10 2018 1:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

‍Harish Rao Questions To Uttam Kumar Reddy Over Alliance With TDP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీతో పొత్తుపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని సాగునీటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు కాంగ్రెస్‌ ముసుగులో మళ్లీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి దూరమైన పార్టీలతో కోదండరాం ఎలా కలసి పని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌లతో కలసి హరీశ్‌రావు మంగళవారం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబునాయుడుతో మీది షరతులతో కూడిన పొత్తా.. బేషరతు పొత్తా.. అధికారం కోసమే పెట్టుకునే పొత్తా? స్పష్టం చేయాలి. చంద్రబాబు సమైక్య నినాదాన్ని పక్కనపెట్టి తెలంగాణ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న తర్వాతే టీఆర్‌ఎస్‌ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు ఏఐసీసీ చెప్పిన తర్వాతే 2004లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేశాం.

అప్పటి మా పొత్తులు వందకు వంద శాతం షరతులతో కూడినవే. ఈ షరతులు ఉల్లంఘించగానే ఆ పార్టీలతో తెగతెంపులు చేసుకున్నాం. తెలంగాణ కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల విషయంలో మీరు టీడీపీతో ఇలాగే షరతులు పెట్టారా? మీ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసమా, మీ రాజకీయ ప్రయోజనాల కోసమా స్పష్టం చేయాలి. సీఎం కేసీఆర్‌ తెలంగాణను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పడగొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు తెలంగాణలో నేరుగా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ పోటీ చేసినా టీడీపీకి డిపాజిట్లు దక్కవని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో రుజువైంది. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ ముసుగులో తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. మహాకూటమి నేతల వ్యక్తిగత స్వార్థం కోసమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణ సామాన్య జనం మహాకూటమి ఏర్పాటును చీదరించుకుంటున్నారు. కేసీఆర్‌ పదకొండు రోజుల దీక్షతో చావు నోటి దాకా వెళ్లి తెలంగాణ తెచ్చారు. తెలంగాణపై కేసీఆర్‌ చిత్తశుద్ది ఇది. మహాకూటమి నేతలు మాత్రం పరాయి పాలనకు మొగ్గు చూపుతున్నారు’అని హరీశ్‌ విమర్శించారు. 

తెలంగాణ వ్యతిరేకులతో కోదండరాం జట్టు... 
తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం లక్ష్యమేమిటో అర్థం కావడంలేదని హరీశ్‌రావు అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం మాతో కలసి ఉద్యమించిన కోదండరాం ఇప్పుడు సీట్ల కోసం తెలంగాణ వ్యతిరేకులతో కలవడం అమరవీరుల ఆత్మలకు ద్రోహం చేయడం కాదా? తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ నిర్ణయించింది. అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మీరే జేఏసీ నుంచి సస్పెండ్‌ చేశారు. జేఏసీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మీ మొహం మీదే ప్రకటించి కాంగ్రెస్‌ వెళ్లిపోయింది. అలాంటి పార్టీలతో కలసి పని చేస్తారా? కోదండరాం ఎమ్మెల్యేగా గెలవడం కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడతారా? మీ నిర్ణయంలో ఏ ఉద్యమ స్ఫూర్తి ఉందో చెప్పాలి’అని ప్రశ్నించారు. టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తులపై తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న 12 అంశాలను మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చే విషయంలో స్పష్టత ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు సంతకాలు చేస్తారా?’అని హరీశ్‌ ప్రశ్నించారు. 

ఉత్తమ్‌కు మంత్రి హరీశ్‌ రాసిన బహిరంగ లేఖలోని 12 అంశాలు... 
1 తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చివరి వరకు అన్ని రకాలుగా ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు... ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వైఖరిని మార్చుకున్నారా? టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చించి తెలంగాణ అంశాలపై స్పష్టత ఇచ్చారా? 
2 సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పక్షాన నిలబడి తెలంగాణకు వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు. ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, పైన చెప్పిన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తానని చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా? ఈ విషయాల్లో చంద్రబాబు బహిరంగంగా వైఖరి చెప్పగలరా? కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకుంటరా? 
3 విభజన చట్టంలో లేకున్నా... కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేసి పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను గుంజుకున్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని వ్యతిరేకించి రాష్ట్ర బంద్‌ చేపట్టారు. ఏడు మండలాలను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు దీనికి సిద్ధమా? చంద్రబాబును ఒప్పించి ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలకపడానికి కాంగ్రెస్‌ ఏమైనా అంగీకారం కుదుర్చుకుందా? 
4 150 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో డ్యామ్‌ నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలంలోని రామాలయం సహా తెలంగాణలోని లక్ష ఎకరాలు మునిగిపోతోంది. దీని ప్రభావం ఎంతో ఇంకా అంచనా వేయలేదు. నష్టం జరగకుండా డిజైన్‌ మార్చాలని అందరూ కోరుతున్నారు. మీ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. పోలవరం డిజైన్‌ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? పోలవరంపై మీ పార్టీ వైఖరి, చంద్రబాబు వైఖరి ఏమిటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలి. 
5 మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మేలు చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, వివిధ సంస్థలకు 30 లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? ఆయన వైఖరి చెప్పకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా? 
6 కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల, పెన్‌గంగ, రామప్ప–పాఖాల ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వాటిని ఉపసంహరించుకునేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారా? ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా? 
7 పోలవరం నిర్మించి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణా నీటిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. దీనిప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు రావాలి. తెలంగాణకు వచ్చే నీటి కేటాయింపులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు నష్టపోతున్నాయి. ఈ కేటాయింపులపై అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా? 
8 తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ప్రాజెక్టు చేపట్టింది. గోదావరి, కృష్ణా నీళ్లను వినియోగించడం తప్పని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి ఇబ్బందులు సృష్టించే చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారు. భగీరథపై ఫిర్యాదు విషయంలో చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? 
9 విభజన చట్టంలో లేకున్నా... కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5 వేల కోట్ల విలువైన 460 మెగావాట్ల సీలేరు విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లాక్కున్నది. దీనివల్ల మొదట్లో తెలంగాణ రాష్ట్రం కరెంటు కోతలు అనుభవించింది. ఏడాది అంతా కరెంటు ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టును కోల్పోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ కోటి రూపాయలు నష్టపోతున్నది. సీలేరు ప్రాజెక్టును తిరిగి ఇచ్చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారా? ప్లాంట్‌ తీసుకున్నందుకు నష్టపరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారా? 
10 విద్యుత్‌ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఆంధ్రకు చెందిన 1,200 మందిని రిలీవ్‌ చేస్తే ఏపీ ప్రభుత్వం వారిని జాయిన్‌ చేసుకోవడంలేదు. కోర్టులో కేసులు వేశారు. ఆంధ్ర ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులు ఉపసంహరించుకుంటారా? 
11 నిజాం కాలం నుంచి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కోసం ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసింది. ఆ ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉండదని చంద్రబాబు అంగీకరించారా? కేసులను ఉపసంహరించుకుంటామని ఒప్పందం చేసుకున్నారా? 
12 హైకోర్టు విభజన, ఇతర ప్రభుత్వరంగ సంస్థల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. వాటి విభజన విషయంలో చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement