సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రయపడ్డ అభ్యర్థులకు ఫలితాల తర్వాత షాకులు తగులబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఐటీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.125 కోట్లు స్వాధీనం చేసుకోగా, ప్రధానంగా వరంగల్ జిల్లా పెంబర్తిలో పట్టుబడ్డ రూ.5.8 కోట్ల వ్యవహారం సంచలనంగా మారనుంది. కారు సీట్ల వెనుక సీక్రెట్ బాక్స్‌లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర, పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు మెడకు ఈ కేసు చుట్టుకోబోతున్నట్లు సమాచారం.
ఎక్కడి నుంచి..
హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన హవాలా వ్యాపారి కీర్తికుమార్ జైన్ రూ.5.8 కోట్లను వరంగల్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఈ డబ్బును నామా నాగేశ్వర్‌రావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్లు కీర్తికుమార్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. ఈ డబ్బు హవాలా మార్గంలో ఎక్కడి నుంచి వచ్చింది.. పంపించిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలపై వరంగల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగపూర్‌లోని ఓ వ్యక్తి హవాలా ద్వారా ఈ డబ్బును చెన్నైకి పంపించినట్లు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కీర్తికుమార్‌కు ఈ డబ్బు చేరినట్లు తెలిసింది. సింగపూర్‌లో ఉన్న వ్యక్తి ఎవరు.. మహాకూటిమి అభ్యర్థులకు డబ్బు పంపాలని ఆ సింగపూర్ వ్యక్తిని ఆదేశించిందెవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
నేతలకు తాఖీదులు..: పలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని నామానాగేశ్వర్‌రావుతో పాటు కొండా మురళి, రవిచంద్రలకు సమాచారం ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ వీరికి త్వరలో నోటిసులు జారీచేసి విచారణకు రావాలని ఆదేశించనుంది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కూడా హవాలా ద్వారా డబ్బు రవాణా జరిగిందా.. డబ్బు పంపింన అసలు వ్యక్తి ఎవరన్న దాన్ని తేల్చాలని వరంగల్ పోలీసులు భావిస్తున్నారు.
బాబు కోటరీయేనా?
మహాకూటమికి అన్నీ తానై నడిపించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఈ హవాలా డబ్బు వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నామా నాగేశ్వర్‌రావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రవిచంద్రకు వరంగల్ ఈస్ట్ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి ఇప్పించేందుకు చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు కొండా సురేఖ ఎన్నికల ఖర్చు కోసం కూడా చంద్రబాబు కోటరీయే హవాలా ద్వారా డబ్బును వరంగల్ చేర్చేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్‌లో ఉన్న కీర్తికుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వరంగల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కస్టడీలో అసలు కథ ఏంటన్న అంశాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment