సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనభ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చర్చించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ భేటీలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా పాల్గొన్నారు. దీంతో ప్రెస్‌కాన్ఫరెన్స్ పేరుతో హస్తినకు చేరుకున్న చంద్రబాబు పర్యటన వెనక అసలు ఉద్దేశం కూడా సీట్ల విషయంపై చర్చించడమేనని స్పష్టమైంది. శనివారంరాత్రి ఏపీ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీపీఐకి 5, టీజేఎస్‌కు 8, టీటీడీపీకి 15 సీట్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ 91 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశం అనంతరం చంద్రబాబు, ఉత్తమ్‌లు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
సిటీ సీట్లపైనే చర్చ!: భాగ్యనగరంలోని పలు సీట్లలో సెటిలర్ల ఎక్కువగా ఉన్నందున ఆ స్థానాలు తమకే కేటాయించాలని టీడీపీ మొదట్నుంచీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ తమకు కూడా బలముందని కాంగ్రెస్ వాదిస్తోంది. కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, పటాన్‌చెరు, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ స్థానాలపై సందిగ్ధత నెలకొంది. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని పి.విష్ణువర్ధన్ రెడ్డికి కేటాయించాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇలా ప్రతిస్థానంపైనా ఏదో ఒక చిక్కుముడి నెలకొంది.
ఈ సమావేశంలో ఇలాంటి అంశాలపైనే చర్చించినట్లు సమాచారం. పోల్ మేనేజ్‌మెంట్‌పైనా ఉత్తమ్, బాబు చర్చించారని తెలుస్తోంది. అంతకుముందు ఏపీ భవన్‌లోనే చంద్రబాబును.. సీపీఐ పార్టీ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా, నారాయణలు కలిశారు. కాగా, జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ అభిప్రాయాలను గౌరవించేందుకు వీలుగా తామే కాస్త తగ్గామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కాగా, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరించాలంటూ ఎల్ రమణకు చంద్రబాబు సూచించారు.
బాబుతో ఉత్తమ్ భేటీ
Published Sun, Oct 28 2018 3:47 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment