samaikyandhra movement
-
కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి లీగల్: సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో ఆయన గురువారం తిరుపతి నాలుగో అదనపు, మూడో అదనపు జూనియర్ జడ్జి కోర్టుల్లో హాజరయ్యారు. ప్రభుత్వం కక్షసాధింపుతో నమోదు చేసిన కేసులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని ఆయన ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. -
బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడం: చెవిరెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులన్నింటినీ కొట్టివేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పి ఉద్యమకారులను అవమానిస్తున్నారని తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడం సిగ్గుచేటన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము నిబద్ధత కలిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తలమని, ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడమన్నారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణిపై ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు భానాయించి అరెస్ట్‌ల పర్వం కొనసాగిస్తోంది. శనివారం అర్థరాత్రి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేయగా... సోమవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంతో ప్రభుత్వ నిరంకుశ వైఖరి తేటతెల్లమవుతుంది. సోమవారం ఉదయం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేయగా, మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు తిరుపతిలో అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అరెస్ట్ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను నెల్లూరు కోర్టులో హాజరుపరచగా... ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులు ఎత్తివేస్తామన్న బాబు సర్కార్ మాట తప్పిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పథకం ప్రకారమే వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి అరెస్ట్‌తో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తేయాలి
-
సర్కారు ఉక్కుపాదం మోపినా..చెదరని ప్రత్యేక సంకల్పం
- అడుగడుగునా పోలీసు అరెస్టులు - ఆందోళన భగ్నానికి సర్కారు కుట్ర - అయినా ఆగని ప్రత్యేక పోరాటం - వామపక్ష, ప్రజాసంఘాల మద్దతు - జిల్లాలో బంద్ సంపూర్ణం - ఏజెన్సీ, గ్రామీణంలో స్తంభించిన జనజీవనం సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమంలో చూపిన పోరాటపటిమ శనివారం మరోసారి ప్రస్ఫుటమైంది. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు జిల్లా ప్రజానీకం నుంచి మంచి స్పందన లభించింది. బంద్ భగ్నానికి పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం నడిపినా ఉద్యమ స్ఫూర్తి కొనసాగింది. ఆందోళనకు సంకెళ్లు వేసినా పోరాట పటిమను వీడలేదు. పార్టీ శ్రేణులు..మద్దతు పలికిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ,కార్మిక సంఘాలు కలిసి కదంతొక్కాయి. ఒకపక్క రాఖీ పండగను ఆస్వాదిస్తూనే ప్రత్యేక హోదాకోసం ఆందోళనపథం సాగించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు వ్యూహాత్మక వైఖరిననుసరిస్తూ బంద్ విజయవంతం చేశాయి. విశాఖఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెల్లవారుజామున 4గంటల నుంచే పార్టీ నాయకులు..కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని పహారా మధ్య బస్సులను తిప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఉదయం 8గంటల వరకు బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితం కాగా ఆ తర్వాత రోడ్లపైకివచ్చాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం వరకు బస్సుల జాడలేదు. జగదాంబ వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్..పాడేరులో ఎంఎల్ఎ గిడ్డి ఈశ్వరితోపాటు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా 700మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 60 మందిపై వివిధ కేసులు బనాయించగా, మిగిలిన వారిని సొంతపూచీకత్తుపై విడిచి పెట్టారు. స్తంభించిన జనజీవనం: జిల్లా వ్యాప్తంగా ష్రాపింగ్ మాల్స్‌తో పాటు బంగారు దుకాణాలు సైతం తెరుచుకోలేదు. అన్ని దుకాణాలు మూతపడ్డాయి.మల్టీఫ్లెక్స్‌లతో సహా సినిమా థియేటర్లలో ఉదయం ఆటలను నిలిపివేశారు. బ్యాంకులు పని చేయలేదు. ప్రైవేటువిద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ, మద్దిలపాలెం, ఎన్ఎడీ, బిర్లా, గురు ద్వార, డైమండ్ పార్కు, ద్వారకా నగర్, సీతమ్మధార, పెదవాల్తేరు, పూర్ణామార్కెట్, మెయిన్‌రోడ్, గాజువాక, గోపాలపట్నం,స్టీల్‌ప్లాంట్ తదితర ప్రధానకూడళ్లల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. బలవంతంగా ప్రభుత్వ విద్యా సంస్థలను తెరిపించినా విద్యార్థుల లేక వెలవెల బోయాయి. ఏయూలో డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్శిటీ ఉద్యోగులు బంద్‌కు సంఘీబావంగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. సాగర్ నగర్ బీచ్‌రోడ్ నుంచి జగదాంబ జంక్షన్ వరకు యువజన విభాగం ఆధ్వర్యంలో బైకు ర్యాలీ చేశారు. చిప్పాడవద్ద దివీస్ లేబరేటరీలో ఉద్యోగులు వెళ్లనీయకుండా సుమారు ఐదుగంటల పాటు పార్టీ శ్రేణులు అడ్డగించారు. ఇలా స్తంభించిపోవడం ఈ లేబరేటరీ చరిత్రలో ఇదే తొలిసారి.అనకాపల్లి, నక్కపల్లి, పాయక రావుపేట, భీమిలి తదితరప్రాంతాల్లో రాస్తారోకోలు జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వామపక్షాల సంఘీభావం: బంద్‌కు వామపక్షాల నుంచి సంపూర్ణమద్దతు లభించింది. సీపీఎం రాష్ర్ట కార్యవర్గదర్శి సభ్యుడు సీహె చ్. నరసింగ రావు, జిల్లా కార్యదర్శి అజయ్‌శర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ల ఆధ్వర్యంలో వామపక్షాల శ్రేణులు ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్నాయి. వామపక్షాలకు చెందిన సుమారు 200మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 992 మంది అరెస్ట్ అల్లిపురం : ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విఫలయత్నం చేసేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నించారు. ఉదయం 5 గంటల నుంచే బంద్‌లో పాల్గొన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 379, సీపీఎంకి చెందిన 143, సీపీఐకి చెందిన 138 మంది నాయకులు, కార్యకర్తలను సెక్షన్ 151 సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. రూరల్ జిల్లాలో 386 మంది అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిలో 46 మందిపై వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం జగదాంబ కూడలిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి విజయసాయిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎండీ ఫరూకీ, పోతల ప్రసాద్, రాష్ట్ర ఐటీ వింగ్ నేత చల్లా మధుసూదనరావుతో పాటు 72 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఇక్కడ 12 మంది సీపీఐ, 13 మంది సీపీఎం నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించారు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయసాయిరెడ్డిని విడుదల చేయాలని కార్యకర్తలు టూటౌన్ గేటు వద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఏజెన్సీలో రోడ్డెక్కని ఆటోలు ఏజెన్సీలో బస్సులు పూర్తిగా డిపోలకు పరిమితమయ్యాయి. ఆటోలతో పాటుప్రైవేటు వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. అనకాపల్లి, నర్సీపట్నం,యలమంచలి, భీమిలితో పాటు పాయకరావుపేట, పెందుర్తి, చోడవరంలతోపాటు పాడేరు, అరకు, మాడుగులల్లో బంద్ ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. అనకాపల్లి, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో వేలాదిగా పార్టీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. పెదబయలులో రోడ్లపైనే వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. -
సమైక్య సన్మానంపై గరంగరం
- ఏ అర్హతతో ఎంపిక చేశారు - ఉమా సొంతశాఖనే మరిచారు - టీడీపీకి ఇష్టులైన వారికే సత్కారాలు సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్జీవో సంఘ నేతలతోపాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు అసోసియేషన్ల ప్రతినిధులకు మంగళవారం బెంజిసర్కిల్‌లో జరిగిన నవ నిర్మాణదీక్షలో ముఖ్యమంత్రి చేతుల మీదగా సత్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రామాణికంగా సత్కరించారని పలువురు సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొని సత్కారం పొందలేకపోయిన కొంతమంది సమైక్యవాదులు ఈ సన్మానాలపై గరంగరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి తమకు సత్కారం చేయకపోయినా పర్వాలేదని.. అయితే తాము చేసిన పోరాటాన్ని గుర్తించకపోవడమే బాధాకరమంటున్నారు. మంత్రి ఉమా శాఖనే మరిచి జలవనరుల శాఖకు చెందిన సిబ్బంది, అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో తొలిరోజు నుంచి పాల్గొని నీటిపారుదలశాఖ ప్రాంగాణాన్ని స్తంభింపజేశారు. మంత్రి ఉమాకు చెందిన ఈశాఖ ఉద్యోగస్తుల్ని పూర్తిగా విస్మరించారు. ఎక్సైజ్,గ్రంథాలయ సంస్థ, పశుసంవర్థక శాఖ, ఉడా, తదితర ఇతర శాఖల ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని వంటావార్పులు, రోడ్లపైనే ధర్నాలు చేసి నిరసన తెలియజేశారు. వీరిని మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు. ఎన్జీవో సంఘ నేతలతోపాటు రెవెన్యూ, కార్పొరేషన్ వంటి ముఖ్యమైన శాఖల ప్రతినిధులకు మాత్రమే సన్మానాలు జరగడంపై ఈ శాఖల సిబ్బంది గరంగరంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన నవనిర్మాణదీక్షలో సత్కారాలు కేవలం జిల్లానేతలకే పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో హైదరాబాద్‌లో సచివాలయ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని, వారంతా నవనిర్మాణదీక్షలోపాల్గొన్నారని వార్ని ఎందుకు సత్కరించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదులు ఆగ్రహం... ఆప్పట్లో అర్బన్ టీడీపీ కార్యాలయ కార్యదర్శి గోగినేని ధనశేఖర్ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రెండోసారి టీడీపీ నేతలందరికంటే ముందుగా పార్టీలకు అతీతంగా మదర్ థెరిస్సా విగ్రహం వద్ద ఆమరణదీక్ష చేయడంతో టీడీపీ నేతలంతా పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీలో ఇంకా కొంతమంది కార్యకర్తలు కీలకంగాపాల్గొన్నారు. అలాగే తొలినుంచి రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వామపక్ష నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలుచేశారు. వారిని ప్రభుత్వం గుర్తించలేదు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు తమకు సత్కరించాల్సిన అవసరంలేదని వామపక్షనేతలు అంటున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని ప్రక్కన పెట్టి ప్రస్తుతం టీడీపీలో ముఖ్యనేతలకు ఇష్టులైన వారికి వివిధ రంగాల తరుఫున గుర్తించి సత్కారాలు చేయించారనే విమర్శలు వస్తున్నాయి. కాగా సమైక్యాంధ్ర ఉద్యమం అంటేనే మాజీ ఎంపీ లగడపాటి గుర్తుకు వస్తారని.. ఆయనను ఈ వేదిక ఎందుకు మరిచిపోయిందంటూ సమైక్యవాదులు ప్రశ్నించడం కొసమెరుపు. -
గల్లీనుంచి ఢిల్లీదాకా సమైక్యాంధ్ర ఉద్యమం
-
సమ్మె విరమణ వెనుక కథేంటి?: చలసాని
గుంటూరు: సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చిత్తశుద్ధితో సమ్మె చేస్తుంటే వారి నాయకుడు అర్థాంతరంగా విరమించాలని చెప్పడం వెనుక అంతరార్థమేంటని ఆంధ్రా మేధావులు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. మరో ఎనిమిది గంటలపాటు సమ్మె జరిపి ఉంటే కేంద్రం దిగి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆంధ్ర మేధావుల, విద్యావంతుల వేదికలో పాల్గొన్న ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఉద్యోగులు సమ్మె విరమించడానికి అశోక్‌బాబుకి దిగ్విజయ్‌సింగ్ ఏమైనా ఆదేశాలిచ్చారా అని ప్రశ్నించారు. ఎవరు చెబితే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నిలిపివేయాల్సి వచ్చిందని నిలదీశారు. సర్వోన్నత న్యాయస్థానం విభజనను అడ్డుకునే అవకాశాలున్నాయని, అయితే విభజనపై కేంద్రప్రభుత్వాన్ని చాలాకాలం క్రితమే న్యాయస్థానం వివరణ ఇవ్వమన్నప్పటికీ ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. -
ఎన్నికళ తప్పిన కాంగ్రెస్!
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. ఎన్నికల ముందు ఉండవలసిన హడావుడి ఆ పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. అంతటా నిర్లిప్తత ఆవరించింది. ఎన్నికలంటేనే వారు భయపడిపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఆ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గెలిచే అవకాశం ఎలాగూ లేదు, కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేని దుస్థితిలో వారుకొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేక త వ్యక్తం కాకతప్పదని మధనపడుతున్నారు. దీంతో చాలా మంది నేతలు పోటీ చేయడానికి ముందుకురావడంలేదు. ఇంకొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర విభజన... సమైక్యాంధ్ర ఉద్యమం... ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ విధించి న కర్ఫ్యూ... వెరసి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ దయనీయ స్థితి కి చేరింది. విజయనగరంలో ఇప్పుడా పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నేతలంతా డైలమాలో పడ్డా రు. అన్నీ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నా కాంగ్రెస్‌లో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ నేతల అభద్రతా భావం బయటపడుతోంది. ప్రజాకంటక పాలనతో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ నాయకులకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు నగరంలో విధించిన కర్ఫ్యూతో ప్రజల్లో తిరగలేని పరిస్థితి దాపురించింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ తీరును ఎండగట్టే విధంగా మాట్లాడుతుండడంతో తాము కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. కర్ఫ్యూతో ఎదురైన ఇబ్బందులు, కర్ఫ్యూ అనంతరం పెట్టిన కేసులతో తీవ్ర ఆవేదనతో ఉన్న జనాలు ఎన్నికలెప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తూ వచ్చారు. నిరీక్షణకు తగ్గట్టుగానే వరుస ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. అన్నింటి కంటే ముందుగా మున్సిపల్ ఎన్నికలు సమీపించాయి. ఎన్నికలొస్తే చాలు సందడి చేసే హస్తం నేతలు మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కిమ్మనడం లేదు. పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్నీ పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్తూ, ఎన్నికల జోష్ కనబరుస్తున్నా కాంగ్రెస్‌లో మాత్రం కనీస చలనం లేదు. ప్రజల నాడిని పసిగట్టిన ఆ పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడుతున్నారు. ఏం చేశామని ప్రజల్లోకి వెళ్లగలమని, ఏం చెప్పి ఓటు అడగగలమని ప్రశ్నించుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉండడమే మేలన్న అభిప్రాయానికొచ్చేశారు. స్వతంత్రంగా పోటీ చేస్తే గెలుపు పక్కన పెడితే కనీసం ప్రచారంలోనైనా ఆదరిస్తారన్న ఆలోచనతో ఉన్నారు. లేదంటే ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడం మంచిదనే యోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా నాయకత్వానికి కూడా అవే సంకేతాలు పంపించినట్టు తెలిసింది. దీంతో ఉలిక్కిపడిన జిల్లా నాయకులు అప్రమత్తమై మాజీ కౌన్సిలర్లు, క్రియాశీలకంగా పనిచేసిన నాయకులతో సంప్రదింపులు చేసేందుకు రంగంలోకి దిగారు. అటువంటి ఆలోచన వద్దని, పార్టీ తరఫున పోటీ చేయాలని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఒప్పిస్తున్నారు. కానీ నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ససేమిరా అంటున్నారు. అయితే అభ్యర్థి ఖర్చంతా భరిస్తానని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని కాంగ్రెస్ కీలక నేత ఒకరు భరోసా ఇస్తున్నారు. ఇంతలా చెబుతున్నా పోటీ చేసేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆ మధ్య ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినా జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి పోటీ చేసేదెవరు అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇంతవరకు ఆ పార్టీ అభ్యర్థిగా ఏ ఒక్కరూ ప్రజలకు వద్దకు వెళ్లడం లేదు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసేదెవరనేది తేలాకే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఎన్నికల జోష్ ఏ మాత్రం కన్పించకుండా కాంగ్రెస్ స్థబ్దుగా ఉంది. బెల్టు దుకాణాలు మూసివేయూలి విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున అనధికార బెల్టు దుకాణాలు మూసివేయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీసీ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘ సూచనలతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో మద్యం విక్రయాలు, సరఫరాపై నిరంతం నిఘా ఉంచాలన్నారు. ప్రధానంగా విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల పరిధిలో బెల్టుదుకాణాలను మూసివేయించాలన్నారు. లెసైన్సు ఉన్న మద్యం దుకాణాలు నిబంధనల ప్రకారం నడిచేలా పర్యవేక్షణ చేయాలన్నారు. సరిహద్దుల వెంబడి చెక్పాయింట్లు, ఇంటిలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మూడు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సముద్ర తీరం నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రత్యేకంగా ఒక నిఘా బృందాన్ని తీర ప్రాంతంలో కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆనందరాజు, విజయనగరం, పార్వతీపురం ఎక్సైజ్ సూపరిండెండెంట్లు పి.శ్రీధర్, వెంకటేశ్వర్లు, పార్వతీపురం ఏఈఎస్ ప్రసాద్, ఎక్సైజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. -
విభజన గుబులు
సాక్షి, ఏలూరు : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాజకీయ నాయకుల తలరాతలు మారేవి. రాష్ట్ర విభజనతో ఇప్పుడు ఎన్నికలకు మందే వారి తలరాతలు తెలిసిపోతున్నాయి. ఎన్నికలకు వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. జిల్లాలో నిన్నమొన్నటి వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. రాష్ట్ర విభజన జరిగిపోవడంతో ఉద్యమం నిలిచిపోయింది. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆరు నెలలు నడిచిన ప్రజా పోరాటంతో రాజ కీయ పార్టీల అంతరంగం బయటపడింది.ప్రజాప్రతినిధుల స్వార్థాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ఇది ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనుందనేది విశ్లేషకుల భావన. దీంతో నేతల్లో గుబులు పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే మునిసిపల్ ఎన్నికలు జరగనుండటంతో వారిలో వణుకు మొదలైంది. ఈనెల 30న జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తోపాటు నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. అంతలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలోని 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మునిసిపల్ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ స్థితి ఏమిటనేది బయటపడిపోయి, ప్రధాన ఎన్నికల్లో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని కాంగ్రెస్, టీడీపీలు భయపడుతున్నాయి. ఈ భయంతోనే మూడేళ్లుగా మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ వ చ్చిన కాంగ్రెస్ పాలకులకు సుప్రీం కోర్టు జో క్యంతో సంకట పరిస్థితి ఏర్పడింది. ఇవి ఎగ్జిట్ పోల్స్ లాంటివని, ఫలితాలు వెల్లడవగానే తమ డొల్లతనం బయటపడుతుందని వణికిపోతున్నారు. ఎన్నికలు ఎలాగూ తప్పవు కాబ ట్టి ఫలితాలైనా వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మొరపెట్టుకుంటున్నారు. జిల్లాలో అయితే నేతలు తమ భవిష్యత్ ఏమిటో మీరే తేల్చండంటూ కార్యకర్తలతో అత్యవసర సమావేశాలు జరుపుతున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకు వేసి తప్పుచేశాం ఇప్పుడు ఏం చేయమంటారంటూ నిస్సిగ్గుగా ప్రజలకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. కానీ వారిని ఇంకా నమ్మి మరోసారి వంచనకు గురయ్యేందుకు జనం సిద్ధంగా లేరు. ఈ విషయం నాయకులకు కూడా అర్థమైంది. సమైక్యాంధ్రపై చివరి వరకూ మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రా న్ని చీల్చేసిన తరువాత రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయామని చెబుతుంటే జిల్లా ప్రజ లు మండిపడుతున్నారు. ఆ పార్టీ నాయకుడినని, కార్యకర్తనని చెప్పుకుని జనంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. చేసిన తప్పుకు తలెత్తుకోలేక, ఓట్లు ఎలా అడగాలో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వారికి కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ భ వి ష్యత్‌ను నాశనం చేశారంటూ నాయకులను దుమ్మెత్తిపోస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది టీడీపీ దుస్థితి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇస్తే జిల్లాలో ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర అంటూ నాటకాలాడారు. నడిరోడ్డుపై సమైక్యవా దులు నిలదీస్తే సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు. ఇప్పుడు ఓట్లు అడగడానికి జనం వద్దకు వెళితే తమ పరిస్థితి ఏమిటని వారి అందోళన. ఆ రెం డు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీ మారితేనైనా జనానికి ముఖం చూపించగలమని భావిస్తున్నారు. -
ఊరూవాడా ఉద్యమంలా..
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న గడగపడకూ సమైక్యనాదం ఉద్యమంలా సాగుతోంది. పల్లెల్లో సమైక్య హోరు మారుమోగుతోంది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలకు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఊరూవాడా అనూహ్య స్పందన లభిస్తోంది. జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి మహర్దశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండి, అన్ని రంగాల్లోను అభివృద్ధి పథంలో పయనిస్తుందని పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం ఇటికాయలపల్లిలో శనివారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ విధివిధానాలు, ఇచ్చిన హామీలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. నెహ్రూ మాట్లాడుతూ వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ కావాలంటే జగన్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్ల పాటు సువర్ణ పాలన అందించే సత్తా జగన్‌కు ఉందన్నారు. ఇంటింటికీ తిరిగి పార్టీ కార్యక్ర మాలను వివరించారు. గండేపల్లి మండలం కె.గోపాలపురంలో నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. విభజనకు బాబు, సోనియా కుమ్మక్కు కుట్రలు ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని ముక్కలు చేసేందుకు చంద్రబాబుతో కలిసి సోనియాగాంధీ కుట్రలు చేస్తోందని పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రామచంద్రపురం మండలం తాటిపల్లిలో శనివారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పార్టీ విధానాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తారన్నారు. కాకినాడ ముత్తానగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. పార్టీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏలేశ్వరంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలన్నీ తీరుతాయన్నారు. పిఠాపురం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం మున్సిపాలిటీలోని 28వ వార్డులో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్, పార్టీ కోఆర్డినేటర్ సీహెచ్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కరప మండలం నడకుదురులో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మామిడికుదురు మండలం నగరంలో పార్టీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఏమిటీ దారుణం
‘ప్రజాస్వామ్య విలువలకు లోక్‌సభలో పాతరేశారు. ప్రజలు పనులు మానుకుని.. నెలల తరబడి ఉపాధి కోల్పోయినా.. పస్తులుండి మరీ సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. జనం ఏమైపోయినా పర్వాలేదు.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుంది. అందుకే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది అన్యాయమని ఆక్రోశించిన ప్రజా ప్రతినిధులను సభనుంచి గెంటించింది. ఈనెల 21వరకూ లోక్‌సభ సమావేశాలు జరుగుతుంటే.. 20వ తేదీ వరకూ మన ఎంపీలు రాకూడదంటూ సస్పెండ్ చేసింది. ఏమిటీ దారుణం’ అంటూ జిల్లా ప్రజలు ఆవేదన వెళ్లగక్కారు. గురువారం లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలపై కలత చెందారు. ఆరు నూరైనా విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. సాక్షి, ఏలూరు:తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఉదయం నుంచి లోక్‌సభలో ఏం జరగబోతోందనే విషయమై జిల్లా ప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదరుచూశారు. అక్కడ సీమాంధ్ర ఎంపీలకు ఎదురైన చేదు అనుభవాలను టీవీల్లో చూసి చలించిపోయారు. ఏమిటీ దారుణమంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయూరు. వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతి రేక నినాదాలు చేశారు. ఇన్నాళ్ల భీకర పోరాటాన్నే పట్టించుకోని గుడ్డి ప్రభుత్వం ప్రజల ఆగ్రహ జ్వాలల్లో తగలబ డక తప్పదంటూ శాపనార్థాలు పెట్టారు. సోనియూగాంధీ, మన్మోహన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. న్యాయం అడగటమే నేరమా జిల్లాలో ఎవరిని కదిపినా ఒకటే ఆవేదన.. భవిష్యత్‌ను తలచుకుని ఆక్రందన వ్యక్తమయ్యాయి. ‘1963లో ప్రారంభమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1984లో పూర్తయ్యింది. ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికే 21ఏళ్లు పడితే హైదరాబాద్ వంటి రాజధాని నిర్మించడానికి, అంతర్జాతీయ విమానాశ్రయూలు, ఎంఎంటీఎస్ వంటి రైల్వే వ్యవస్థ, హైటెక్ సిటీ, సెంట్రల్ యూనివర్శిటీలు, పరిశ్రమలు, ఫ్లై ఓవర్లు నిర్మించడానికి ఎన్నేళ్లు పడుతుంది. అప్పటివరకూ నిరుద్యోగులుగా మారి అడుక్కుతినాలా.. సాగు నీరు, తాగునీటి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో పోరాటాలు చేస్తున్నాం. బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణాలను ఆపలేకపోయాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పోలవరం ప్రాజెక్టు పూర్తవడం అసాధ్యం. జిల్లాలో కరువు కాటకాలు వస్తాయి. పరిశ్రమలు ఏర్పాటుకు మన దగ్గర వనరులు లేవు. ఉపాధి అసలే దొరకదు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించేస్తే ఇక్కడ వారికి సరిపడా పోస్టులు లేవు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాలి. రాష్ట్రం ముక్కలైతే నీటి యుద్ధాలు, కరెంటు కష్టాలు వస్తాయి. మన దగ్గర జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేవు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేద్దామంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. రాష్ర్ట రెవెన్యూ ఆదాయంలో హైదరాబాద్ నుంచే 40 శాతం వస్తోంది. తెలంగాణ నుంచి 22 శాతం, సీమాంధ్ర నుంచి 18 శాతం మాత్రమే వస్తోంది. హైదరాబాద్‌ను వదులుకుంటే ఆదాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతాం. అందుకే విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్నాం’ ప్రతి ఒక్కరూ ఇవేమాటలు చెప్పారు. న్యాయం చేయమని కోరడమే ప్రజలు చేసిన నేరంలా కాంగ్రెస్ పార్టీ భావిస్తోం దంటూ వాపోయూరు. సామాన్యుల ఉద్యమానికి ఫలితమిదా సామాన్యులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సం ఘాలు, న్యాయవాదులు, రైతులు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు, వ్యాపార వాణిజ్య సంఘాల వారు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపిం చారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరుడు తన జేబులోని డబ్బునే ఖర్చు చేశాడు. ఎవరికి వారు చందాలు వేసుకుంటున్నారు. ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. రాష్ట్రం ముక్కలవుతుందనే బాధతో జిల్లాలో ఇప్పటికే నలుగురు ప్రాణత్యాగం చేశారు. గుండెపగిలి దాదాపు 100మందికి పైగా నేలకొరిగారు. ఈ పోరాటానికి.. ఇందరి త్యాగాలకు ఫలితమిదేనా అంటూ జిల్లా ప్రజలు పట్టరాని ఆగ్రహంతో ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ పాపం ఆ రెండు పార్టీలదే ఇంతటి అల్లకల్లోలానికి కాంగ్రెస్ పార్టీయే కారణమైందని, దీనికి తెలుగుదేశం పార్టీ ఆజ్యం పోసిందని జిల్లా ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఒకసారి ప్రయత్నించి కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇదే పరిస్థితి తీసుకువచ్చి పంతం నెగ్గించుకోవాలని చూస్తోందని వాపోయూరు. ఓట్ల కోసం ఆంధ్రుల జీవితాలతో ఆటలాడుకుంటోందని చెప్పారు. తెలుగు ప్రజలు విడిపోవాలంటూ.. వారిమధ్య ఈ ప్రభుత్వం చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ దానిపై సమైక్యవాదుల అభిప్రాయాలేమిటో తెలుసుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు. పధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది’ అంటూ జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ‘ఆ రెండు పార్టీలకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం జరగాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మొదటినుంచీ కోరుతోంది. జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు సైతం రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందు నడిచారు. ఎందరు ఎన్ని త్యాగాలు చేసినా.. ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ పాలకులు తాము అనుకున్నది చేసి తీరుతామనే మొండి పట్టుదలతో లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం’ దారుణం అంటూ ముక్తకంఠంతో నినదించారు. -
విభజన మంటలు
ఏలూరు, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ గురువారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపును అందుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను వేడెక్కించారు. విభజన నిర్ణయూన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కదం తొక్కారు. మరోవైపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిందన్న విష యం తెలిసి అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయూరు. రోడ్లపైకి వచ్చి సోనియూగాంధీ, మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్లమెం టులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతు న్న సమయంలో.. రాష్ట్రం విడిపోతుం దన్న మనస్తాపంతో ఏలూరులో కేఏహెచ్ఎల్ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థి మహ్మద్ ముజాహిద్దీన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థులు, పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సకలం బంద్ రాష్ట్ర విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సమైక్య బంద్ సంపూర్ణైమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం వేకువజాము నే ఆర్టీసీ డిపోలకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించేశారు. ఎన్జీవోలు, టీ డీపీ నాయకులు సమైక్య బంద్‌లో పాల్గొని వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు నగరంలో చైతన్య కళాశాలను మూయిస్తున్న సమయంలో ఎన్జీవో నాయకులు, విద్యాసంస్థ యూజమాన్యం మధ్య వాగ్వివా దం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో ధ ర్నా చేశారు. టీడీపీ నాయకులు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలను మూయించివేశారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్లో ధర్నా చేశా రు. రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో రైతు లు ప్రదర్శన నిర్వహించారు. సీఆర్ రెడ్డి అటానమస్ కళాశాల విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డుపై పడుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మలతో నగరంలో శవయూత్ర నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో అంత్యక్రియలు నిర్వహించారు. విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి ఢిల్లీ యూత్రకు వెళుతూ ఏలూరులో ఆగారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు డాక్టర్ ఏవీఆర్ మోహన్, న్యాయవాది కానాల రామకృష్ణ, ఎన్జీవోల తరఫున టి.యోగానందం, ఆర్ఎస్ హరనాధ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఊరూవాడా ఆందోళనలు భీమవరం పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోకు వెళ్లిన కార్యకర్తలు బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్‌లో రాస్తారోకో చేశారు. ఇక్కడే ఎన్జీవోలు, టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తెలంగాణ బిల్లుకు మద్దతిస్తే కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరిం చారు. వీరవాసరంలో బంద్ విజయవంతమైంది. ఉండిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసాపురంలో బంద్ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయూలను ఎన్జీవోలు మూయించివేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. కొవ్వూరులో పార్టీ సమన్వయకర్త తానే టి వనిత ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి దుకాణాలను మూయించేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ పాల్గొన్నారు. ఎన్జీవోలు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిడదవోలులో ఎన్జీవోలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులను మూయించేశారు. మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కొయ్యల గూడెంలో బంద్ విజయవంతమైంది. భీమడోలులో జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు, రాష్ట్ర రహదారిపై టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. చింతలపూడిలో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపీ నాయకత్వంలో బంద్ చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ పిలుపుమేరకు ఉద్యోగులు, నాన్‌పొలిటికల్ జేఏసీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. తణుకులో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో బంద్, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తేతలి వై జంక్షన్ వద్ద రాస్తారోకో చేయటంతో రెండు గంట లపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పీవీ రమణ, వైవీ సత్యనారాయణమూర్తి, ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పాలకొల్లులో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
బంద్నాలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలోనే సమైక్య ఉద్యమం పతాకస్థాయిని తాకుతోంది. విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు యూపీఏ సర్కారు మల్లగుల్లాలు పడుతుంటే.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ సహా సమైక్యవాదులు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా గురువారం వైఎస్ఆర్సీపీ, ఎన్జీవోలు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాసేందుకు ప్రభుత్వం తెగబడుతున్నట్లు దాని చర్యలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసుల ద్వారా ఉద్యమానికి సంకెళ్లు వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉన్న పళంగా పోలీస్ చట్టం సెక్షన్ 32ను అమల్లోకి తెస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో ఉద్యమాలు, నిరసనలు, బంద్ లు తీవ్రస్థాయిలో జరిగే అవకాశం ఉంది. పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు ప్రజలు కూడా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న గురువారం సీమాంధ్ర బంద్‌కు వైఎస్ఆర్సీపీతోపాటు ఎన్జీవో సంఘాలు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ఉద్యోగ సంఘాల జేఏసీలు పిలుపునిచ్చాయి. సంపూర్ణ బంద్ పాటించేందుకు అన్ని వర్గాలు సమాయత్తమవుతున్న తరుణంలో సెక్షన్ 32 విధించడం విభజన వ్యతిరేక జ్వాలను అడ్డుకునేందుకు యూపీఏ ప్రభుత ్వం పన్నిన పన్నాగమేనని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు.. ప్రజాభిప్రాయాన్ని ఆంక్షల సంకెళ్లతో బంధించేందుకు మాత్రం తెగిస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికి కాం గ్రెస్పార్టీ, ప్రభుత్వం తగినమూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. నెలరోజులపాటు సెక్షన్ 32 జిల్లాలో గురువారం ఉదయం 6 గంటల నుంచి పోలీస్ చట్టం 32 సెక్షన్ అమలులోకి వస్తుందని డీఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహించరాదు. ఎంపీలు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఇళ్ల వద్ద. విద్యా, వ్యాపార, ప్రభుత్వ సంస్థల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదు. బందులు, రోడ్ల దిగ్బంధం, దిష్టిబొమ్మల దహనం, రాస్తారారోలు, ర్యాలీలతోపాటు పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడటం నిషేధం. ప్రజలు, సంస్థలు, ఉద్యోగులు, సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ఇది వర్తిస్తుందని, నిషేధాజ్ఞలను ఆతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. -
సమైక్యం కోసం.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం
రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతి ఆమోదించ డాన్ని నిరసిస్తూ.. .జిల్లా వ్యాప్తంగా సమైక్య వాదులు ఆందోళనలు చేపట్టారు. ఎన్జీఓలతో పాటు టీడీపీ, విశాలాంధ్ర మహాసభ నాయకులు యూపీఏ ప్రభుత్వం, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బిల్లును అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమై తే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని విశాలాంధ్ర మహాసభ నాయకులు స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు వారి మధ్య చిచ్చుపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించా రు. విభజన బిల్లుకు సహకరిస్తున్న సీమాంధ్ర రాజకీయ నాయకులను తరిమికొడతామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం వి శాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి యూపీఏ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో పాటు సీమాంధ్ర కేంద్రమంత్రుల ఫొటోలతో శవ పేటిగ తయూరు చేసి, దహనం చేశారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చక్రవర్తి మాట్లాడు తూ సమైక్య ఉద్యమం అంతం కాదని, ఇది కేవలం ఆరంభమేనని చెప్పారు. సమైక్య రా ష్ట్రాన్ని సాధించుకునేందుకు అవసరమైతే ప్రా ణత్యాగాలైనా చేస్తామని స్పష్టం చేశారు. రా జ్యాంగానికి వ్యతిరేకంగా, సమైక్యస్ఫూర్తికి వి రుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని యూపీఏ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు. పార్లమెంట్లో బి ల్లు ప్రవేశపెట్టిన క్షణంలో అందరూ ఏకమై రాజకీయాలకు అతీతంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నే తలు ప్రభూజి, గంటా వెంకటరావు, మద్దిల సోంబాబు, అనిల్, భరత్, పాల్గొన్నారు. -
తహశీల్దార్ల బదిలీలు కదలిక లేదు
సమైక్య ఉద్యమం ఎఫెక్ట్ వాళ్లు రాలేదు.. వీళ్లు వెళ్లలేదు బదిలీ ఉత్తర్వులకు స్పందించని తహశీల్దార్లు నేడు రెవెన్యూ అసోసియేషన్ నిర్ణయం హైకోర్టు ఉత్తర్వులతో ఎంపీడీవోల బదిలీలు అనుమానమే సాక్షి, మచిలీపట్నం : తహశీల్దార్ల బదిలీలపై సమైక్య ఉద్యమ ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు చర్యలు తీసుకోవడంపై కన్నెర్ర చేస్తున్న ఉద్యోగ వర్గాలు బదిలీ ఉత్తర్వులకు స్పందించడం లేదు. సోమవారం నాటి బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి కృష్ణా జిల్లాకు రావాల్సిన తహశీల్దార్లు రాలేదు. ఇక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లాల్సినవారూ కదల్లేదు. ఎక్కడి తహశీల్దార్లు అక్కడే ఉండటంతో భవిష్యత్ కార్యాచరణపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. నిరసన వ్యక్తం చేసేందుకే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు త్యాగాలకు సిద్ధపడి ముందుభాగాన నిలిచారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. అయినా కేంద్రంలోని యూపీఏ సర్కారుకు చీమకుట్టినట్టు లేదు. సమైక్య ఉద్యమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర విభజనకు తెగించింది. దీంతో గత కొద్దిరోజులుగా ఉద్యోగులు మరోమారు ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అసోసియేషన్ కూడా సమైక్య రాష్ట్రం కోసం సమ్మెబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల బదిలీల్లో భాగంగానే జిల్లాల్లో పెద్ద సంఖ్యలో తహశీల్దార్ల బదిలీలు జరిగాయి. అయితే వారంతా విధుల నుంచి రిలీవ్ కాకుండా తమ నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. ఎంపీడీవోల బదిలీ అనుమానమే.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లాలోని ఎంపీడీవోల బదిలీలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎంపీడీవోలకు ప్రత్యక్షంగా ఎన్నికల విధులు అప్పగించని నేపథ్యంలో వారి బదిలీలు చేయకూడదని, ఎన్నికల విధులు కేటాయించేవారినే బదిలీ చేయాలని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్‌కు పంపించారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మేరకు ఎంపీడీవోల బదిలీలపై నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రెవెన్యూ అసోసియేషన్‌లో తర్జనభర్జన ఎన్నికల బదిలీల్లో భాగంగా భూ పరిపాలన ప్రధాన అధికారి (సీసీఎల్ఏ) నుంచి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా నుంచి 38 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. అందులో తూర్పుగోదావరికి 20 మంది, పశ్చిమగోదావరికి 18 మంది వెళ్లాలని ఆదేశాలిచ్చారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి 43 మంది తహశీల్దార్లు కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. వారిలో తూర్పుగోదావరి నుంచి 24 మంది, పశ్చిమగోదావరి నుంచి 19 మంది రావాల్సి ఉంది. తహశీల్దార్లు ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణం వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి కలెక్టర్లకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సమైక్య ఉద్యమానికి మద్దతు పలుకుతున్న తహశీల్దార్లు అంతా బదిలీల ఉత్తర్వులను అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లా నుంచి రిలీవ్ కాలేదు. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన తహశీల్దార్లు కూడా రాలేదని కలెక్టరేట్ వర్గాలు ధృవీకరించాయి. బదిలీ ఉత్తర్వుల అమలుపై రెవెన్యూ అసోసియేషన్‌లో తర్జన భర్జన సాగుతోంది. ఎన్నికల బదిలీలు కావడంతో అమలు చేయకపోతే ఇబ్బంది అవుతుందని కొందరు, వాటిని పాటించకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకాలని ఇంకొందరు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని అమలుచేసేలా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బుధవారం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. -
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూత
సాక్షి, గుంటూరు :సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు చేపట్టిన ఏపీ ఎన్జీవోలు సోమవారం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ మూయించారు. ఉదయం 9 గంటల నుంచే రోడ్ల మీదకొచ్చిన ఎన్జీవో సంఘ నాయకులు, ఉద్యోగులు సమైక్య పరిరక్షణ వేదిక జెండాలను పట్టుకుని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బీఎస్ఎన్ఎల్, తపాలా, ప్రావిడెంట్‌ఫండ్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసుల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగుల్ని అడ్డుకుని సమైక్య రాష్ట్రానికి మద్దతు పలకాలని కోరారు. విధులను పక్కనబెట్టి సమైక్య నినాదాన్ని కేంద్రానికి తెలియజేయాలని కోరారు. దీంతో గుంటూరులోని తపాలా కార్యాలయాలు, బీఎస్ఎన్ఎల్, ప్రావిడెంట్, ఎల్ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు 11 గంటలకల్లా ఇంటిముఖం పట్టారు. గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట,వినుకొండ, సత్తెనపల్లి వంటి ప్రధాన పట్టణాల్లో ఎన్జీవోల ఆందోళనలు ఉధ్రుతంగా జరిగాయి. గుంటూరు కలెక్టరేట్ నుంచి బయలు దేరిన ఎన్జీవోల నిరసన ర్యాలీ జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఉద్యమం విజయవంతానికి ఉద్యోగులంతా సహకరించాలన్నారు. ఈనెల 12న జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు తెలిపారు. ఎన్జీవో సంఘ నాయకులు వెంకయ్య, నాగరాజు, కోటేశ్వరరావు, శ్రీకష్ణ, దయానందరాజు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన సమైక్య పోరు
సాక్షి, కాకినాడ :రాష్ట్ర విభజనను అడ్డుకునే సంక ల్పంతో ఏపీ ఎన్జీఓలు చే స్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఐదోరోజుకు చేరుకుంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణవేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, కార్యకలాపాలను స్తంభింపచేశారు. మరోపక్క ప్రభుత్వ వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది కూడా విధులు బహిష్కరించి సమ్మెలో చేరారు. రాజ్యసభలో మంగళవారం ప్రవేశపెడుతున్న తెలంగాణ బిల్లును లోక్‌సభకు రానివ్వకుండా వీగిపోయేలా సీమాంధ్ర ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం డిమాండ్ చేశారు. కాకినాడలో ఆశీర్వాదం, సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో ఎన్జీఓలు బృందాలుగా ఏర్పడి జిల్లా తపాలా, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. వివిధశాఖల ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి జిల్లాపరిషత్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ ఎదుట నిరసన శిబిరం వరకు ర్యాలీ చేపట్టారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్ పాటించాలని ఆశీర్వాదం విజ్ఞప్తి చేశారు. ఎన్జీఓ సంఘం నగర అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు రాజమండ్రి మూడవపట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఏపీ ఎన్జీఓ భవన్ నుంచి ర్యాలీగా బయల్దేరి బీఎస్ఎన్ఎల్, సీటీఆర్ఐ, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయాలను మూయించారు. ఓఎన్జీసీ, గెయిల్ కార్యాలయాల వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విధులు బహిష్కరించినా వైద్యసేవలు.. వైద్యుల జేఏసీ పిలుపు మేరకు కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్యులతో పాటు ఇతర సిబ్బంది విధులను బహిష్కరించారు. అయితే విష యం తెలియక ఆస్పత్రులకు వచ్చిన రోగుల కు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం వరకు వైద్య సేవలను కొనసాగించారు. కాగా మంగ ళవారం నుంచి అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రుల వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు కూడా సోమవారం నుంచి సమ్మె బాట పట్టడంతో గ్రామ సచివాలయాలు మూతపడ్డాయి. ఒకపక్క పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాటపట్టగా, సమైక్యాంధ్ర కోసం మున్సిపల్ ఉద్యోగులు రెండు రోజుల పెన్‌డౌన్‌ను సోమవారం ప్రారంభించారు. బుధవారం నుంచి వారు కూడా నిరవధిక సమ్మెలోకి రానున్నారు. -
బీ అలర్ట్ !
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి. ప్రసాదరావు ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావు తొలిసారిగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు. శాంతిభద్రతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, రానున్న ఎన్నికలపై కోస్తా రీజియన్ ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షించారు. జిల్లా పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవహరించాల్సిన తీరు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బైండోవర్లపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు అదనపు బలగాలు రానున్న ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. 2009 ఎన్నికల నిర్వహణలో అమలు చేసిన విధానాలను దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అదనపు బలగాల విషయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని డీజీపీ తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పోలీస్ సిబ్బంది బదిలీలు జరిగాయన్నారు. సైబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత సిబ్బందికి వివిధ మాడ్యూల్స్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తున్నామన్నారు. బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి రాష్ర్ట్రంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నకిలీ కరెన్సీని పూర్తిగా నిరోధించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు శాఖలో వివిధ హోదాలకు సంబంధించి పదోన్నతుల విషయంలో కొందరు ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించడం వల్ల జాప్యం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. సమీక్షలో కోస్తా రీజియన్ (విశాఖపట్నం) ఐజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్, పశ్చిమ ఎస్పీ ఎస్. హరికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎన్.శివశంకరరెడ్డి, రాజమండ్రి అర్భన్ పోలీస్ జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి, మూడు జిల్లాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
బీ అలర్ట్..!
సాక్షి, ఏలూరు:సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. ఎన్నికలయ్యేంత వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావు తొలిసారిగా ఆదివారం జిల్లాకు వచ్చారు. శాంతిభద్రతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, రానున్న ఎన్నికలపై కోస్తా రీజియన్ ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవహరించాల్సిన తీరు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బైండోవర్లపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరంవిలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు అదనపు బలగాలు రానున్న ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. 2009 ఎన్నికల నిర్వహణలో అమలు చేసిన విధానాలను దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అదనపు బలగాల విషయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని డీజీపీ తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పోలీస్ సిబ్బంది బదిలీలు జరిగాయన్నారు. సైబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత సిబ్బందికి వివిధ మాడ్యూల్స్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తున్నామన్నారు. బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి రాష్ర్ట్రంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నకిలీ కరెన్సీని పూర్తిగా నిరోధించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు శాఖలో వివిధ హోదాలకు సంబంధించి పదోన్నతుల విషయంలో కొందరు ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించడం వల్ల జాప్యం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, నూతన భవనాల నిర్మాణం కోసం ఇక నుంచి రాష్ట్ర పోలీస్ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరతామన్నారు. ఈ సమీక్షలో కోస్తా రీజియన్ (విశాఖపట్నం) ఐజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్, ఎస్పీ ఎస్.హరికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎన్.శివశంకరరెడ్డి, రాజమండ్రి అర్భన్ పోలీస్ జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి, మూడు జిల్లాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. డీజీపీకి ఘన స్వాగతం తొలిసారిగా జిల్లాకు వచ్చిన డీజీపీ ప్రసాదరావుకు జిల్లా పోలీసులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం గన్నవరం విమాశ్రయం నుంచి ఏలూరు చేరుకుని స్థానిక పోలీస్‌గెస్ట్ హౌస్‌లో మధ్యాహ్న భోజనం పూర్తి చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పలువురు పోలీసులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. -
నిరసన జ్వాల
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్య మం ఊపందుకుంది. సమ్మెకు దిగిన ఎన్జీవోలతో కలసి సమైక్యవాదులు, విద్యార్థులు కదం తొక్కారు. శనివారం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. పెరవలిలో ఎన్జీవోలు రాస్తారోకో చేశారు. పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎన్జీవోలు ధర్నా చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ కన్వీనర్ గుడాల హరిబాబు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వారికి సంఘీభావంగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం మెంటేవారి తోటలో వండర్ కిడ్స్, శ్రీ విద్యానికేతన్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. బుధవారం మార్కెట్ సెంటర్‌కు చేరుకుని రాస్తారోకో చేశారు. కొవ్వూరు విజయవిహార్ సెంటర్లో విద్యార్థులు, ఎన్జీవోలు రాస్తారోకో జరిపారు. కొయ్యలగూడెం సెంటర్లో ఎన్జీవోలు, కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ‘ప్రజలు కావాలా.. పదవులు కావాలా’ ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కోట్లాది ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు నాటకాలాడటం సబబు కాదని ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరి షత్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమైక్య దీక్షా శిబిరం వద్ద ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం మోకాళ్లపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు పదవులు కావాలో.. ప్రజలు కావోలో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం అర్పిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటే కేంద్ర మంత్రులు మాత్రం పదవుల కోసమే ప్రాకులాడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులంతా తక్షణమే పదవులకు రాజీనామా చేయూలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.రాంబాబు, సుభాకర రత్నం, ఎన్‌కేడీ శ్రీనివాసరావు, విజ యకుమార్, హనుమంతరావు, తామాడ అప్పారావు, పూర్ణశ్రీ, భాస్కరలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రలో ప్రకంపనలు సృష్టించాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళంలో ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించనున్న సభ ఉత్తరాంధ్రలో ప్రకంపనలు సృష్టించేలా జరగాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి పాల్గొనే ఈ సభ విజయవంతంలో అందరూ భాగస్వాములు కావా లన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ జగ న్ కీర్తి పతాకం రాష్ట్రవ్యాప్తంగా ఎగురవేసేందుకు ఈ సభ నాంది కావాలన్నారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేరనున్న నేపధ్యంలో ఆయన రాకను ప్రతిఒక్కరూ స్వాగతించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందో.. ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకునేలా మనమంతా కృషి చేయాలన్నారు. ఇతర రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టేలా తొమ్మిదో తేదీ సభ నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం మొదటినుంచి ఉద్యమిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీయేనన్నారు. నిరంతరం ప్రజా సమస్య లపై పోరాడే పార్టీగా గుర్తింపు పొందిందని, అందుకే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు వైఎస్ఆర్ సీపీలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ 9వ తేదీన నిర్వహించనున్న సభలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణుులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల ముందు నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు భావించాలన్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సును కాంక్షించే పార్టీ వైఎస్ఆర్ సీపీ అన్నా రు. రాష్ట్రాన్ని విభజించేందుకు చంద్రబాబు యత్నిస్తు న్నారని, అదేబాటలో ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. ధర్మానలాంటి నాయ కుడు రావడం ద్వారా పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అవుతోందన్నారు. శ్రీకాకు ళం నియోజక వర్గ సమన్వయకర్త వై.వి.సూర్య నారా యణ మాట్లాడుతూ ధర్మాన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదన్నా రు. ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ మాట్లాడుతూ బహిరంగసభను విజయ వంతం చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ సత్తాను చాటాలన్నారు. రాజాం సమన్వయకర్త పీఎంజే బాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా వారిని స్వాగతించాలన్నారు. పాలకొండ సమన్వయకర్త పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ధర్మాన వంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీలో చేరితే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయ మన్నారు. పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు మాట్లాడుతూ ధర్మాన రాకతో జిల్లాలో పార్టీకి ఎదురులేకుండా ఉంటుందన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్ మాట్లాడుతూ జగన్‌పై, పార్టీపై దుష్ర్పచారం చేస్తున్న తరుణంలో ఈ సభ ద్వారా వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ టెక్కలి, పాలకొం డ,పాతపట్నం, సమన్వయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, విశ్వసరాయి కళావతి, కలమట వెంకటరమణ, పార్టీ కేంద్రకార్య నిర్వాహకమండలి సభ్యులు కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బల్లాడ హేమమాలినీరెడ్డి, నాయకులు ధర్మాన ఉదయ్ భాస్కర్, గేదెల పురుషొత్తం, టి.కామేశ్వరి, డాక్టర్ పైడి మహేశ్వరరావు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, అబ్దుల్ రెహమాన్, అంధవరపు సూరిబాబు, జి.టి.నాయుడు, శిమ్మ వెంకట్రావు, వి.ధనలక్ష్మి, రవిప్రసాద్, కరిమి రాజేశ్వరరావు, మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు. -
పేటలో మార్మోగిన సమైక్య నినాదం
చిలకలూరిపేట టౌన్, న్యూస్‌లైన్:పట్టణంలో సమైక్య నినాదం మార్మోగింది. విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చారు. తొలుత ఎన్ఆర్టీ సెంటర్లో మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుదాసు, ఏపీ ఎన్జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు, డిప్యూటీ తహశీల్దార్ నాంపల్లి నాగమల్లేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎన్ఆర్టీ సెంటర్ నుంచి బయలు దేరిన ర్యాలీ చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, గడియారస్తంభం సెంటర్, అడ్డరోడ్డు సెంటర్ మీదుగా తిరిగి ఎన్ఆర్టీ సెంటర్‌కు చెరుకుంది. ఎన్సీసీ విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. కళామందిర్ సెంటర్లో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఐదువేల మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఏపీఎన్జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ పలువురు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని విమర్శించారు. పంచాయతీ రాజ్ ఏఈ బి.మోహనరావు మాట్లాడుతూ సీమాంధ్రులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు మనకు కాకుండా పోతాయన్నారు. ఆర్టీసీ డిపోమేనేజర్ ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విభజనతో సీమాంధ్ర ఆర్టీసీకి అప్పులు, తెలంగాణ ఆర్టీసీకి ఆస్తులు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి.భక్తవత్సలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండా గోపి, ఏఎంజీ సంస్థ సీఏవో విజయకుమార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, డి.ధనలక్ష్మి, సాంబశివరావు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి చేబ్రోలు మహేష్, సూదా రమేష్‌బాబు, కృష్ణారావు, అస్లాం, స్థానిక జర్నలిస్టు నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చీపురుపల్లి తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
చీపురుపల్లి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో వసూళ్లకు పాల్ప డి ఉద్యమాన్ని నడిపించారని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారినుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలతో చీపురుపల్లి తహశీల్దార్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ కాంతి లాల్ దండే సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తహశీల్దార్ సస్పెన్షన్ వెనుక రాజకీయ కారణాలున్నాయ న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నియోజకవర్గం. నిబంధనలకు విరుద్ధమైనా ఇక్కడ అధికా ర పార్టీ నాయకులు చెప్పింది చేయాల్సిందే. వారు ఆదేశించిందే వేదంగా పని చేస్తేనే ఉద్యోగంలో ఉంటారు. లేకుంటే బదిలీయే కాదు ఏకంగా సస్పెన్షనే ఉద్యోగులకు బహుమానం గా దక్కుతుంది. అందుకు ఉదాహరణే చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ సస్పెన్షన్ అని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పింది వినడం లేదన్న అక్కసుతోనే మంత్రి బొత్స స్థాయిలో కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తహశీల్దార్‌ను సస్పెండ్ చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ రామకృష్ణ, అధికార పార్టీ నాయకులను పక్కన పెట్టడమే కాకుండా పరోక్షంగా ఇతర పార్టీ నాయకులకు సహకరి స్తున్నారన్న అక్కసు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా ఏసీబీ ట్రాప్ చేయించేం దుకు కూడా ఇటీవల పూనుకున్నారన్న వాదనలు కూడా వినిపించాయి. రాజ కీయ కారణాలతో సస్పెన్షన్ వేటు వేయించడం అన్యాయమంటూ అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. -
ఢిల్లీకి చేరిన జర్నలిస్టుల ‘సమైక్య’ ఉద్యమ స్ఫూర్తి
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం కోటబొమ్మాళిలో జర్నలిస్టు 172 రోజులుగా చేస్తున్న ఉద్యమం అభినందనీయమని, ఈ స్ఫూర్తి ఢిల్లీ వరకూ వెళ్లిందని ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు అన్నారు. దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయతోపాటు జర్నలిస్టు నాయకులు సందర్శించారు. దీక్షలో ఉన్న జర్నిలిస్టులు ఎన్.హరిప్రభాకర్, రవికుమార్, ఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు వలసయ్య, శాంతారావు, న్యాయవాది ఎల్.శ్రీనివాసుల మెడలో పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రులు ఆరంభశూరులు కారు.. దేన్నయినా సాధిస్తారని రుజువు చేశారన్నారు. అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన జరుగుతోందని, ఈ అంశాన్ని ఏపీజేఎఫ్ ఢిల్లీదాకా తీసుకెళ్లిందన్నారు. విశాఖ, హైదరాబాద్‌లలో పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. పార్లమెంటులోనూ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. సమాజానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెప్పడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి ఊరకనే పోదన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుదుర్గారావు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దనరావు, రవిచంద్ర, ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, రాజేంద్రనాయుడు, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. -
ఆగేది ఉద్యమం కాదు.. విభజన
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఎవరు అడ్డుకున్నా ఆగదని, ఆగేది రాష్ట్ర విభజన అనే సత్యాన్ని స్వార్థపు తెలంగాణ రాజకీయ శక్తులు తెలుసుకునే సమయం ఆసన్నమైందని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టిన విభజన ప్రక్రియ రాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు స్థాయిలో ఎక్కడైనా ఆగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త కార్వనిర్వాహక మండలి (జేఈసీ) ఆధ్వర్యంలో బుధవారం ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నగరంలో బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద మౌన దీక్ష.. జిల్లా వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 120 బస్సుల్లో తరలివచ్చిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులతో బయలుదేరిన ర్యాలీని స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద లావు రత్తయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేపట్టిన ర్యాలీకి సమైక్యాంధ్ర జేఏసీ, పరిరక్షణ సమితి నాయకులు మద్ధతు పలికి, బీఆర్ స్టేడియం నుంచి పాదయాత్ర చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో పార్లమెంటులో బిల్లును ఓడించే బాధ్యత ఇక ఎంపీల భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఫిబ్రవరి 7న పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై జరిగే చర్చలో సీమాంధ్ర ఎంపీలు కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రజా ప్రతినిధుల ఇళ్ళ ముందు మౌన దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రజా ప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని, పార్లమెంటులో విభజనకు వ్యతిరేకంగా ఓటు వేయని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, విద్యార్థులు, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ, పార్లమెంటులలో కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. దీక్షలకు సంఘీభావం.. ర్యాలీలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం హిందూ కళాశాల సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించిన విజ్ఞాన్ రత్తతయ్య, జేఏసీ నాయకులు రాజకీయ వేదికపై రిలే దీక్షలో కూర్చున్న మహిళలకు సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి ఏసీ కళాశాల, అరండల్‌పేట ఫ్లై ఓవర్, లాడ్జి సెంటర్, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం మీదుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో విద్యాసంస్థల జేఈసీ అధ్యక్షుడు డాక్టర్ జి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి వాసిరెడ్డి విద్యాసాగర్, కన్వీనర్ కోలా శేషగిరిరావు, రిటైర్డు డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఆర్. రాము, ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధాకర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఎండీ హిదాయత్, కసుకుర్తి హనుమంతరావు, విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, మన్నవ సుబ్బారావు, జి.శ్రీకూర్మనాథ్, మద్ధినేని సుధాకర్, పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్తకంపై మరింత వాయింపు
సాక్షి, రాజమండ్రి : నగరపాలక సంస్థల్లో వర్తకులపై ఏటా విధించే వర్తకపు పన్ను (ట్రేడ్ ట్యాక్స్) 50 శాతం వరకూ పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పెరిగిన పన్నులు చెల్లించాల్సిందిగా వర్తకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నగరపాలక సంస్థల్లో వ్యాపారాలు చేసేవారు ఏటా ట్రేడ్ ట్యాక్స్ చెల్లించాలి. దీనిని ప్రతి మూడేళ్లకు 33.3 శాతం మించకుండా పెంచుతారు. కానీ పురపాలక శాఖ ఈ ఏడాది కొన్ని రకాల వ్యాపారాలపై 50 శాతం పన్నులు పెంచేసి, వాటిని చెల్లించి తీరాలని ఆదేశించింది. ఈ మేరకు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. సుమారు 390 పైగా రకాల వ్యాపారాలపై ఉన్న పన్నులను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చివరికి ఇంటింటికీ తిరిగి పాలమ్ముకునేవారిని కూడా వదల్లేదు. ఈ అడ్డగోలు పెంపుదలను వర్తకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పన్నుల పెంపు శాతాన్ని తగ్గించాలని కోరుతూ రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మంగళవారం నగరపాలక సంస్థ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన పన్నులు తగ్గించకుంటే చాంబర్ పరిధిలోని వర్తక సంఘాలతో సంప్రదించి ఉద్యమించడానికి కూడా వెనుకాడబోమని చాంబర్ కార్యదర్శి బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఇప్పటికే వర్తకులు నష్టపోయారని, ఈ సమయంలో పన్నులతో మరింత ఇబ్బంది పెట్టడం సరి కాదని అన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనను ఈ ఏడాదికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ వ్యాపారాలపై పన్నుల పెంపు ఇలా.. వ్యాపారం అమలులో పెంచిన పన్ను ఉన్న పన్ను (రూ.లలో) కిరాణా దుకాణాలు 593 890 హోల్‌సేల్ కిరాణా 354 531 నూనె వ్యాపారం (హోల్‌సేల్) 806 1209 నూనె వ్యాపారం (రిటైల్) 354 531 అపరాల వ్యాపారం (హోల్‌సేల్) 1000 1500 అపరాల వర్తకులు (రిటైల్) 470 876 ఉల్లి, చింతపండు (హోల్‌సేల్) 983 1475 ఉల్లి, చింతపండు (రిటైల్) 283 425 స్టేషనరీ దుకాణాలు 761 1142 వస్త్రాలు 806 1209 చిన్న వస్త్ర వ్యాపారులు 470 705 మొబైల్ పాల వ్యాపారులు 335 452 పాలు, పెరుగు, నెయ్యి దుకాణాలు 470 705 -
మిరపకుచెరుపు
పెదకూరపాడు, న్యూస్‌లైన్: మిర్చి పంటకు ఆశించిన బబ్బరు తెగులు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెగులు సోకిన మొక్కలు ఎదుగుదల లేకపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో నీరు పెట్టినా ఆకులు ముడుచుకుపోయి మొక్కలు ఎండిపోతున్నాయని బెంబేలెత్తుతున్నారు. బబ్బరు తెగులుకు తోడు మాడు, కుళ్లుడు తెగుళ్లు కూడా మిర్చి పంటను పట్టిపీడిస్తున్నాయి. రసం పీల్చే పురుగులు అధికంగా ఉండి పంటకు చెరుపుచేస్తున్నాయి. ఈ తరహా పురుగులను అరికట్టేందుకు ఎన్ని రకాల మందులు పిచికారీ చేస్తున్న ప్రయోజనం ఉండటం లేదని రైతులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 55వేల హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో అధిక విస్తీర్ణంలో మిర్చి పంట వేశారు. ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో మిర్చి పంటను బబ్బరు తెగులు ఆశించడంతో రైతులు అల్లాడుతున్నారు. రసం పీల్చే పురుగులు, బొబ్బరు తెగులు కారణంగా పలు చోట్ల రైతులు మిర్చి మొక్కలను పీకి వేస్తున్నారు. పెదకూరపాడు, లగడపాడు, 75 త్యాళ్ళూరు, జలాల్పురం, హుసేన్‌నగరం తదితర ప్రాంతాల్లో మిర్చిని ముందుగా సాగు చేశారు. ఇలా సాగు చేసిన చోట్ల తెగుళ్లు అధికంగా ఉండటంతో మొక్కలు ఎదుగుదల లేక దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇచ్చే నాథుడే లేరు... తెగుళ్లతో మిర్చి రైతులు అల్లాడుతుంటే రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే అధికారులు కరువయ్యారు. ఖరీఫ్ సీజన్ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరగడంతో వ్యవసాయ శాఖ అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో పొలంబడి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఆ తరువాత కూడా పంటలను ఆశిస్తున్న తెగుళ్లపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యారు. తెగుళ్లకు ఏ మందులు పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేయాలని రైతులు కోరుతున్నారు. -
'సమైక్య ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారింది'
సమైక్యాంధ్ర ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారుతుందని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ... అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత మంది సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు అమ్ముడు పోయారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజాసంఘాలే భుజస్కంధాలపైకి తీసుకోవాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా కారెం శివాజీ గుర్తు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవశ్యకత ప్రజా సంఘాలకు ఉందని ఈ సందర్భంగా కారెం శివాజీ పేర్కొన్నారు. -
నేనున్నానని
సాలూరు, న్యూస్‌లైన్ : పట్టణంలోని డబ్బీవీధికి చెందిన యడ్ల విష్ణువర్థన్ (12) కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అరుకు పార్లమెంట్ సమన్వయకర్త కొత్తపల్లి గీత ఆదివారం రూ. 20 వేలు ఆర్థిక సహా యం అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ వీధి యువకులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను ఊరేగించి, స్థానికంగా ఉన్న చెరువులో దహన సంస్కారాలు చేస్తుండడంగా విష్ణువర్థన్ (12) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. అప్పట్లో బాలుడి కుటుంబాన్ని ఆదుకుం టామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు స్పందించారు. ఈ మేరకు ఆదివా రం ఆ బాలుడి తల్లిదండ్రులు యడ్ల శ్రీను, లక్ష్మికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి ఇద్దరి కుమార్తెలు గాయత్రి, గీత చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వారికి ప్రత్యేకంగా బ్యాంకులో అకౌంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా నేరుగా తమను కలవవచ్చునన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు బాలుడి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు సూరిబాబు, గరుడబిల్లి ప్రశాంత్‌కుమా ర్, మంచాల వెంకటరమణ, డొల బాబ్జీ, వైకుంఠపు మధు, రెడ్డి సన్యాసినాయుడు, మాజీ ఎంపీపీ తీళ్ళ సుశీల, పాల్గొన్నారు. -
సంక్రాంతి సెలవులపై సందిగ్ధత
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ అకడమిక్ కేలండర్ ప్రకారం ఏటా ఇస్తున్న విధంగానే ఈసారి 10 రోజులు సెలవులుగా పరిగణించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో పాఠశాలలు మూతబడిన కారణంగా సెలవుదినాలు, ఆదివారాల్లోనూ పాఠశాలలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి మూడురోజుల సెలవులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాఠశాలలు మూతబడగా, జిల్లాలో 50 రోజుల పాటు పాఠశాలలు తెరుచుకోలేదు. సెలవు లు పోనూ జిల్లాలో నికరంగా 33 పనిదినాల నష్టం జరిగింది. తెలంగాణా ప్రాంతంలోని పాఠశాలలకు ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ సెలవులివ్వగా, సీమాంధ్రలో మాత్రం ఈనెల 13, 14, 15 తేదీల్లో సెలవులుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో జిల్లాలో సమ్మెలోకి వెళ్లని ఉపాధ్యాయులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి దొంతు ఆంజనేయులును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాల విద్య డెరైక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే జిల్లాలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా పరిగణిస్తామని, దీనిపై ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. -
క్లైమాక్స్‌కు సీను!
అటా... ఇటా.. అసలెటు పోవాలి?.. ఎవరితో కలవాలి?.. ఎన్నికల్లోపు కొత్త పార్టీ వస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది?.. మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చినా, రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా ఇంకా ఎంత కాలం మౌన దీక్ష కొనసాగించాలి?.. ఈ రకమైన ఇబ్బందితో సతమతమవుతున్న అధికార పార్టీలోని పలువురు నేతలు ఈ నెల 23న తామెటో తేల్చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి గంటా శ్రీనివాసరావు పీసీసీ తనకు షోకాజ్ ఇస్తే సీఎం సహా సీమాంధ్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని మంగళవారం తొలిసారి పార్టీ హై కమాండ్‌పై నేరుగానే మాటల యుద్ధం ప్రారంభించారు. విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమ పరిణామం అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి జంప్ చేసే నేతల జాబితాలను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మంత్రి గంటాతో పాటు ఆయన మద్దతు దారులైన ఎమ్మెల్యేలు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, కన్నబాబు రాజు, చింతలపూడి వెంకట్రామయ్య ఉన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన విరమింపజేసినట్టు ప్రచారం జరుగుతోంది. వెళ్లాలనుకుంటున్న వారు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించకముందే తామే బయటకు పంపామనే రీతిలో వ్యవహరిస్తే మంచిదనే ఆలోచనతో బొత్స ఈ రకమైన ఎత్తు వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే విశాఖ జిల్లాలో మంత్రి గంటాకు షోకాజ్ నోటీసు ఇస్తున్నారనే ప్రచారం ప్రారంభమైనట్టు చర్చ జరుగుతోంది. గంటాతో పాటు మిగిలిన న లుగురు ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్ ఇస్తే వివరణ ఇవ్వకుండానే వారు వెళ్లిపోతారని పార్టీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడ్డారు సత్తిబాబు. ఇప్పటికే ఒక శాసన సభ్యుడిని ఆయన నేరుగా నువ్వు పార్టీ విడిచి వెళ్లిపోనని హామీ ఇస్తావా? అని పార్టీ నేతలందరి ఎదురుగానే అడిగి ఆ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చారు. శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తయ్యేంత వరకు వేచి చూసి అక్కడ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సమైక్యాంధ్ర లోకల్ చాంపియన్లుగా బయటకు రావాలని గంటా అండ్ కో వ్యూహ రచన చేసింది. ఇందుకోసం ముహూర్తం దగ్గర పడ డంతోనే గంటా తొలిసారి పీపీసీ అధ్యక్షుడిపై నేరుగా ఎదురుదాడికి దిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చర్చకు అదనపు సమయం కోరుతూ ఈ నెల 16 లేదా 17 తేదీల్లో రాష్ట్రపతికి ప్రభుత్వం లేఖ రాస్తుందని, సమయం వస్తే తమ నిష్ర్కమణ మరింత ఆలస్యం అవుతుందని, లేకపోతే 23 తర్వాత ముఖాలకు ఉన్న రాజకీయ మాస్క్‌లను తొలగించ వచ్చని గంటా ఇప్పటికే తమ మద్దతు దారులకు చెప్పినట్టు సమాచారం. -
విద్యార్థులకు విషమ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో మూడు రోజులుగా అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో జరిగే యూనిట్ పరీక్షలన్నింటికీ అవసరమైన ప్రశ్నపత్రాలు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ద్వారానే రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలో యూనిట్ పరీక్షల బాధ్యతను రాజీవ్ విద్యామిషన్ చూస్తుండగా, ప్రభుత్వ హైస్కూళ్లతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో డీసీఈబీ ముద్రించిన ప్రశ్నపత్రాలతోనే యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్రైమాసిక పరీక్షల నిర్వహణకు రాజీవ్ విద్యామిషన్ రూపొందించిన ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారానే ముద్రిస్తున్నారు. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలకు ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులకు ప్రశ్నపత్రాలను సరఫరా చేసిన డీఈసీబీ తాజాగా అర్ధ సంవత్సర పరీక్షలకు అవసరమైన పత్రాలను గత నవంబర్లోనే సిద్ధం చేసింది. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అర్ధ సంవత్సర పరీక్షలు డిసెంబర్లోనే నిర్వహించాల్సి ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో ప్రభుత్వం జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది. ఇందుకోసం ముందుగానే ప్రశ్నపత్రాలను ముద్రించి పెట్టిన డీసీఈబీ వాటిని మండలాల వారీగా పాఠశాలలకు పంపింది. దీంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులతో ఏళ్ల తరబడి ప్రశ్నపత్రాలను డీసీఈబీ ముద్రిస్తుండగా, ఆర్వీఎం ద్వారా ముద్రించిన ప్రశ్నపత్రాల్లో ప్రమాణాలు ఏ మేరకు ఉంటాయన్నది అనుమానమేనని స్వయంగా ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఆర్వీఎం ద్వారా ప్రశ్నపత్రాల సరఫరా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ యూనిట్ పరీక్షల నిర్వహణకే పరిమితమైన రాజీవ్ విద్యామిషన్ విద్యాహక్కు చట్ట ప్రభావంతో 6, 7, 8 తరగతుల బాధ్యతను తల కెత్తుకుంది. దీంతో ఆర్వీఎం జిల్లా అధికారులు విద్యాశాఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధ సంవత్సర పరీక్షల కోసం 6, 7, 8 తరగతులకు ప్రశ్నపత్రాలను ముద్రించి పాఠశాలలకు పంపారు. ఇవి కేవలం తెలుగు మీడియంవే కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు డీసీఈబీ పంపిన పత్రాలే దిక్కయ్యాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇటు ఆర్వీఎం, అటు డీసీఈబీ వేర్వేరుగా ప్రశ్నపత్రాలను పంపడంతో పరీక్షలు వేటితో నిర్వహించాలనే విషయమై ప్రధానోపాధ్యాయులు గందరగోళమవుతున్నారు. ఆర్వీఎం పంపిన పత్రాలు పూర్తిస్థాయిలో అన్ని మండలాలకు చేరకపోవడం, ఇంగ్లిష్ మీడియంలో పంపకపోవడంతో ప్రధానోపాధ్యాయులు మూడు రోజులుగా డీసీఈబీ పంపిన పత్రాలతోనే పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్వీఎం పంపిన ప్రశ్నపత్రాలతో మరలా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఆర్వీఎం నిర్వాకంతో ప్రస్తుతం అర్ధ సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మరోసారి పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల డీసీఈబీ పంపిన ప్రశ్నపత్రాలతో అర్ధ సంవత్సర పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. -
నేడు రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. సమైక్యాంద్ర ఉద్యమం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు ప్యానల్ తరపున జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈయన కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 56 మంది ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ అశోక్‌బాబు ప్యానల్‌కే పడే విధంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, శ్రీరాములు, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జి.రామకృష్ణారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈనెల 2వ తేదీన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి కూడా జిల్లాకు వచ్చి ప్రచారం నిర్వహించారు. అశోక్‌బాబు ప్యానల్‌పై పోటీ చేస్తున్న బషీర్ జిల్లాకు వచ్చి ప్రచారం చేయకపోయినా జిల్లాలో ఉన్న 56 మంది ఓటర్లతో మాట్లాడి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓటర్లందరూ అశోక్‌బాబు వెంట ఉంటున్నట్లు కనిపిస్తున్నా 10 నుంచి 15 ఓట్లు బషీర్ ప్యానల్‌కు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బషీర్‌కే ఓటు వేయనున్నట్లు కొందరు ‘న్యూస్‌లైన్’కు చెప్పడం ఇందుకు నిదర్శనం. అయితే జిల్లా ఓట్లు మొత్తం అశోక్‌బాబు ప్యానెల్‌కే పడతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. -
సాగని సర్కారీ చదువులు
బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ఎక్కడికక్కడ పాఠ్యాంశాలు పేరుకుపోతుండడం.. సిలబస్ ఓ పట్టాన పూర్తి కాకపోవడం వంటి సమస్యలకు కారణం ఉపాధ్యాయుల కొరతే. అందుకే ప్రభుత్వం ఎడ్యకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను తెరపైకి తెచ్చింది. ఉపాధ్యాయుల కొరత వెంటనే అధిగమించాలని నానా హడావుడి చేసింది. గత నవంబర్‌లో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొత్తం 56 మండలాల్లో 526 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు సంబర పడ్డారు. బీఈడీ, డీఈడీ పట్టభద్రులతో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎంఈఓ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు చేపట్టినా.. ఈ సారి నిబంధనలు మార్చామని.. అందరికీ ఒంగోలులో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎంఈఓలు దరఖాస్తులను ఒంగోలు రాజీవ్ విద్యా మిషన్‌కు పంపారు. అంతే.. కథ అక్కడితో ఆగింది. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. విద్యా సంవత్సరం కూడా ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. విద్య లక్ష్యం నెరవేరేదెలా? పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మధ్యాహ్నభోజనం పథకం అమలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, సూక్ష్మ ప్రణాళిక నివేదికలు, ఎస్ఎంసీ సమావేశాలు, డైస్ వివరాలు, హెచ్ఎం సమావేశాలకు ఉన్న ఒక్క ఉపాధ్యాయుడే హాజరు కావాలి. అలాగే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఆయన మాత్రమే బోధించాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య సిలబస్ కొండలా పేరుకుపోతోంది. పిల్లల గ్రేడ్లు పడిపోతున్నాయి. దీనికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలు సజావుగా సాగకపోవడంతో పాఠాలు చెట్లెక్కాయి. ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులున్న చోట కూడా బోధన సజావుగా సాగిన దాఖలాలు లేవు. ఎవరైనా సెలవు పెడితే.. ఆ భారమంతా మిగిలిన ఉపాధ్యాయులే చూసుకోవాలి. అది జరిగే పని కాకపోవడంతో.. ఇలాంటి పాఠశాలల్లో కూడా బోధన కుంటుపడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కచ్చితంగా భర్తీ చేయాల్సిన ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు భ ర్తీ కాకుండా నిలిచిపోయినా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దివాలాకోరుతనానికి నిదర్శనం. -
ఉపాధ్యాయ జేఏసీ వినూత్న నిరసన
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : సీమాంధ్ర కేంద్ర మంత్రుల కళ్లకు పట్టిన హైకమాండ్ అనే పొరను తొలగించి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా పరిషత్ సెంటర్లోని దీక్షా శిబిరం వద్ద కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పళ్ళం రాజు తదితరుల చిత్రపటాలలోని కళ్లను తుడిచి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రులు స్వతహాగా మంచివారైనా వారికి హైకమాండ్ అనే పొర కళ్లకు కమ్ముకుందని తెలిపారు. ఈ కారణంగానే రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని వివరించలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా హైకమాండ్‌ను ఎదిరించి రాష్ట్ర విభజనను నిలిపివేయడానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధామస్, సుభాకరరత్నం, హనుమంతరావు, భాస్కరలక్ష్మి, పూర్ణశ్రీ పాల్గొన్నారు. -
పూలు ముళ్లు
కాలం నిత్య సంచారి. ‘నిన్న నుంచి ‘నేటి’ మీదుగా ‘రేపటి’కి నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నెన్నో జ్ఙాపకాలను, అనుభవాలను మిగులుస్తుంది. అలా 2013 సంవత్సరం ఎన్నెన్నో తీపి అనుభూతులను, మరెన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. అవేంటో చూద్దాం. - సాక్షి, రాజమండ్రి జనవరి కొత్త సంవత్సరం వరాలు కురిపిస్తుందనుకున్న సర్కారు 2013 జనవరిలో చార్జీల మోతతో స్వాగతం పలికింది. ఏప్రిల్ నెల నుంచి విద్యుత్తు చార్జీలు పెంచాలంటూ ఈ నెల ఏడున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వంక పదో తేదీ నుంచి రైల్వే చార్జీలను కూడా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై విధించిన వ్యాట్‌కు వ్యతిరేకంగా రెండో దఫా ఉద్యమానికి ఈనెల 23 నుంచి జిల్లాలోని వస్త్రవ్యాపారులు తెరలేపారు. అత్యంత అట్టహాసంగా కాకినాడ సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జైఆంధ్రప్రదేశ్ పేరుతో సుబ్రహ్మణ్య మైదానంలో సమైక్య సభను నిర్వహించారు. ఫిబ్రవరి ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెల్‌బీ పరీక్షలను రాజమండ్రిలో రెండో తేదీన నిర్వహించారు. రైతులపై రూ.10,500 కోట్ల విద్యుత్తు బకాయిల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ మెట్ట ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపారు. జిల్లాలో ఫిబ్రవరి నెలలో విద్యుత్తు కోతలు పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సమాచార కమిషనర్ ఎం.రతన్ రాజమండ్రిలో ప్రత్యేక కోర్టు నిర్వహించి అర్జీదారులతో నేరుగా విచారణ జరిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అఖిలభారత కార్మిక సంఘాలు ఈ నెల 21, 22 రెండు రోజులపాటు బంద్ పాటించడంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. మార్చి ఈ నెల నాలుగోతేదీన అమలాపురంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వివాదాల నడుమ నలుగుతున్న పోలవరం ప్రాజెక్టుకు ఎనిమిదో తేదీన భూమిపూజ నిర్వహించారు. హెడ్ వర్కు నిర్మాణ పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ ప్రతినిధులు, రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాట్‌కు వ్యతిరేకంగా పదో తేదీన వస్త్రవ్యాపారులు బంద్ పాటించారు. గ్రామాల విలీన సమస్యలకు తెరదించుతూ రాజమండ్రి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం చేస్తూ 18వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని రామచంద్రపురం ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 28వ తేదీన సీమాంధ్ర జిల్లాల వస్త్రవ్యాపారుల గర్జన సదస్సు రాజమండ్రిలో జరిగింది. వ్యాట్‌ను ఎత్తివేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేయడంతో 30వ తేదీన వస్త్ర వ్యాపారులు సమ్మె విరమించారు. ఏప్రిల్ రాజమండ్రిలో 21 గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓపై ఈ నెల ఒకటిన హైకోర్టు స్టే విధించింది. ఈ నెల ఒకటినుంచి పెరిగిన విద్యుత్తు చార్జీలు అమల్లోకి రావడంతో ఫలితంగా జిల్లాలో 16 లక్షల మంది వినియోగదారులపై పెనుభారం పడింది. పెంచిన విద్యుత్తు చార్జీలకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఐదో తేదీ నుంచి ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఎనిమిదో తేదీన అన్నివర్గాలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. మూడోవారంలో బంగారం ధరలు పడిపోవడంతో జిల్లావ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడాయి. మే 2011 జనాభాలెక్కల తుది నివేదిక విడుదలైంది. జిల్లా జనాభా 51,54,296గా అధికారులు ప్రకటించారు. మే 12న 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు తల్లడిల్లారు. పరిశ్రమలకు విధిస్తున్న పవర్‌హాలీడేను జూన్ నెలవరకూ పొడిగిస్తూ ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ గోదావరి నదిపై రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ బ్రిటిష్ కాలంలో 1897లో నిర్మితమైన హేవ్‌లాక్ వంతెన పరిరక్షణకోసం ఈ నెల మొదటివారం నుంచి ఉద్యమం ఊపందుకుంది. అన్నివర్గాల వారు తమ తమ పంథాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ నెల మూడు నుంచి 15వ తేదీ మధ్యలో ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన 300 మంది ప్రయాణికులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారంరోజుల తర్వాత వారంతా సురక్షితంగా జిల్లాకు చేరుకున్నారు. జూలై ఈ నెల ఒకటిన గవర్నర్ నరసింహన్ రాజమండ్రిలో ఒక వ్యక్తిగత కార్యక్రమాలకోసం పర్యటించారు. తన అత్తగారి అస్తికల నిమజ్జనను పుష్కరాలరేవులో నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్లైన్ విధానానికి రెండోతేదీ నుంచి శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ రాజమండ్రి జిల్లాలో 19 కార్యాలయాలను ఆన్‌లైన్‌ద్వారా అనుసంధానం చేశారు. ఈ నెలలో గోదావరికి రికార్డుస్థాయిలో మూడోప్రమాద హెచ్చరిక దశ దాటి 17 న్నర అడుగుల వరకూ వరదచేరి వెనక్కు తగ్గింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 31వ తేదీనుంచి సమైక్య ఉద్యమం రాజుకుంది. ఆగస్టు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సకలజనులు నిరవధిక బంద్‌ను ఒకటోతేదీనుంచి ప్రారంభించారు. ఏడాదిమొత్తం మీద ఎన్నడూలేనంతగా ఉల్లి ధరలు ఆగస్టు 10 నుంచి రూ.70 కిలో రికార్డుస్థాయిని తాకాయి. ఈ నెల ఏడోతేదీన ట్యునీషియాకు చెందిన ఒక భారీ నౌక కాకినాడ కోరమండల్ ఫెర్టిలైజర్స్‌కు ఫాస్ఫరిక్ యాసిడ్‌తో రవాణ చేసేందుకు కాకినాడ తీరానికి చేరుకుంది. నౌకలోని యాసిడ్‌ను పైప్లైన్ల ద్వారా ఫెర్టిలైజర్‌కు తరలించారు. పోర్టు చరిత్రలో యాసిడ్ రవాణ ఇదే ప్రథమం. నెలరోజులూ జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. సెప్టెంబర్ ఈ నెల రెండోతేదీ నుంచి ఉపాధ్యాయులు సమైక్య సమ్మెలో చేరారు. 11 తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె బాటపట్టడంతో రవాణాకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అంధకారం అలుముకుంది. ఈ నెల 18కి ఉద్యమం 50 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ 66 రోజులపాటు సమైక్య ఉద్యమాన్ని చేపట్టిన సుమారు 60 వేల మంది ఉద్యోగులు ఈ నెల 18 నుంచి విధుల్లోకి తిరిగి హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి భారీగా కురిసిన వర్షాలు రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేశాయి. 350 మిల్లీమీటర్లకు పైగా వారం రోజుల్లో నమోదవడం ఐదేళ్లలో రికార్డు. జిల్లాలో సమైక్య ఉద్యమం నెలంతా కొనసాగింది. అన్నవరంలో సత్యదేవుని వ్రతం టిక్కెట్ల ధరను పెంచుతూ దేవస్థానం నిర్ణయం పట్ల భక్తుల్లో నిరసన వ్యక్తమవుతోంది. నవంబర్ తెల్లకార్డులకు ఇచ్చే రేషన్‌లో నవంబరు నెలలో 15 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా డెల్టా ఆధునికీకరణ పనులు లేనట్టేనని 15వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో సాగునీటి సలహామండలి తేల్చిచెప్పడం రైతులకు నిరాశకు గురిచేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి హెలెన్ తుపాను జిల్లాను గడగడలాడించింది. అనంతరం 24 నుంచి లెహర్ తుపాను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో తీరప్రాంతవాసులు గడగడలాడారు. లెహర్ ముప్పు తప్పినా రెండు తుపాన్లూ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. డిసెంబర్ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపునకు ‘ ఈ’ చెల్లింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తెలంగాణ బిల్లులు కేబినెట్ ఆమోదించడంతో జిల్లాలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆరో తేదీ నుంచి రెండు రోజులు బంద్ పాటించారు. కాకినాడలో ఇండియన్ కోస్టుగార్డు అమ్ములపొదిలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రాజ్ద్వజ్ అనే నౌక 17వ తేదీన వచ్చి చేరింది. చెన్నై నుంచి విశాఖ మధ్య తీరాన్ని ఈ నౌక గస్తీ కాస్తుంది. పండుగ సీజన్‌కావడంతో రాజమం డ్రి, కాకినాడల్లో 21వ తేదీ నుంచి కొత్త వస్త్ర నిలయాల ప్రారంభోత్సవాలు చోటుచేసుకున్నాయి. వీటిలో పాల్గొనేందు కు జిల్లాకు సినీ తారలు తరలివచ్చారు. -
రాష్ట్రాన్ని కాపాడుకుందాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యశంఖారావం సభ సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించారు. పార్టీ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మిగనూరు/టౌన్, న్యూస్లైన్ః సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని తేరుబజార్‌లో సమైక్య శంఖారావం సభ జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం వెలువడిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు సీమాంధ్రకు ఆదర్శంగా నిలిచారన్నారు. 135 రోజులుగా అన్ని వర్గాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడం అభినందనీయమన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెడుతూ ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు సమైక్యాంధ్ర తీర్మానానికి ముందుకు వస్తారని సూచించారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రగా పనిచేసి వేలాది కోట్లను దండుకున్న చంద్రబాబునాయుడు సీబీఐ దర్యాప్తు జరగకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని విమర్శించా రు. కేసులుకు భయపడే రాష్ట్రాన్ని గాలికివదిలేశారన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ మాట తప్పక.. మడమ తిప్పక రాష్ట్రం కోసం పోరాడుతున్న తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోతే ఒక్క రాజధానిలోనే ఆరు లక్షల ఉద్యోగాలను సీమాంధ్రులు కోల్పోతారని, జలవివాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం మొట్టమొదట రాజీనామాలు సమర్పించి, నేటికీ సమైక్య తీర్మానం కోసం పట్టుపడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌నే అన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ లేకపోవడంతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దశాబ్దాలుగా డీలాపడిపోయిన కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ అధికారంలోకి తీసుకొస్తే, అదే పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుండటం విచారకరమన్నారు. విభజన ప్రక్రియను ఆపాలని తమ అధినేత దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా చర్చజరిగేలా ప్రయత్నాలు చేపట్టి విజయవంతమైయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ మహిళ, చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుకమ్మను ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ మాజీ చెర్మైన్ బుట్టా రంగయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బీఆర్.బసిరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చెర్మైన్ రమాకాంత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాచాని శివకుమార్, మైనార్టీ నాయకులు హాజీ నద్దిముల్లా, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లింగమూర్తిలు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠప్ప, మాచాని నాగరాజు, నందవరం సంపత్‌కుమార్‌గౌడ్, లక్ష్మికాంత్‌రెడ్డి, నసిరుద్దీన్, కాశీవిశ్వనాథ్‌రెడ్డి, గోవిందు, భీమిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, ఇంజనీర్ రాజన్న, సునీల్‌కుమార్, రియాజ్‌అహ్మద్, రాజారత్నం పాల్గొన్నారు. బడుగు మహిళను.. మీ ఆడపడుచును బడుగు మహిళను.. మీ ఆడపడుచును.. ఆదరించండి.. జగనన్న ఆశయాల్లో నన్ను పాలుపంచుకోనివ్వండి’ అంటూ వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక సభలో ప్రసంగించడం పలువురిని ఆకట్టుకుంది. చేనేత వర్గానికి చెందిన ఓ మహిళను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాసాధికారితకు పెద్దపీట వేశారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టత కోసం పాటుపడుతానని ఆమె పేర్కొన్నారు. మహానేత వైఎస్ఆర్ చేనేతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, జననేత కూడా చేనేతల అభివృద్ధికి శ్రమిస్తారన్నారు. -
రూ 241 కోట్ల మద్యం టా..గేషారు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో మద్యం అమ్మకాలు ఏటా వందల కోట్లలో సాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ 241.85 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం వరకు మద్యం అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం..భారీ వర్షాలు, తుఫాన్ల ప్రభావంతో మద్యం అమ్మకాలు కొంత మేర తగ్గాయి. మద్యం అమ్మకాలు పెంచేందుకు నిబంధనల అమలు విషయంలో ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు పోతున్నారు. అమ్మకాలే లక్ష్యంగా... జిల్లాలోని మద్యం అమ్మకాలను ఏటా గణనీయంగా పెంచడంతోపాటు మరోవైపు నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉంది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరిపేలా చూడడం, గంజాయి అమ్మకాలు లేకుండా, నాటుసారా తయారీని అరికట్టడం, ఎన్డీపీ మద్యాన్ని జిల్లాలోకి రానీయకుండా చూడడంతోపాటు బ్రాందీ షాపుల్లో లూజు విక్రయాలు లేకుండా, బార్లలో నిప్ (క్వార్టర్ బాటిళ్లు)ల అమ్మకాలు జరగనీయకుండా చూడాలి. మరోవైపు మద్యాన్ని ఎంఆర్ పీకి అమ్మించాలి. అయితే జిల్లాలో ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా ఆ శాఖ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కేవలం అమ్మకాలే లక్ష్యంగా వారు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులు ఊరికి వెళ్లేందుకు సరైన దారి లేనివి..రేషన్ షాపులు, పాఠశాలలు, ఆస్పత్రులు కనీసం మంచినీటి సౌకర్యం లేని గ్రామాలైనా ఉన్నాయేమోకానీ జిల్లాలో మద్యం దొరకని గ్రామాలు లేవంటే అతిశయోక్తికాదు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి బెల్ట్‌షాపులు పది వేలకుపైగా ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో జరిగే అమ్మకాలకన్నా డ్రైడేల్లో అమ్మకాలు రెట్టింపుగా ఉంటాయి. ఇతర శాఖలతో పోలిస్తే ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. జిల్లాలోని యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం ప్రాంతాల్లో ఆ శాఖలో ఎస్సైలు లేరు. కేవలం అమ్మకాలు పెంచడంపైనే అధికారులు దృష్టి పెట్టకుండా...నిబంధనలు అమలు చేసే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది
కర్నూలు, న్యూస్‌లైన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది. ప్రధానంగా దోపిడీలు, చైన్‌స్నాచింగ్ వంటి నేరాలను అదుపు చేయలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే చోరీ సొమ్ము రికవరీలో మాత్రం రెండేళ్ల కంటే కాస్త ఊరట కల్పించారు. దొంగల పాలైన సొత్తు రూ.6.50 కోట్లు కాగా, రూ.4.50 కోట్లు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు గతంలో మాదిరే ఈ ఏడాదీ పునరావృతమయ్యాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే వాటి సంఖ్య ఈ ఏడాది కాస్తతగ్గింది. రాజకీయ నాయకులతో కొంతమంది పోలీస్ అధికారులు సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన నిఘా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలు లేకపోలేదు. సల్కాపురం సమీపంలో కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులు, ఆయన కుమారుడు వెంకట్రాముడు, కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన సహకార సంఘం అధ్యక్షుడు ఆలం బాషా దారుణ హత్యలు పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేశాయి. క్రిష్ణగిరి సహకార బ్యాంకు సీఈఓ చిన్నసోమన్న అదృశ్యం కేసును ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ ఏడాదిలో ఆరునెలలపాటు ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. ఆయన తరువాత రఘరామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ రఘురామి రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్షనిస్టులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి సంబంధించిన సెల్ఫోన్లకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బందోబస్తును పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెల్లెలు ఆస్తికి రక్షణగా ఉన్నాడన్న కోపంతో డోన్ మం డలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిని బంధువు లే దారుణంగా హత్య చేశారు. కర్నూలు నుంచి చిన్నమల్కాపురం వెళ్తుండగా ఎర్రగుంట్ల బ్రిడ్జి వద్ద స్కార్పియో వాహనాన్ని అడ్డగించి కత్తులతో నరికి చంపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సల్కాపురం సమీపంలో జంట హత్యలు పోలీసు శాఖను కుదిపేశాయి. ఎరుకలి వెంకట్రాముడు, ఆయన కుమారుడు రామాంజనేయులు గూడూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తుండగా ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా హత్య చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక డోన్ పట్టణానికి చెందిన కడిమెట్ల కృష్ణ అలియాస్ కిట్టును ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. కిట్టు తండ్రి లక్ష్మన్న సహకార సంఘం ఎన్నికల్లో డోన్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి డెరైక్టర్‌గా పోటీ చేశారు. అధికార పార్టీ నాయకులకు మింగుడుపడక కిరాయి హంతకుల చేత హత్య చేయించారు. అవుకు మండలం గుండ్ల శింగవరం సబ్‌స్టేషన్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆలమూరు రాముడు, బనగానపల్లె మద్దిలేటి, ఇమ్రాన్, ఆటోడ్రైవర్ మొదీన్ బాషా మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నేరస్తులపై ఎస్పీ రఘురాం రెడ్డి కఠినంగా వ్యవహరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంపై కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, మరికొంతమంది అనుచరులను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు కేంద్రంగా పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు బుధవారపేటకు చెంది న మట్కాడాన్ స్థావరంపై దాడి చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 58 మందిని అదుపులోకి తీసుకుని రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రఘురాం రెడ్డి జిల్లాలో ‘మీతో మీ ఎస్పీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు శాంతిభద్రతల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చెప్పుకునే అవకాశం కల్పించారు. కొంతమంది సిబ్బంది దీని నీరుగారుస్తున్నారు. అయ్యలూరు గ్రామానికి చెందిన న్యాయవాది సర్వేశ్వరరెడ్డికి, గంగవరం గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డికి మధ్య ఉన్న పొలం తగాదా కారణంగా కోర్టుకు వెళ్లి వస్తున్న సర్వేశ్వరరెడ్డి వాహనాన్ని జీపుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమేనని గుర్తించారు. కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపికకు చర్యలు తీసుకున్నారు. పోలీసు శాఖపై అధికార పార్టీ పెత్తనంపై కఠినంగా వ్యవహరిం చిన ఎస్పీ రఘురామి రెడ్డిని హైదరాబాదు సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేసి శంషాబాద్ డీసీపీగా ఉన్న రమేష్‌నాయుడును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించి తాత్కాలికంగా నిలుపుదల చేయించుకున్నారు. క్రికెట్ బెట్టింగ్, జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ఇంజనీరింగ్ విద్యార్థులు హకీం సమీర్, జయసూర్య సింహారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు కటాకటాలపాలయ్యారు. గుప్త నిధుల వేటలో రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నాగరాజు, రమాదేవి మృత్యు ఒడి చేరారు. డోన్ మండలం వెంకటాపురం బొంతిరాళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామన్న దురాశతో తమ జీవితాలనే బలి తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్ సొంతశాఖ సిబ్బంది సమస్యలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. జిల్లా కేంద్రంతో పాటు సబ్ డివిజన్ స్థాయిలో పోలీసు దర్బార్ నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారితో పాటు అవినీతికి పాల్పడేవారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సొంత శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఖాళీలను బట్టి అడిగిన చోటుకే పోస్టింగ్‌లు ఇస్తూ పైరవీలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. -
‘ఉద్యమ’ నామ సంవత్సరం
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్:జిల్లాలో ఈ ఏడాది ఉద్యమ పిడికిళ్లు బలంగా బిగుసుకున్నాయి. నినాదాలతో వీధి వీధీ హోరెత్తిపోయింది. ప్రధానంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఊళ్లకు ఊళ్లు పాల్గొని పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. దీనికి తోడు ఉద్యోగుల ఆందోళనలు కూడా భారీ ఎత్తున జరి గాయి. ఇవన్నీ కలిసి ఈ ఏడాదిని ‘ఉద్యమ నామ సంవత్సరం’గా మార్చేశాయి. సమైక్యాంధ్ర ఉద్యమం... జిల్లాలో జరిగిన ఉద్యమాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం అతి పెద్దది. జూలై ఒకటిన ప్రారంభమైన ఈ ఉద్యమం వినూత్న రీతిలో దాదాపు రెండు నెలల పాటు ఏకధాటిగా కొనసాగింది. సామాన్యులే నాయకులుగా మారి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వీరితో పాటు అన్ని ఉద్యోగ సంఘాల వారూ పోరాటంలో పాలు పంచుకున్నారు. అయితే అన్ని చోట్లా శాంతియుతంగానే ఉద్యమం జరగడం జిల్లాకు ఉన్న మంచిపేరును మరోసారి చాటి చెప్పింది. ఒక్క విజయనగరంలోనే కాసింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. విధ్వంసకర సంఘటనలు... అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్జీఓలు ఎంపీలు, మంత్రులకు చెందిన ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 4వ తేదీన మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ఇళ్లను ఎన్జీఓలు ముట్టడించారు. అయితే ఉద్యమం ఎంతకీ చల్లారకపోవడంతో కలెక్టర్ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అక్టోబర్ 5న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు బొత్స ఇంటి వద్ద బందోబస్తును పర్యవేక్షిస్తున్న అప్పటి ఎస్పీ కార్తికేయ, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. అదే రోజు సాయంత్రం సమైక్యాంధ్ర ఉద్యమకారులు బొత్సకు చెందిన ఆస్తులు, కళాశాలల ధ్వంసానికి పాల్పడ్డారు. బొత్స సొదరుడికి చెందిన సత్య టెలివిజన్ చానల్ కార్యాలయానికి ఆందోళన కారులు నిప్పుపెట్టడంతో పూర్తిగా కాలిపోయిది. బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటి పై ఆందోళన కారులు దాడికి యత్నించారు. అలాగే మద్యం దుకాణాలు, ఇతర షాపులపై కూడా దాడి చేశారు. డీసీసీబీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఫైళ్లకు నిప్పంటించారు. కర్ఫ్యూ... సమైక్యాంధ్ర ఉద్యమం హింసాత్మకంగా మారుతోందని భావించిన పోలీసులు జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ పెట్టారు. రాష్ట్ర బలగాలతోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీలు, ఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. కర్ఫ్యూ తర్వాత అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చావబాదారు. ప్రజల ఇళ్లల్లోకి చొరబడి మరీ అరెస్ట్‌లు చేశారు. జీ(వి)తాల కోసం... జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదంతా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యమాలు చేశారు. 108 ఉద్యోగులు 33 రోజులపాటు సమ్మె చేశారు. జూలై 18న కేంద్రాస్పత్రి ఎదుట 108 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమ్మె ప్రారంభించారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 23న సమ్మెను ముగించారు. కంప్యూటర్ టీచర్లు, వీఆర్ఏలు, అంగన్వాడీలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళనలు చేపట్టారు. ధరల దరువు విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టించింది. వంగ దొరక్కుండా బెంగ పడేలా చేసింది. బంగాళాదుంప బంగారంతో పోటీ పడేట్లు కనిపించింది. మరోవైపు గ్యాస్ దిమ్మలు బరువెక్కాయి. విద్యుత్ బిల్లులు షాకిచ్చాయి. మొత్తానికి 2013లో ధరలు దరువేశాయి. సామాన్యుడికి అందకుండా నిత్యావసరాలు పైపైకి పరుగులు తీశాయి. దీనికి తోడుగా పెట్రో ధరలు మాటి మాటికీ పెరిగి ‘ధరల పెరుగుదల’ అనే మాటను సామాన్యం చేసేశాయి. వరుస తుఫాన్ల కారణంగా కూరగాయల ధరలు కూడా మండిపోయాయి. స్మార్టఫోన్లు, సిమ్‌కార్డులు వంటివి మాత్రం అందుబాటులోకి వచ్చాయి. రికార్డులు బద్దలుగొట్టిన ‘ఉల్లి’ ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూల్చేసిన ఉల్లి ఈ ఏడాదీ తన విలువను పెంచుకుంది. ఒకానొక దశలో రూ.70 పెడితే గానీ కిలో ఉల్లి దొరకలేదు. ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల నెల నుంచి రెండు నెలలు ఇదే ధర కొనసాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు కూరగాయల పంటలను సర్వనాశనం చేశాయి. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. బంగాళాదుంపలు కిలో రూ.60, బీన్స్ ధర రూ.90 వరకు పెరిగింది. చిక్కుడు, టమోటా, క్యారెట్ ధరలు రూ.60 వరకు పెరిగాయి. దీంతో చాలా మంది కూరగాయలు జోలికి వెళ్లలేదు. గత ఏడాది కూరగాయలకు నెలకు రూ.400 నుంచి రూ.500 ఖర్చయితే ఈ ఏడాది నెలకు రూ.1000 నుంచి రూ.1100 వరకు ఖర్చయింది. సన్న బియ్యం ధరలూ... సన్న బియ్యం ధరలు ఈ ఏడాది బాగా పెరిగాయి. 2012లో రూ.35 ఉన్న ధర ఈ ఏడాది రూ.45 నుంచి రూ.50కు చేరింది. కేవలం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నెలకు రూ.3వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సన్న బియ్యంలో అతి తక్కువ ధర గల రూ.38 నుంచి రూ.40 ఉన్న బియ్యంతో రైతులు సరిపెట్టుకున్నారు. పప్పుల ధరలు కూడా పెరిగాయి. కందిపప్పు రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. లీటరు ఆయిల్ రూ.60 నుంచి రూ.70 అయింది. రిఫండ్ ఆయిల్ రూ.80 నుంచి రూ.100 అయింది. ‘గ్యాస్’ మంటలు ప్రభుత్వం ఈ ఏడాది గ్యాస్ ధరలను పెంచేసి కట్టెల పొయ్యిలను మళ్లీ సామాన్యుడి దగ్గరకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని ఎత్తివేయడంతో రూ.440 ఉన్న గ్యాస్ ధర రూ.1100 అయింది. ఆధార్ కార్డు ఉన్న వారికి రాయితీ నగదును బ్యాంకులో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. బాబోయ్ పెట్రో ధరలు ఈ ఏడాది పెట్రోల్ ధరలు దాదాపు పదిసార్లు పెరిగాయి. డీజిల్ ధరలు పద్నాలుగు సార్లు పెరిగాయి. ఒకే ఏడాదిలో ఇన్ని సార్లు పెరగడం రికార్డు అనే చెప్పాలి. రూ.73 ఉన్న పెట్రోల్ లీటరు ధర రూ.78 అయింది. డీజిల్ ధర రూ.51.35 నుంచి రూ.58.6కు పెరిగింది. అవీ... ఇవీ... ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే కొబ్బరి, బాణసంచా ధరలు కూడా పెరగడంలో పోటీ పడ్డాయి. బైక్‌లు, కార్ల ధరలూ పెరి గాయి. అయితే బంగారం మాత్రం కాస్త తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర 2012 డిసెంబర్లో *30,570 ఉంటే ఈ ఏడాది డిసెంబర్‌కు 29,340 ఉంది. -
రాజుకున్న రాజకీయం
జిల్లాలో ఈ ఏడాది రాజకీయం రసవత్తర మలుపులు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో ప్రధాన పార్టీల జాతకాలు మారిపోయాయి. మరోవైపు నేతల వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రోజురోజుకూ పుంజుకుంటూ ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కాంగ్రెస్ నాయకుల ప్రతిష్ట దెబ్బతింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. లోక్‌సత్తా, వామపక్షాలు తదితర పార్టీలు ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాయి. బొబ్బిలి, న్యూస్‌లైన్: జిల్లాలో రాజకీయం రంగులు మారింది. ఇంతకాలం అధికార పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నెత్తిన వేసుకుని ప్రజా సమస్యలపై గళమెత్తింది. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల విధానానికి జిల్లాలోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే తాడ్డి వెంకటరావు మరణం ఆయన అభిమానులను దుఃఖ సాగర ంలో ముంచింది. కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ రాష్ట్రంపై విభజన కత్తిని వేలాడదీసిన కాంగ్రెస్‌కు జిల్లాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఆఖరుకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా ‘రాజీ’నామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ‘తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంట’ని ప్రకటన చేసినప్పుడే నిరసనలు మొదలయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయ్యాక ఆ నిరసనలు మరింత ఎక్కువై బొత్స ఆస్తుల విధ్వంసానికి దారి తీశాయి. దీంతో జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ కూడా పెట్టారు. దీంతో అధికార పార్టీపై ప్రజ లు మరింత రగిలిపోయారు. ఈ పరిణామాలన్నీ సత్తిబాబు ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. సమైక్య రాష్ట్రాన్ని బలపరుస్తూ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఎంపీ ఝాన్సీని కూడా సమైక్యవాదులు నిలదీశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి యత్నిస్తున్న కాం గ్రెస్ పార్టీకి ప్రజల్లో విలువ లేదని గుర్తిం చి ఆ పార్టీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే పీ డిక రాజన్న దొర వైఎ స్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం రాష్ట్ర స్థాయిలో సంచలనం అయ్యింది. ఆ యన వెంట పలువురు స ర్పంచ్‌లు, మాజీలు సైతం కాం గ్రెస్‌కు గుడ్‌బై చెప్పి రాజన్న వెం ట నడవడం సాలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వైఎస్ఆర్ సీపీ దూకుడు ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ఈ ఏడాది వైఎస్ఆర్ సీపీ ముందడుగు వేసింది. ఓ వైపు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటాల్లో పాల్గొంది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు కాంగ్రెస్‌ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జిల్లాలో పార్టీ రోజు రోజుకూ బలోపేతం అవుతోంది. ఆయన సోదరుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) అరుకు పార్లమెంటు పరిశీలకులుగా నియమితులయ్యారు. అలాగే పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు పెద్దరికానికి వీరిద్దరూ అండగా ఉంటూ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. సమైక్యాంధ్ర ధ్యేయంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు. అన్నింటి కంటే ప్రధానంగా ఈ ఏడాది జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పాదయాత్ర చిన్నపాటి సంచలనాన్ని సృష్టించింది. ఈ పాదయాత్రతో గ్రామగ్రామాన వైఎస్ఆర్సీపీకి బలమైన క్యాడర్ రూపొందినట్లైంది. సమై క్య శంఖారావం పేరుతో నిర్వహించిన యా త్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఏడాది చివరలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అధికార కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తుఫాను ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన వారిలో మనోధైర్యం నింపారు. అయోమయ ‘దేశం’ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి లేఖలు రాసి, ఆనక సమన్యాయం అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలోనూ నిరసనలు తప్పలేదు. సమైక్యాంధ్ర అంటూ హడావుడి చేస్తున్న సమయంలోనే ఆ పార్టీ అధినేత సమన్యాయం అని చెప్పడంతో పార్టీ ప్రజలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ పరాజయం వైపు పయనిస్తుండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలోపేతం అవుతుండడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి మేమూ ఉన్నామని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నానా ఇబ్బందులు పడుతోంది. ఈ పార్టీలో కూడా నాయకత్వంతో పాటు నియోజవకవర్గాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పార్టీలోని విబేధాలు కోలుకోనీయకుండా చేస్తున్నాయి. -
2013 - జగన్ అలుపెరుగని పోరాటం
ఈ ఏడాది మన రాష్ట్రంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతోంది. సమైక్య శంఖారావం పూరించి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైన నేతగా జగన్ నిలిచారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల దుర్మరణం తరువాత ఆయన ఆశయాల సాధనకు, ఆయన ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు అనివార్యంగా జగన్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. జననేతగా జగన్ రోజురోజుకు ఎదిగే క్రమంలో లేనిపోని అభాండాలన్నీ మోపి అతనిని 2012 మే 27న అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ ఏడాదే సమైక్య ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి జైలు నుంచే జగన్ మద్దతు పలికారు. అంతేకాకుండా జైలులో ఉండే సమైక్య రాష్ట్రం కోసం నిరవధిక దీక్ష చేశారు. జనానికి ఇంకా చేరువయ్యారు. న్యాయం జగన్ పక్షాన ఉండటంతో ఎంతకాలం జైలులో ఉంచగలరు? ఈ ఏడాది అక్టోబరు 24న బెయిలుపై విడుదలయ్యారు. పడిన కెరటం మళ్లీ పైకి లేచింది. సమైక్య శంఖారావం పూరించారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్టోబరు 26న భారీ స్థాయిలో సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. సమైక్యవాదుల ఆశాజ్యోతిగా నిలిచారు. జాతీయ స్థాయిలో సమైక్యవాణి వినిపించారు. దేశమంతటా పర్యటించి జాతీయ నాయకులను కలిశారు. సమైక్యతకు మద్దతు కూడగట్టారు. దేశమంతా రాష్ట్రం వైపు చూసే విధంగా లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిజాయితీగా, పట్టుదలతో పోరాడుతున్న ఏకైక నేత జగన్. రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు నదీ జలాలు - ఉద్యోగులకు జీతాలు - యువతకు ఉద్యోగాలు - కొత్త రాజధాని ఏర్పాటు.... వంటి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని హెచ్చరించారు. నీటి కోసం నిత్యం తన్నుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచడం కోసం చివరి క్షణం వరకు పోరాడతానని శపథం చేశారు. ఆ శపథానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. -
మాకొద్దు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘జోగీ జోగీ రాసుకుంటే..’ అన్న చందంగా తయారైంది జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి. తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు టీడీపీ గాలం వేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు చూస్తున్నారు. అలాంటివారికి చంద్రబాబు ఎర్ర తివాచీ పరచడంపై టీడీపీ తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండా అధినేత అనుసరిస్తున్న వ్యూహం బెడిసికొడుతుందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ.. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరితే మిగిలేది బూడిదేనని తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. తలుపులు బార్లా తెరిచిన బాబు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ విముఖత చూపుతోంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు దృష్టిసారించారు. ఈ పరిణామం టీడీపీలో సరికొత్త రగడకు దారితీస్తోంది. ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కోసం తమ పార్టీ ప్రజాప్రతినిధికే చంద్రబాబు ఝలక్ ఇవ్వడానికి సిద్ధపడటం విస్మయపరుస్తోంది. పశ్చిమ ప్రాంతానికే చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో టీడీపీ అధిష్టానం మంతనాలు ఆ దిశగానే సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఆయన సామాజికవర్గ బలంలేకపోయినా 2009 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు తహతహలాడారు. ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న ఆయన్ని చేర్చుకునేందుకు వైఎస్సార్సీపీ సమ్మతించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే భావించారు. కానీ అధిష్టానం ఆగ్రహించడంతో వెనక్కి తగ్గారు. ఆయనతో తాజాగా టీడీపీ దూతలు మంతనాలు సాగిస్తున్నారు. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గెలవడం కష్టమని భావించిన ఆ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంపై కన్నేశారు. తనకు పొరుగున ఉన్న నియోజకవర్గంలో టిక్కెట్టు ఇస్తే టీడీపీలో చేరుతానని షరతు పెట్టారు. కాగా ఆ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ ప్రజాప్రతినిధి ఉన్నారు. కానీ ఆయన ఓ ఫైనాన్స్ సంస్థ కుంభకోణంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో వివాదాస్పదుడయ్యారు. ఈ అంశాన్నే చూపించి ఆయన్ని తప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వాలన్నది టీడీపీ అధినేత ఉద్దేశంగా ఉంది. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ ప్రజాప్రతినిధి హతాశుడయ్యారనే చెప్పాలి. పశ్చిమ ప్రాంతానికే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారు. తన నియోజకవర్గానికి భారీ పరిశ్రమల కారిడార్‌ను కేటాయించారని సీఎం కిరణ్‌ను కీర్తిస్తున్న ఆ ఎమ్మెల్యే.. టీడీపీతో లోపాయికారీగా మంతనాలు సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఫోన్లు మీద ఫోన్లు చేసి.. తన అనుచరులతో రాయబారాలు పంపి హడావుడి చేశారు. కానీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన్ని చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ససేమిరా అన్నారు. విషయం తెలిసిన చంద్రబాబు తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తానని ఆయనకు గాలం వేశారు. కాగా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంతకాలంగా పనిచేస్తున్న టీడీపీ నేతకు ఆగ్రహం వచ్చింది. ఆయన నేరుగా బాలకృష్ణతో మాట్లాడి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన సన్నిహితుడని తెలిసీ ఆయన స్థానానికే చెక్ పెట్టడంపై బాలకృష్ణ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇప్పటికే టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన ఏకంగా పొరుగు జిల్లాకే వెళ్లిపోనున్నారు. తన సొంత జిల్లా కూడా అయినందున అక్కడి నుంచి ఈసారి టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈ పరిణామాలపై టీడీపీ తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. పదేళ్లుగా అధికారం లేకపోయినా పార్టీని అంటిపెట్టుకున్న తమను కాదనడంపై మండిపడుతున్నారు. అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ పరిణమాల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
‘సమైక్య’ దీక్షలో అపశ్రుతి
దీక్షా శిబిరంలో అపస్మారకంలోకి సీనియర్ న్యాయవాది... ఆసుపత్రిలో కన్నుమూత కడప, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 150 రోజులుగా సీమాంధ్ర న్యాయవాదులు చేస్తున్న ఉద్యమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కడప జిల్లా కోర్టు వద్ద ఉన్న దీక్షా శిబిరంలో 30 రోజులపాటు దీక్షలు చేసిన సీనియర్ న్యాయవాది లక్ష్మీనరసయ్య బుధవారం దీక్షా శిబిరంలో అపస్మారక స్థితికి చేరుకుని అర్ధరాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు. సమైక్య ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొంటూ సుమారు 30 రోజులకు పైబడి రిలే దీక్షలు చేయడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో బుధవారం దీక్షా శిబిరంలోనే అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. లక్ష్మీనరసయ్య మృతికి సంతాపంగా గురువారం న్యాయవాదులు సంతాపసభ నిర్వహించారు. -
ఉద్యమంపై ఎన్నికల ప్రభావం ఉండదు:అశోక్ బాబు
శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమంపై ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికల ప్రభావం ఉండదని ఆ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఎన్నికల కారణంగా సమైక్య ఉద్యమం పక్కతోవ పట్టలేదన్నారు. ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికలలో ఎవరు గెలిచినా సమైక్యరాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఏపీఎన్జీవోల సంఘం ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుత తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సభ్యులు తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. అశోక్‌బాబు ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బషీర్ నేతృత్వంలో మరో ప్యానెల్ బరిలోకి దిగింది. మొత్తం 17 మందితో ఒక్కో ప్యానెల్ ఏర్పడింది. -
'అశోక్ సమైక్య ఉద్యమాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు'
సమైక్య ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడుగా అశోక్ బాబు నీరుగార్చారని ఏపీఎన్జీవో రెండో ప్యానల్ నేతలు బషీర్, సత్యనారాయణలు ఆరోపించారు. ఆదివారం వారిరువురు అశోక్ బాబుపై నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమంలో రాజకీయ పార్టీలను కలుపుకోని పోవడంలో అశోక్‌బాబు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషిస్తున్న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రావడం అయింది, వెళ్లటం అయింది కానీ ఆయన్ని అశోక్ బాబు అడ్డుకున్నదాఖలాలు లేవని వారు ఉదాహరించారు. అలాగే టి.బిల్లు అసెంబ్లీకి వస్తే ముట్టడిస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో ఏ ఒక్కటి అశోక్ బాబు చేయలేదని ఆయన వ్యవహారశైలీని బషీర్, సత్యనారాయణలు ఎండగట్టారు. సొంత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని అశోక్ బాబు వాడుకున్నారని వారు ఆరోపించారు. అందుకే అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోటీకి దిగినట్లు వారిరువురు తెలిపారు. తప్పుడు ఓటర్ల జాబితాతో ఏపీఎన్జీవో ఎన్నికల్లో... అశోక్‌బాబు అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అశోక్ బాబు ఎంత ఖర్చు చేసిన నిజాయితీపరులైన ఎన్జీవోలు తమ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు. -
జనంలోకి సమైక్యాంధ్ర ఉద్యమం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు జరిగే నష్టంపై జనానికి అవగాహన కల్పించేందుకు సీమాంధ్రలోని 600 మండల కేంద్రాల్లో జవవరి 3వ తేదీ నుంచి నెలరోజుల పాటు కళాభేరి నిర్వహించనున్నట్లు చెప్పారు. 13 కళాబృందాలు, 120 మంది కళాకారుల ద్వారా గ్రామస్థాయిలో కూడా కోలాటం, జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలు, వీధినాటకాలు ప్రదర్శించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేపడతామన్నారు. స్థానిక సీవీఎన్ రీడింగ్‌రూంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడారు. సమైక్యాధ్ర కోసం సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మూడు సెట్ల అఫిడవిట్లు పూర్తిచేసి స్పీకర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు అందజేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్ట విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీమాంధ్రలోని కేంద్ర, రాష్ర్టమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. జనవరి 1లోపు మున్సిపాలిటీల్లో సమైక్య పరుగు... జనవరి 1వ తేదీలోపు సీమాంధ్రలోని అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో సమైక్య పరుగు నిర్వహించాలని లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. జనవరి మొదటి వారంలో అన్ని జేఏసీల నేతృత్వంలో చలో అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో లోతుగా చర్చించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలపై పూర్తిస్థాయిలో చర్చించాలన్నారు. సమయం సరిపోకపోతే సమావేశాలను మరో 20 రోజులు పొడిగించాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు గోపిరెడ్డి ఓబులరెడ్డి, కాటా అంజిరెడ్డి, కంచర్ల రామయ్య, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, పీవీ నరసింహారెడ్డి, పమిడి సుబ్బరామయ్య, పి.ప్రకాష్, హర్షిణి రవికుమార్ పాల్గొన్నారు. -
పెద్దాపురం ‘దేశం’లో అంతర్యుద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెద్దాపురం బరిలో తెలుగుతమ్ముళ్లు ఆధిపత్య పోరుతో కత్తులు దూసుకుంటున్నారు. ఇక్కడి పార్టీ పరిస్థితి నడిసంద్రంలో చుక్కాని లేని నావలా మారింది. సుమారు మూడు దశాబ్దాల పాటు నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై నడిపించి, చివరికి అధినేత చంద్రబాబు విధానాలతో విసుగుచెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూదరీ లేకుండా పోయాయి. ఇప్పుడు పార్టీలో పెద్దాపురం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం అలముకుంది. ఒకప్పుడు మంచి పట్టున్న పెద్దాపురంలో ఇప్పుడు ఆ పార్టీ అడ్రస్ కోసం వెతుకులాడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ టిక్కెట్టు కోసం ఒకే సామాజికవర్గం నుంచి ఇద్దరు బస్తీ మే సవాల్ అంటున్నారు. ఒకవైపు రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి ముత్యాల రాజబ్బాయి, మరో వైపు గోలి రామారావు బరిలోకి దిగి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పెద్దాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బొడ్డు బంగారుబాబుకు నాయకత్వ పటిమ లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చి పడిందంటున్నారు. కాగా పార్టీ అధినేత చంద్రబాబు పెద్దాపురం టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ను పార్టీలోకి రప్పించి, ఆయనకే ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో రాజబ్బాయి, రామారావు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. చివరకు ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమం చేపట్టినా ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. పెద్దాపురం రూరల్‌కు చెందిన రాజబ్బాయి పట్టణంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయం గోడల మీద తన ఫొటో వేసుకోవడంపై రామారావు వర్గీయులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. రూరల్ పరిధిలో కాక పట్టణంలో ఏర్పాటు చేసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శిగా పార్టీ కార్యాలయాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే హక్కు తనకుందన్నది రాజబ్బాయి వాదన. వీరిద్దరి వివాదం నేపథ్యంలో పెద్దాపురం మరిడమ్మ ఆలయం సమీపాన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభానికి నోచుకోవడం లేదని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ర్యాలీతో విభేదాలు రట్టు సమైక్యాంధ్ర ఉద్యమంలో జె.తిమ్మాపురం నుంచి నిర్వహించిన మోటారుసైకిల్ ర్యాలీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలపై రాజబ్బాయి ఫొటోలు ఉండటాన్ని రామారావు వర్గీయులు ప్రశ్నించడంతో ఆయన ర్యాలీలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఆ తరువాత నిర్వహించిన రైతుగర్జనలో కూడా ఇదే పరిణామం పునరావృతమైంది. ఇటీవల పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు స్వగృహంలో జరిగిన పార్టీ సమావేశానికి కూడా రాజబ్బాయి దూరంగానే ఉన్నారు. నియోజకవర్గానికి నాయకుడెవరో తేల్చాలంటూ ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పోతుల విశ్వాన్ని కొందరు ప్రశ్నించారు. ఏమీచెప్పాలో తెలియక విశ్వం తలపట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు. రాయభూపాలపట్నంలో బడ్డీకొట్టును తగలబెట్టిన వ్యవహారంలో రాజబ్బాయి సహా ఆయన అనుచరులు నిందితులుగా ఉన్నారు. రామారావు, ఆయన అనుచరులు దుకాణ యజమానికి సహకరిస్తూ తమ నేతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని రాజబ్బాయి వర్గం మండిపడుతోంది. ‘పరుచూరి’ పేరూ పరిశీలనలో.. టీడీపీ అధినేత చంద్రబాబు మరోరకంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం గాంధీమోహన్ గతంలో టీడీపీలో ఉన్నారు. ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుని, అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గాంధీమోహన్ కాకపోతే సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ పరుచూరి కృష్ణారావు పేరును పరిశీలించాలనుకుంటున్నట్టు సమాచారం. దీంతో పార్టీలో ఉండాలో, బయటకు పోవాలో తెలియని సందిగ్ధంలో క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. -
పెల్లుబికిన నిరసనలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు ప్రతులను రాష్ట్ర విద్యార్థి జేఏసీ నేతలు దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ముక్తకంఠంతో నినదించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం స్థానిక రంగారాయుడు చెరువు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి జయరాం సెంటర్, కోర్టు భవనాల మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు ఏ ఉదయ్‌కుమార్, యువజన జేఏసీ కన్వీనర్ కన్నా వరప్రసాద్, నాయకులు సాయి, విష్ణు, జాషువా, తదితరులు పాల్గొన్నారు. చీరాలలో.. చీరాల అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన కుట్రను తిప్పికొట్టాలని సమైక్యాంధ్ర జెఏసీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రావడాన్ని నిరసిస్తూ జెఏసీ నాయకులు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక విజ్ఞానభారతి జూనియర్ కళాశాల నుంచి మార్కెట్ మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు అక్కడ మానవహారం ఏర్పాటు చేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జెఏసీ నాయకులు గుంటూరు మాధవరావు, కర్నేటి రవికుమార్, సయ్యద్ బాబు, ఊటుకూరి రత్తయ్య మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎం కిరణ్ వైఫల్యంతో విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చిందని విమర్శించారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరన్నారు. సీమాంధ్ర ద్రోహి స్పీకర్ ‘నాదెండ్ల’ చీరాల వీఆర్‌ఎస్‌వైఆర్‌ఎన్ కళాశాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల జెఏసీ అధ్యక్షుడు కే ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ ఎం మోషే, ఉపాధ్యక్షుడు ఏ జయరావు, ప్రధాన కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు. -
నేడు అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు
-
నేడు అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో వివిధ రాజకీయపార్టీలు నేడు పలు వాయిదా తీర్మానాలు చేశాయి. సమైక్య రాష్ట్రంపై తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. అలాగే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై సభలో చర్చించాలని తెలుగుదేశం పార్టీ ఈ వాయిదా చేసింది. వీటిపాటు తెలంగాణ బిల్లుపై చర్చ పెట్టాలని సీపీఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. -
రోడ్డెక్కిన రైతు
గుంటూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చి రోడ్లపై ప్రదర్శన చేశారు. ఉత్సాహవంతులైన యువకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు చేపట్టారు. రైతులతోపాటు రహదారులపైకి తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు రాష్ట్ర విభజనపై తమ వైఖరులు మార్చుకోని కాంగ్రెస్,టీడీపీ, కేంద్రం తీరును తప్పుపట్టారు. పెద్ద ఎత్తున నిరసన తెలి యజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పసంహరించుకోని పక్షంలో సీమాంధ్రలోని రైతుల పరిస్థితి దారుణంగా మారనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రజల మద్దతు భారీగా లభిస్తుందన్నారు. చిలకలూరిపేటలోని ప్రధాన కూడలిలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై భారీ ప్రదర్శన చేశారు. సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో, మంగళగిరి నియోజకవర్గలో సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో పట్టణ కూడలి ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులు భారీగా తరలి వచ్చి నిరసన తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో సమన్వయకర్త కోన రఘుపతి, నరసరావుపేట నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. గురజాల నియోజకవర్గంలో సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త నూతలపాటి హనుమయ్యల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తె నాలి నియోజకవర్గంలో గళ్లా చందు, వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జునల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో డాక్టరు నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శన చేశారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూఫ్, మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శన సాగింది. రైతులు భారీగా పాల్గొన్ని మద్దతు తెలిపారు. గుంటూరు నగరంలో... గుంటూరు నగరంలో పార్టీ యువజన విభాగం నగర కన్వీనర్, తూర్పు సమన్వయకర్త ఎండీ నసీర్‌అహ్మద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు సమన్వయకర్త షేక్ షౌకత్, ట్రేడ్‌యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్‌లు డప్పులు వాయించారు. -
టమోటా తగ్గుముఖం
మైదుకూరు(చాపాడు), న్యూస్‌లైన్ : టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలలుగా వాటి ధరలు ఆకాశాన్ని అంటడంతో పసుపు, వరి సాగు చేసుకున్న రైతులు తాము కూడా టమోటా సాగు చేసుకున్నా బాగుండునేమోనని ఆటోచనలో పడ్డారు. ఇప్పడైనా సాగు చేద్దామని ఇటీవల రైతులు ఎక్కువ విస్తీర్ణంలో టమోటా సాగుచేశారు. అయితే వారి ఆశలు ఆవిరి అవుతున్నాయి. టమాటాను ఎందుకు సాగు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారు. మైదుకూరు మండలం వ్యాప్తంగా సుమారు ఆరు వేల ఎకరాలలో రైతులు టమోటా సాగు చేశారు. రెండు నెలలుగా టమోటాల దిగుబడులు అధికంగా రావడంతోపాటు ధరలు కూడా అధికంగానే ఉంటూ వచ్చాయి. సమైక్యాంధ్రా ఉద్యమం ప్రారంభం నుంచి రెండు వారాల క్రితం వరకు ధరలు బాగానే ఉన్నాయి. గతంలో 20 కేజీల టమోటాల బాక్సు రూ.1000-రూ.1200 వరకు పలికింది. ఆ సమయంలో రైతులు సొమ్ము చేసుకున్నారు. రెండు వారాల క్రితం నుంచి టమోటా రైతు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బాక్సు రూ.1000 ఉన్న ధరలు రోజుకు రోజుకు తగ్గిపోతూనే ఉంది. 20 కేజీల టమోటాల బాక్సు ధరలు క్రమంగా రూ.800, రూ.600, రూ.400 నుంచి ఏకంగా రూ.210-రూ.220లకు పడిపోయాయి. ‘దిగుబడి చూస్తే పెరుగుతోంది.. ధరలు చూస్తే తగ్గుతున్నాయి.. వ్యాపారులేమో రోజుకొకరేటు చెబుతున్నారు... ఎంటి మన పరిస్థితి’ అన్న సందిగ్ధంలో రైతన్నలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు తరలింపు మైదుకూరు ప్రాంతంలో పండిన టమోటను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వైజాగ్, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలలో రెట్టింపు ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడైనా తిరిగి వస్తుందేమోనని.. నేను ఎకరాన్నర్ర పొలంలో టమోటా పంటను సాగు చేశాను. రెండు వారాల క్రితం నుంచే పంట వస్తోంది. ప్రస్తుతం కోతకు 15 బాక్కులు వస్తున్నాయి. ఎకరా సాగుకు రూ.30వేలు పైగా పెట్టుబడి అయింది. ధరలు చూస్తే రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఎంత త్వరగా పంటను అమ్మి తమ పెట్టుబడిని సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడుతున్నా. - ఎం.సుబ్బరాజు, టమోటా రైతు, విశ్వనాథపురం -
నిరసన జ్వాల
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనపై ‘అనంత’లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకుంది. విభజనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శనివారం విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 970 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించే యత్నం చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్ పర్యవేక్షించారు. సప్తగిరి సర్కిల్లో టైర్లకు నిప్పు పెట్టి సమైక్య నినాదాలు చేశారు. ఎస్కేయూ నుంచి భారీగా నగరంలోకి వచ్చిన విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కళ్యాణదుర్గం రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇతర నేతలు రాస్తారోకో నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ, ఉపాధ్యాయ జాక్టో నాయకులు ర్యాలీ నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్షను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను కట్టడి చేసేందుకు హాస్టల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ నేతలు.. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి కాంగ్రెస్ పార్టీ జెండాలు, కండువాలను దహనం చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇనాయతుల్లా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. లేపాక్షి, చిలమత్తూరు, బత్తలపల్లి, ముదిగుబ్బలో ర్యాలీ లు, మానవహారాలు చేపట్టారు. కదిరిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి జీవోఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేత అత్తార్ చాంద్‌బాషా, దేవానంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో వంటావార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కుందుర్పి, గాండ్లపెంట, విడపనకల్లు, అమరాపురం, కూడేరు, గార్లదిన్నె, కణేకల్లు, బుక్కపట్నం, గుడిబండ, కంబదూరు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, ఓడీసీ, అమడగూరు మండలాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు బైక్‌ర్యాలీలు, ర్యాలీలు నిర్వహించారు. మడకశిరలో వైఎస్సార్సీపీ నాయకులు వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నల్లమాడలో వైఎస్ఆర్సీపీ నేత సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పరిగిలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపురామ చంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకులు, టీడీపీ నేతలు.. ఉరవకొండలో జాక్టో ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. -
నేటి నుంచి మళ్లీ సమైక్య ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మరోమారు ఉద్యమించనున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో గురువారం నుంచి దీక్షా శిబిరాలు నిర్వహించనున్నామని వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం తెలిపారు. స్థానిక ఎన్జీవో కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం గతంలో ఉద్యోగులు 66 రోజులు సమ్మె చేసి రూ.2,400 కోట్లు నష్టపోయారన్నారు. అయినా కేంద్రం, కాం గ్రెస్ పార్టీ పట్టించుకోకుండా రాష్ట్ర విభజన దిశగా ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఇందుకు నిరసనగా యూపీఏ చైర్పర్సన్ జన్మదినమైన డిసెంబర్ 9ని విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఆ రోజు జిల్లాలోని ఉద్యోగులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతారన్నారు. రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయడమే కాకుండా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ఓటు బ్యాంకు పెంచుకోవడానికే ఆ పార్టీ పాకులాడుతోందని ధ్వజమెత్తారు. ఐదున్నర కోట్ల సీమాంధ్ర ప్రజల మనోభావాలు గుర్తించకుండా మూడున్నర కోట్లమంది తెలంగాణ ప్రజల మనోభావాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని విభజించాలని చూడడం కాంగ్రెస్ దుర్బుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ , రాయల తెలంగాణ అంటూ పూటకో పేరుతో ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. వేదిక కన్వీనర్ బుక్కూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ టీ బిల్లు పెట్టిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన కేంద్ర మంత్రి చిరంజీవి, ఆ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబును రాజీనామా చేయాలని కోరడం శోచనీయమన్నారు. మరో కన్వీనర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ విభజన పట్ల విద్యార్ధిలోకం తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. వేదిక కో-కన్వీనర్ కొంక్యాన వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి 60 ఏళ్లు పట్టిందని, విభజన జరిగితే సీమాంధ్రలో రెండు తరాలు భవిష్యత్తును కోల్పోవలసి వస్తుందన్నారు. జాతీయ పార్టీలు జాతీయ భావజాలం కోల్పోయి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదన్నారు. కిలారి నారాయణరావు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్ర కోసం కృషి చేయాలన్నారు. దుప్పల వెంకటరావు, దిలీప్‌లు మాట్లాడుతూ దేశంలో ఎన్నో సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుండగా కేవలం ఆంధ్రప్రదేశ్ విభజనపైనే దృష్టి సారించి విభజించాలని కంకణం కట్టుకోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కమిటీ ప్రతినిధులు పూజారి జానకీరాం, పి.జయరాం, ఆర్.వేణుగోపాలరావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వై.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాయల ఒప్పుకోం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 125వరోజూ సోమవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. తిరుపతిలో సమైక్యవాదులు తలలపై కుర్చీలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలి పారు. మదనపల్లెలో జేఏసీ నేతలు సదస్సు నిర్వహించి విభజన వల్ల రాయలసీమకు జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో విద్యార్థులు ‘వుయ్ హేట్ టీ బిల్’ అక్షరాకృతిలో కూర్చుని కేంద్రప్రభుత్వ తీరుపై నిరసనృవ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ పాలకొల్లు, నరసాపురం, మార్టేరు పట్టణాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. కృష్ణాజిల్లా కలిదిండిలో కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. అవనిగడ్డలో దీక్షలు 100వ రోజుకు చేరిన సందర్భంగా 100మంది విద్యార్ధులు ఒకరోజు దీక్ష చేపట్టారు. -
సమ్మెలో పాల్గొన్న ఇంటర్ సిబ్బందికి వేతనం
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో(సెప్టెంబర్ 6-అక్టోబర్ 10) పాల్గొన్న ఇంటర్ విద్య అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి వేతనం చెల్లించేందుకు వీలుగా మాధ్యమిక విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరు సమ్మెకాలంలో కోల్పోయిన 25 పనిదినాలను అక్టోబర్ 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు 24 సెలవులు, ఒకరోజు అదనపు పనిగంటలు కలిపి మొత్తంగా 25 పనిదినాలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. -
సెక్షన్-30 ఇంకానా?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారా? నిబంధనల పేరుతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇదంతా జిల్లా మంత్రి బొత్స ప్రాపకం కోసమేనా? పరిస్థితు లు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయని జిల్లా ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతంలో అనేక జిల్లా కేంద్రాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా జరుగుతున్నా ఈ జిల్లా కేంద్రంలో మాత్రం పోలీసు చట్టాలు అమలు చేస్తూ ఉద్యమం లేకుండా చూస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతంలోను, విజయనగరం పరిసర గ్రామాల్లోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వివిధ రూపాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. ఒక్క విజయనగరంలోనే సమైక్యాంధ్ర ఉద్యమం జరగకపోవడం వెనుక జిల్లా మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెక్షన్ 30 అమలుతో భయాందోళనలో ప్రజలు.. సెక్షన్ 30ని పోలీసులు ప్రజలకు భూతద్దంలో చూపిస్తూ వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలు వెనుకాడుతున్నాయి. విజయనగరం పట్టణంలో ఇంకా సీఆర్పీఎఫ్ బలగాలు సంచరిస్తున్నాయి. అమాయకులను కూడా.. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 4,5 తేదీల్లో మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని ఎన్జీఓలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉద్యోగ సంఘాలు, యువకులు, విద్యార్థులు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్సఝాన్సీలక్ష్మి ఇంటి ముట్టడికి తలపెట్టారు. ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీయడంతో పోలీ సుల వాహనాల అద్దాలను ఆందోళనకారులు బద్దలు కొట్టారు. మంత్రి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. సుమారు 50మంది వరకు మంత్రికి చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తే సుమారు వెయ్యిమంది వరకు ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టి తీవ్ర భయాందోళనకు గురిచేశారు. అందులో ప్రతిపక్షపార్టీలకు చెందిన యువకులు, కార్యకర్తలను ఎక్కువగా అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూడడానికి వెళ్లినయువకులు, అమాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ మీద సెక్షన్లు... . అక్టోబర్ 4న ప్రారంభించిన 144 సెక్షన్, 6వ తేదీ నుంచి పట్టణంలో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ అక్టోబర్ 19వ తేదీవరకు సడలింపుల మధ్య జరిగిం ది. 144 సెక్షన్ అక్టోబర్ 30వ తేదీ వరకు కొనసాగించారు. 30న సెక్షన్ 30ని అమల్లోకి తెచ్చారు. నవంబర్ 14న మరోసారి సెక్షన్ 30ని 28వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సెక్షన్ 30 అమలులో ఉండడం వల్ల పోలీసు విజయనగరం డివిజన్ పరిధిలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడానికి వీలుకాలేదు. పోలీసులు ఇన్ని సెక్షన్ల మీద సెక్షన్లు విధించడానికి మూల కారణం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికేనని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో కూడా విజయనగరం పట్టణంలో ఇలాంటి నిషేధాజ్ఞలు విధించడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలి
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని సమైక్య ఉద్యమ జెడ్పీ ఉద్యోగ సంఘ నాయకుడు కిలారి నారాయణరావు పిలుపునిచ్చారు. జెడ్పీ కార్యాలయం ఎదురుగా శనివారం భోజన విరామ సమయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు. జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో సమైక్య నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ ప్యాకేజీలంటూ కృపారాణితో పాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం వద్ద గొంతెత్తడం దారుణమన్నారు. వీరికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అనంతరం విభజన కారులకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై నినదించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు డి.సుందరరావు, కె.అప్పలనాయుడు, శోభారాణి, పార్వతి, ఎస్.సోమశేఖర్, వి.శ్రీనివాస్, ఎన్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఎగసిపడితేనే విభజన ఆగేది
పాలకొల్లు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడితేనే విభజన ప్రక్రియ ఆగుతుందని రాష్ట్ర రైతు జేఏసీ అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్లో నిర్వహించిన రైతు సమైక్య గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విభజన విషయంపై రైతులు తీవ్రంగా స్పందించకపోతే పెనుముప్పు తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమంలో రైతులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత రాజకీయనాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యమత్యంగా పనిచేస్తే సీమాంధ్ర ప్రాంతంలోని నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని నాగేంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమైక్యవాదం, ఢిల్లీ పెద్దల ముందు వేర్పాటువాదాన్ని వినిపిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలను తమ పదవులకు రాజీనామా చేయాలంటూ గట్టిగా నిలదీసినప్పుడే ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో కొంతమంది దొంగలున్నారని కేంద్రంతో ప్యాకేజీలు మాట్లాడుకుని విదేశాలకు వెళ్లేపోయే ప్రయత్నం చేస్తున్నారని అటువంటివారిని ఎట్టిపరిస్థితిలోను వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. సభకు అద్యక్షత వహించిన జిల్లా రైతు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలు పూర్తయ్యి, విభజన జరిగితే సీమాంధ్రకు నీరు వచ్చే అవకాశం లేదని తద్వారా ఈప్రాంత భూములన్నీ బీడువారక తప్పదని అందువల్ల రైతులంతా మరింత తీవ్రంగా ఉద్యమించాలన్నారు. ఈనాటి సభలో రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు మాగంటి సీతారామస్వామి, రాష్ట్ర రైతు జేఏసీ కార్యదర్శి శ్యాంప్రసాద్‌ముఖర్జీ, రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.కమలాకర్‌శర్మ, జిల్లా వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు పి.మురళీకృష్ణ. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ కృష్ణయ్య, జిల్లా రైతు జేఏసీ కార్యదర్శి పరిమి రాఘవులు, జంగం కుమారస్వామి, చిలుకూరి సత్యవతి, ఎస్ మనోరమ, యడ్ల తాతాజీ, గుమ్మాపు సూర్యవరప్రసాద్, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, కొప్పుసత్యనారాయణ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి తహసిల్దార్లు పి.వెంకట్రావు, వి.స్వామినాయుడు, సీహెచ్ గురుప్రసాదరావు, ఉద్యోగసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవీ రైతు గర్జన సభలో ఏకగ్రీ వంగా ఆమోదించిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. విభజనకు వత్తాసు పలుకుతున్న ఎంపీలు, మంత్రులను భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ బహిష్కరణ చేస్తూ ప్రతి గ్రామ పొలిమేరల్లో బహిష్కరణ బోర్డులు పెట్టి ప్రజ లను చైతన్యవంతం చేయడం, విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం సాగు, తాగునీరు లేక తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొంటాయి.. అందువల్ల ప్రస్తుత దాళ్వాకు పంట విరామం ప్రకటించి సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. గతనెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ్రపభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలుచేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. -
సమైక్యాంధ్ర ఉద్యమంపై నేడు సమావేశం
శ్రీకాకుళం అర్బన్, న్యూ స్ లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం 10 గం టలకు సమావేశం నిర్వహించనున్నామని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణారావు శనివారం తెలిపారు. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా జిల్లాల్లో పర్యటిస్తున్న వేదిక కన్వీనర్ ల క్ష్మారెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆచార్యులు ప్రసాదరెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ ఆచార్యులు జి.తులసీరావు, రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, ప్రతినిధులు జామి భీమశంకర్, గీతాశ్రీకాంత్, దుప్పల వెంకట్రావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్, కిలారి నారాయణరావు, కాళీ ప్రసాద్, జయరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర తది తరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
విభజనతో సమస్యలు వస్తాయి: రాఘవులు
-
విభజనతో సమస్యలు వస్తాయి: రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం (జీఓఎం)కు విజ్ఞప్తి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన జీఓఎంతో భేటీ అయ్యారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని రెండుగా విభజించినంత మాత్రాన ఇరుప్రాంతాల్లో నెలకొన్న అసమానతలు కానీ అభివృద్ధిలో ఏర్పడిన వ్యత్యాసాలు కానీ మారవని జోఓఎంకు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని జీఓఎంకు వివరించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ నెల 3వ తేదీన జీవోఎంకు రాసిన లేఖను రాఘవులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాఘవులుతోపాటు ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ఈరోజు ఉదయం జీఓఎం ఎదుట హాజరై విభజనపై తమ వైఖరిని వివరించారు. గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కరువు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని జీవోఎంను కోరినట్లు చెప్పారు. వివిధ జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్య సంస్థలు అన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్న సంగతిని ఈ సందర్బంగా జీవోఎంకు గుర్తు చేసినట్లు వివరించారు. అలాంటి సంస్థలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీనివా, చిత్తూరు జిల్లాలో గాలేరు నగరి, కడపలో కల్వకుర్తి నెట్టెంపాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెలుగొండ, నల్గొండ జిల్లాకు ఉపయోగపడే ఎల్ఎల్బీసీ ప్రాజెక్ట్‌లు పూర్తికి సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. ముస్లీంలు అధికంగా ఉన్న పట్టణాల్లో లౌకిక విద్యను అందించేందుకు సత్వరమే కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరారు. -
'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి'
సమైక్య ఉద్యమం దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ ప్రసంగిస్తూ... చంద్రబాబు కేసులకు భయపడే యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాపం చేశారని, ఆ పాపంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని పద్మ పేర్కొన్నారు. తన నీడను కూడా నమ్మని మనిషి చంద్రబాబు నాయుడు అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు. -
జన నినాదమై ఎగసిన సమైక్య సమరానికి శతదినోత్సవం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం గురువారం నాటికి వంద రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా సీమాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల సమైక్యవాదులు, విద్యార్థులు వంద అంకె రూపంలో మానవహారాలుగా నిలబడ్డారు. విశాఖలో సోనియా, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 216 జాతీయ రహదారి సమీపంలో ఉపాధ్యాయ, విద్యార్థి గర్జన నిర్వహించారు. వివిధ జేఏసీల పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, నరసాపురం, తణుకు, నిడదవోలు, ఆకివీడులలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కావలిలో విద్యార్థు లు ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో 200ల అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవో ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీల ఆధ్వర్యంలో సాయంత్రం గాంధీ విగ్రహం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. అనంత పురంలో యువజన జేఏసీ ఆధ్వర్యంలో యువభేరి బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులు టవర్‌క్లాక్ వద్ద రాస్తారోకో చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ జేఏసీ, ఆల్మర్చంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక్కరోజు పట్టణ బంద్ నిర్వహించారు. మంత్రి రఘువీరాకు సమైక్య సెగ.. పుట్టపర్తిలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సమైక్య సెగ తగిలింది. పుట్టపర్తిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమం, సత్యసాయి 88వ జయంతి వేడుకలకు సంబంధించి అధికారులతో సమీక్షిం చడానికి పుట్టపర్తికి వచ్చారు. మంత్రిని చూసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు అడ్డుకుని.. రఘువీరా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. -
సమైక్యంలో వినూత్నం
-
వంద రోజుల ఉద్యమంపై మీ అభిప్రాయం తెలుపండి!
సమైక్యాంధ్ర ప్రదేశ్ ఎనిమిది కోట్ల జనాభాలో మెజార్టీ ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అనేక దశాబ్దాల కాలం నుంచి కలిసి మెలిసి ఉంటున్న తెలుగు ప్రజలను కేవలం ఓట్లు, సీట్లు, రాజకీయ లబ్ది ప్రతిపాదికన అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం కారణంగా రెండు ముక్కలు కాబోతుంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన మహోద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతాం.. నిరసిద్దాం.. అడ్డుకుందాం.. వంద రోజుల సమైక్య ఉద్యమంపై మేము మా గళాన్ని వినిపిస్తున్నాం.. మీరు మాతో గొంతు కలపండి... మీ అభిప్రాయాలను పంచుకోండి... -
సర్కారు కుట్రలను తిప్పికొట్టిన ప్రజా పోరాటం
-
‘సమైక్యం’ కోసం దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తోంది. అందులో భాగంగా బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధనానికి సమాయత్తమైంది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు రహదారులను దిగ్బంధించనున్నాయి. ఇందుకోసం జిల్లా పార్టీ నేతలు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ జిల్లాలోని నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే విధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో చర్చించారు. జిల్లాలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో రెండు రోజులపాటు ప్రధాన రహదారుల దిగ్బంధనానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మండల, పట్టణ కన్వీనర్లకు ఆ కార్యాచరణను వివరించారు. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదుల సహకారంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉద్యుక్తమవుతున్నారు. పకడ్బందీ వ్యూహం... రెండు రోజులపాటు ప్రధాన రహదారుల దిగ్బంధనానికి వైఎస్సార్సీపీ పక్కా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రెండు ప్రధాన రహదారులపై దృష్టి కేంద్రీకరించింది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారి, త్రోవగుంట- దిగమర్రు రాష్ట్ర రహదారులను అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారిపై మేదరమెట్ల, మార్టూరు, మద్దిపాడు, ఒంగోలు, సింగరాయకొండ, ఉలవపాడు, తెట్టు... ఇలా ప్రతి చోటా రాకపోకలను అడ్డుకోనున్నారు. త్రోవగుంట- దిగమర్రు రాష్ట్ర రహదారిపై కూడా పలు చోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ బాధ్యతను చీరాల నియోజకవర్గ నేతలు వహిస్తారు. అదే విధంగా పశ్చిమ మండలాల్లోని దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా పలుచోట్ల రహదారులను దిగ్బంధించనున్నారు. బృందాలవారీగా... రెండు రోజులపాటు రహదారుల దిగ్బంధనానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగనుంది. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఒక బృందాన్ని అడ్డుకున్నా... మరో బృందం వెంటనే రంగంలోకి దిగాలన్నది వ్యూహం. అందుకోసం ప్రత్యేకమైన పాయింట్లను కూడా గుర్తించారు. ఈ పాయింట్లకు ఇన్చార్జిలను నియమించారు. ప్రతి ఇన్చార్జికి కొంతమంది నేతలు, కార్యకర్తల బృందాన్ని కేటాయించారు. ఒక బృందం తరువాత ఒక బృందం రహదారులను దిగ్బంధిస్తారు. రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో మొదటి రోజుకు భిన్నంగా రెండోరోజు ఆందోళనను వైఎస్సార్సీపీ రూపొందించింది. పలు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలతో కొన్ని ప్రత్యేక పాయింట్లలో రహదారులను దిగ్బంధించనున్నారు. 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధనంతో ప్రజల సమైక్యాంధ్ర స్ఫూర్తిని మరోసారి రగిలించాలన్నది తమ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. -
మిగిలింది పస్తులే..!
చీరాల, న్యూస్‌లైన్: నేసిన వస్త్రాలు అమ్ముడుపోక చేనేత కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో దసరా, దీపావళి తదితర ప్రధాన పండుగల సమయాల్లో చేనేతల పరిస్థితి ఆశాజనకంగా ఉండేది. అప్పటి వరకు నేసిన వస్త్రాలు అమ్ముడుపోయి చేతినిండా డబ్బులుండేవి. మామూలు రోజుల్లో ఉపాధి కరువై మగ్గం సాగక, పూట గడవక పస్తులతో పోరాడుతుండేవారు. ప్రస్తుతం కనీసం పండుగ రోజుల్లో కూడా పట్టెడన్నం తినే పరిస్థితి లేక చేనేతలు ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వం తీరే. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం వస్త్రాలను కొనుగోలు చేసే విషయంలో సవతి తల్లి ప్రేమను కనబరుస్తోంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆప్కో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కొనుగోళ్లు చేసి మమ అనిపిస్తోంది. మాస్టర్ వీవర్ల వద్ద పేరుకుపోతున్న నిల్వలు: జిల్లాలో 24 వేల చేనేత మగ్గాలున్నాయి. ఇరవై వేల పైచిలుకు చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1.60 లక్షల మంది చేనేతలు పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడ్డారు. జిల్లాలో 56 వరకు ఆప్కో సొసైటీలుండగా చీరాలలోనే 30 సంఘాలు పనిచేస్తున్నాయి. నిత్యం కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తేనే పూట గడిచేది. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల అమ్మకాలు పూర్తిగా స్తంభించి జిల్లాలో రూ. 8 కోట్ల విలువైన చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా చేనేత మగ్గాలపై ఐదు వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అమ్మకాలు లేకపోవడం, ఆప్కో కొనుగోళ్లు చేయకపోవడంతో చేనేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్కో మాస్టర్ వీవర్ వద్ద రూ. 10 నుంచి రూ. 20 లక్షల విలువైన చేనేత వస్త్రాల నిల్వలున్నాయని సమాచారం. అప్పులపాలవుతున్న చేనేతలు: వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూతనివ్వకపోవడంతో మాస్టర్‌వీవర్లు చేనేత కార్మికులకు పని కల్పించడం లేదు. దీంతో పూట గడవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ, తదితర నూలును ముంబాయి, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మూడు నెలల వ్యవధిలో వచ్చిన వినాయకచవితి, దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ అయిన శ్రావణమాసంలో కూడా చేనేత వస్త్రాల అమ్మకాలు అరకొరగానే జరగడంతో ఎక్కడికక్కడ నిల్వలు పేరుకుపోయాయి. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాల అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్న అమాత్యుల హామీలు బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా కార్మికులకు పస్తులే మిగిలాయి. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి పడవల లక్ష్మణస్వామి, హ్యాండ్లూమ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. -
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు: మారెప్ప
ఒంగోలు, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మాజీమంత్రి మారెప్ప విమర్శించారు. కృత్రిమ ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్రం.. రాష్ట్రానికి మరింత నష్టం కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణవాదులంతా సోనియాగాంధీ వద్ద వాస్తవాలు దాచిపెట్టారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని కేంద్రం తప్పుచేసిందన్నారు. అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకుండా కేంద్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా రాష్ర్ట విభజన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతగానితనం వల్లే అలా జరిగిందన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. చేతనైతే రైతుల రుణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రుణాలను రద్దుచేయాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ హయాంలో రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని కష్టనష్టాల నుంచి వారిని గట్టెక్కించేవారని గుర్తుచేసుకున్నారు. సుమారు 13 వేలకోట్ల రూపాయల రైతుల రుణాలను వైఎస్ఆర్ రద్దుచేశారని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయసాధన కోసం, ఆయన మరణించిన సమయంలో తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకడుగు వేయలేదన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఎదురుతిరిగాడని, అందుకనే ఆయన్ను అన్యాయంగా జైలుపాలుచేసి కక్ష సాధించారని మారెప్ప మండిపడ్డారు. జగన్ భయంతోనే చివరకు రాష్ట్ర విభజనకు సైతం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికుట్రలు చేసినా జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరు ఎదురుతిరిగినా సీబీఐని ఉసిగొలిపి కక్ష సాధించడం షరామామూలేందని మారెప్ప విమర్శించారు. చిరంజీవిని ప్రజలు ఆదరించరు... చిరంజీవి కొత్తపార్టీ పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయని, ఆయన్ను నమ్మి ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మారెప్ప స్పష్టం చేశారు. పీఆర్పీ పేరుతో ఆయన చేసిన మోసాన్ని ప్రజలు ఇంకా మరవలేదన్నారు. హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి చేసుకున్నారని, దాన్ని ఒక ప్రాంతానికే కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. అదే జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబునాయుడు నడుంబిగించారని విమర్శించారు. ఆయన మాటలు, చేతలు అలాగే ఉన్నాయన్నారు. 1975లో ఎస్టీ సబ్‌ప్లాన్, 1980లో ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు 30 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులను దారిమళ్లించారని మారెప్ప వెల్లడించారు. ప్రస్తుతం 13 వేల కోట్ల రూపాయలను సబ్ప్లాన్కోసం కేటాయించినందున ఎస్పీ, ఎస్టీలకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కోటి రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని నిబంధనలున్నా.. ఇప్పటి వరకు కనీసం 15 వేల రూపాయలు కూడా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రాలేదని విమర్శించారు. కనీస సౌకర్యాలు లేని ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించి వాటికిచ్చిన అనుమతులు, గుర్తింపును వెంటనే రద్దుచేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ నాయకుడు దారా సాంబయ్య ఉన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి పార్టీ కలసి రావాలి
కనిగిరి టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి ఒక్క పార్టీ కలసిరావాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. స్థానిక రాష్ట్ర యూత్ కార్యవర్గ సభ్యుడు వైఎం ప్రసాదరెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ రెండు కళ్ల సిద్ధాంతాలను అవలంబిస్తూ ఉద్యమంలోకి రాకుండా నాటకాలాడుతూ సీమాంధ్ర ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. రాజకీయ నాయకులు తమ పదవులు పట్టుకుని ఊగులాడకుండా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు, యువకుల భవిష్యత్తు కోసం వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. సమావేశంలో మండల కన్వీనర్లు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, గుడిపాటి ఖాదర్, ఎస్సీ సెల్ కన్వీనర్ మధు, నాయకులు మడతల కస్తూరిరెడ్డి, తమ్మినేని శ్రీనువాసులరెడ్డి, పులి శ్రీనివాసులరెడ్డి, నంబుల నర్సయ్య, పాతకొట్టు రమణారెడ్డి, కత్తులపల్లి బాస్కర్‌రెడ్డి, సిద్దారెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, మధు, ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడింది వైఎస్సార్ సీపీనే.. ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు కట్టుబడింది వైఎస్సార్ సీపీనే అని పార్టీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలులో యువజనులు, విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన కేవలం ఓట్లు, సీట్ల ప్రాతిపదికనే జరుగుతోందన్నారు. తన కొడుకును ప్రధానిని చేయాలనే ఏకైక ఉద్దేశంతో సోనియా నేడు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమైక్య శంఖారావానికి వర్షాలు పడుతున్నా జనం భారీగా తరలిరావడాన్ని బట్టి చూస్తేనే రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో స్పష్టమవుతోందన్నారు. ఢిల్లీ పెద్దలు ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్‌లు రెండూ కుమ్మక్కవుతూ ప్రజలను ఇంకా డ్రామాల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు తిప్పికొట్టాలన్నారు. -
టెట్ ఎప్పుడు?
మోర్తాడ్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో వాయిదా పడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఎప్పుడు నిర్వహిస్తారా.. అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమ ప్రభావం తగ్గడంతో పరీక్ష నిర్వహించవచ్చనే చాలామంది భావిస్తున్నారు. మరోవైపు టెట్‌ను నిర్వహించడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో బీఈడీ, టీటీసీ పూర్తి చేసినవారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు జూలైలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. దీంతో ప్రభుత్వం టెట్‌ను వాయిదా వేసింది. పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కొద్ది రోజుల క్రితం సమ్మె విరమించారు. దీంతో టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు టెట్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర మాధ్యమిక శాఖ ఉన్నతాధికారులు అందించినట్లు సమాచారం. టెట్ నిర్వహిస్తారన్న సమాచారం తెలియడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. వారు పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ నిర్వహించాలి.. టెట్ నిర్వహించిన వెంటనే డీఎస్సీ చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ నాన్చకుండా టెట్ తర్వాత వెంటనే డీఎస్సీని నిర్వహించాలని బీఈడీ, టీటీసీ, పీఈటీ తదితర అభ్యర్థులు కోరుతున్నారు. -
సీమాంధ్రలో ఆర్టీసీకి రూ.1,100 కోట్ల నష్టం
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీకి 1,100 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) సూర్యచంద్రరావు వెల్లడించారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక ఆర్ఎం కార్యాలయంలో ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 650 కోట్ల రాబడిని ఆర్టీసీ కోల్పోయిందన్నారు. సమ్మె కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు 15 వేలు, రెగ్యులర్ ఉద్యోగులకు 25 వేల రూపాయల చొప్పున అడ్వాన్స్‌లు చెల్లించామని, వాటితో పాటు పర్యవేక్షణ, ఇతర అంతర్గత నష్టం కలిపి 150 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. దీనికితోడు కార్మికులకు సమ్మె కాలాన్ని వారి సెలవుల్లో మినహాయించామని, దీనికోసం 300 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. అలా మొత్తం కలిపి 1,100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఈడీ వివరించారు. ఇక నెల్లూరు జోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. అంతేగాకుండా ఈ జోన్ పరిధిలో 600 బస్సుల బ్యాటరీలు పాడైపోయాయని తెలిపారు. సుమారు రెండు నెలల పాటు బస్సులు తిరగకపోవడం వల్ల అలా జరిగిందన్నారు. ఒక్కో బ్యాటరీ ఖరీదు 5 వేల రూపాయలు ఉంటుందన్నారు. వాటివల్ల మొత్తం 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. బస్సులు ఎక్కువకాలం తిరగకపోవడం వల్ల వాటి టైర్ల మన్నికపై కూడా ఆ ప్రభావం పడుతుందన్నారు. ఈ నష్టాన్ని మొత్తం భర్తీ చేయడం సాధ్యంకానిపనని, చార్జీల పెంపు మాత్రం అనివార్యమని చెప్పారు. లక్ష్యాలు అధిగమించాలి... సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని ఎలాగో భర్తీ చేయలేమని, అధికారులు, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేసి ఇకపై నెలవారీ లక్ష్యాలనైనా అధిగమిస్తే కొంత ఉపయోగం ఉంటుందని ఈడీ సూర్యచంద్రరావు సూచించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. విద్యాసంస్థలకు సెలవులు రద్దుచేస్తూ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కారణంగా సంక్రాంతి పండుగకు సైతం రద్దీ ఉండే అవకాశం లేదన్నారు. దానివల్ల ఆ సీజన్లో ఆర్టీసీకి వచ్చే 1.50 కోట్ల రూపాయల ఆదాయం ఈసారి వచ్చే అవకాశం లేదన్నారు. సమ్మె కాలంలో ప్రైవేటు వాహనాల నిలువుదోపిడీని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీసీని ఆదరిస్తారని తాము భావిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది సిటీ సర్వీసులు... జేఎన్యూఆర్ఎం పథకం కింద 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒంగోలుకు సిటీ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. మొత్తం 40 సర్వీసులు వస్తాయని, వాటిని 30 కిలోమీటర్ల పరిధిలో నడిపే అవకాశం ఉందని తెలిపారు. వాటివల్ల ఒంగోలు నగర, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మూడు నెలలుగా అద్దె కట్టకపోవడం వల్ల ఒంగోలు బస్టాండ్‌లో మూడు స్టాల్స్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలున్న వారు నవంబర్ 10వ తేదీలోగా పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దె బస్సుల యజమానులు కూడా నష్టపోయిన మాట వాస్తవమేనని, కాకుంటే బస్సులు రెండు నెలలపాటు నడపకపోవడం వల్ల వారితో ఉన్న ఒప్పందాన్ని మరో రెండునెలల పాటు పొడిగించే ప్రతిపాదన ఉందని తెలిపారు. రీజియన్ పరిధిలోని జిల్లాల్లో గల ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈడీ పేర్కొన్నారు. సమావేశంలో రీజియన్ పరిధిలోని పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
వరుస ఉద్యమాల వల్ల రాష్ట్ర ఖజనాకు భారీ గండి
-
ఎంపీలు, కేంద్ర మంత్రులవి నాటకాలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పావుగంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం తారస్థాయికి చేరుకున్నప్పటికీ సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని విమర్శించారు. తాము రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెబుతున్నారని, ప్రభుత్వం పడిపోతేనే విభజన వెనక్కు వెళుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పైగా తాము రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ అందుబాటులో లేరంటూ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. 75 రోజుల నుంచి సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ ఇక్కడి మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి జీఓ అమలుకు ప్రభుత్వం కమిటీని వేసి మోసగించిందన్నారు. సీమాంధ్రలో తాము ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా చాలా శాంతియుతంగా ఉద్య మం నిర్వహిస్తున్నామని, పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ప్రజల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు తమ ఉద్యమానికి అండగా ఉన్నారని, కేంద్రం దిగివచ్చి రాష్ట్ర విభజనపై వెనక్కు తగ్గే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. లేకుంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ భరతం పడతామని బషీర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తున్నారని, వారి ఉద్యమంలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు మమేకం కాకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. కోస్తా జిల్లాల్లో తుఫాన్ హెచ్చరికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందని తెలిపారు. తుఫాన్ ముప్పు తప్పడంతో రెవెన్యూ యంత్రాంగమంతా యథావిధిగా సమ్మెలో పాల్గొంటున్నట్లు కేఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకు లు కే శరత్‌బాబు,పీ రాజ్యలక్ష్మి, నాసర్ మస్తాన్‌వలి, రోజ్‌కుమార్, ఏడుకొండలు,శివకుమా ర్, కోయ కోటేశ్వరరావు, ఊతకోలు శ్రీనివాసరావు, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
మాకొద్దీ సైకిల్
రాష్ట్ర విభజన అంశం.. సమైక్యాంధ్ర ఉద్యమం తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది. పదేళ్లుగా అధికారం లేకపోవడం.. అధినేత రెండు కళ్ల సిద్ధాంతంతో సైకిల్ చతికిలపడింది. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరిట దేశ, రాష్ట్ర రాజకీయాల తలరాతలనే మార్చే స్థాయికి ఎదిగిన ‘అన్న’ ఆశయాలను గంగలో కలిపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ్ముళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. జిల్లా రాజకీయాల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. సైకిల్ ఎక్కే వారు కరువై రానున్న ఎన్నికల్లో వలస పక్షులపైనే ఆధారపడాల్సి రావడం పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం. సాక్షి, కర్నూలు: టీడీపీ కోట బీటలువారుతోంది. అధికారంలో ఉండగా ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో అలరారిన పార్టీ ఒక్కసారిగా నేలవాలింది. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభంజనం ముందు కోలుకోలేని విధంగా ఓటమి చవిచూసింది. 2009లోనూ అదే పరిస్థితి ఎదురవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకం కాగా.. కేవలం ఒక్క కుటుంబం చుట్టూ భవిష్యత్తు చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు ఆ నియోజకవర్గాల్లో తిరుగులేదనిపించినా.. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇన్‌చార్జీలకూ దిక్కులేని పరిస్థితి. పార్టీ సీనియర్ నేత బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి దూరమవడంతో నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం ఏర్పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు ఆ పార్టీ ప్రతిష్ట ఏ స్థాయిలో దిగజారిందో చెప్పకనే చెబుతోంది. అదేవిధంగా మంత్రాలయంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలనాగిరెడ్డి పార్టీని వీడటంతో ఆ నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైంది. కనీసం జెండా మోసే వారు లేకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ఏ ఒక్కరూ ముందుకు రాలేకపోతున్నారు. కోట్ల కుటుంబానికి కంచుకోటగా ఉన్న కోడుమూరులో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులపై పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో మణిగాంధీ టీడీపీ తరఫున బరిలో నిలిచి గట్టి పోటీనిచ్చారు. అయితే అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆయనా పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసే నాథుడే కరువయ్యాడు. ఆలూరులో నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎంపీపీ వైకుంఠం శివప్రసాద్‌ను నియమించినా కోలుకోలేకపోతోంది. ఫ్యాక్షన్ ప్రభావంతో ఆయన ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉండటంతో తమ్ముళ్లు దిక్కులేని వారయ్యారు. ఇక జిల్లా కేంద్రమైన కర్నూలులో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతిసారీ మిత్రపక్షాల ఒప్పందంలో సీపీఎంకి ఆ సీటు దక్కడంతో పార్టీ ఉన్నా లేనట్లేననే భావన నెలకొంది. మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి పార్టీలో చేరినా ఆయనకు వ్యతిరేకత ఉండటంతో శ్రేణులు రెండుగా చీలిపోయారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు చౌదరి చేస్తున్న ప్రయత్నాలకు మరో వర్గం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూనే ఉంది. గత ఎన్నికల్లో పోటీ పడి నంద్యాలలో ఓటమి పాలైన ఎన్.హెచ్. భాస్కర్ రెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఫరూక్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో అక్కడ అసమ్మతి రాగం వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బి.వి.మోహన్‌రెడ్డి మరణంతో ఎమ్మిగనూరులో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. ఆయన కుమారుడు జయనాగేశ్వరరెడ్డి పార్టీ బాధ్యతలు చూస్తున్నా ప్రత్యర్థి నేతలతో ఢీకొనే శక్తి లేకపోవడం.. తమ్ముళ్లకు అండగా నిలవకపోవడం పార్టీని నష్టపరుస్తోంది. ఆళ్లగడ్డలో ఇరిగెల ఉన్నా ఆయనకు ఓటమితోనే పరిచయం ఎక్కువ. బనగానపల్లె, శ్రీశైలంలో ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుడ్డా కుటుంబీకులు టీడీపీ వీడటంతో పార్టీ దిక్కులేనిదైంది. వలస వచ్చిన బి.సి.జనార్దన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో కాలం గడుపుతున్నారు. ఆదోనిలో ఆ పార్టీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వరనే అపవాదును మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితి అంతర్గత కుమ్ములాటలకు తావిస్తోంది. పత్తికొండ, డోన్లలో ఎమ్మెల్యేలుగా ఉన్న కేఈ సోదరులు ఇటు పార్టీకి, అటు పదవులకు అంతా తామేనన్నట్లు వ్యవహరిస్తుండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఎదుగుదల మందగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాలోనూ అదే పరిస్థితి జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలలోనూ సైకిల్ పంక్చరైంది. గతంలో కర్నూలు నుంచి పోటీ చేసిన బీటీ నాయుడు ఇక గెలవలేననే భావనతో మంత్రాలయం అసెంబ్లీ నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను పత్తికొండను వదిలేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని కేఈ ప్రభాకర్ బాహాటంగానే ప్రకటించారు. దీంతో పార్టీలో కలకలం రేగింది. నంద్యాల పార్లమెంట్లో టీడీపీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. ఫరూక్ కూడా అసెంబ్లీ వైపు మొగ్గు చూపడంతో ఎంపీగా ఆ పార్టీ తరఫున పోటీ చేసే వారే కరువయ్యారు. వలస పక్షులపైనే ఆశలు రోజు రోజుకూ ప్రశ్నార్థకంగా మారుతున్న టీడీపీకి వలస పక్షులే దిక్కయ్యారు. నంద్యాల ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి గంగులను రప్పించుకోవాలని ఆ పార్టీ అధినేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముణిగాంధీ పార్టీ వీడాక కోడుమూరుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మురళీకృష్ణ వస్తే మెరుగుపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కర్నూలు పార్లమెంట్‌కు మంత్రి టీజీ వెంటకటేష్ వస్తారని టీడీపీ వర్గీయుల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. వలస పక్షుల రాకతోనైనా సైకిల్‌కు పట్టిన తుప్పు వదులుతుందేమోనని తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత..
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తమ భవిష్యత్తు బజారు పాలేనంటూ ఎస్కేయూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 72 రోజులుగా అనంతపురం నగరంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో తామూ పాలుపంచుకుంటామని ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బయల్దేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. మూడు గంటల పాటు పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోయారు. అనంతపురంలో జరిగే ఉద్యమంలో పాల్గొనేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఎస్కేయూ విద్యార్థులు కోరగా.. పోలీసులు ససేమిరా అన్నారు. ఏదేమైనా తాము ఉద్యమంలో పాల్గొంటామని గురువారం ఉదయమే వందలాది మంది విద్యార్థులు బస్సుల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే జిల్లా కేంద్రం నుంచి డీఎస్పీ దయానందరెడ్డి, సీఐలు మహబూబ్‌బాషా, గోరంట్ల మాధవ్, గురునాథ్‌బాబు, శ్రీనివాసులు, విజయకుమార్, పలువురు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులతో యూనివర్సిటీకి చేరుకున్నారు. వర్సిటీ విద్యార్థులు నగరంలోకి వస్తే అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశమున్నందున అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య అర గంటకుపైగా వాగ్వాదం జరిగింది. అనంతరం అనేక మంది విద్యార్థులు బస్సుల్లో పంగల్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు బస్సులను అడ్డుకున్నాయి. విద్యార్థులంతా బస్సులు దిగి పోలీసులను ప్రతిఘటించారు. తామేమైనా వీధి రౌడీలమా.. అంటూ ఆగ్రహించారు. నగరంలోకి వెళ్లి తీరతామని ఆక్రోశం వెళ్లగక్కారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని విద్యార్థులు పంగల్ రోడ్డు నుంచి నగరంలోకి వెళ్లాలని పరుగులు తీశారు. పోలీసులూ వారిని వెంబడించారు. ఆర్డీటీ స్టేడియం, టీవీ టవర్ వరకూ విడతల వారీగా విద్యార్థులు పరుగెత్తారు. వారిని పోలీసులు ఎక్కడిక క్కడ అడ్డుకుని ఈడ్చి పారేశారు. నగరం నుంచి అదనపు బలగాలను పంపించిన ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోగానే ఓ సీఐ ‘మీరు మనుషులా.. కాదా.. ఒక్కసారి చెప్తే వినబడదా.. కొడుకుల్లారా.. మీ ఇష్టం’ అంటూ విద్యార్థుల మీదకు వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకున్న పలువురు విద్యార్థులు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోగా.. మరికొంత మందిని పోలీసులే విచక్షణారహితంగా తోసివేశారు. ప్రొఫెసర్ డాక్టర్ సదాశివరెడ్డి పంగల్ రోడ్డులో సొమ్మసిల్లిపడిపోయారు. పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మరింత రెచ్చిపోయిన పోలీసులు విశ్వవిద్యాలయాల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ రాజేశ్వరరావునూ ఈడ్చిపారేశారు. విద్యార్థినులను సైతం మహిళా పోలీసులు అడ్డుకోగా వారు రోడ్డుపైనే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రాణాలర్పించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని ప్రతిన బూనారు. మూడు గంటల హైడ్రామా అనంతరం పలువురు సమైక్యవాదులను జీపుల్లో ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. వదిలేశారు. -
సమైక్య రాష్ట్రాన్ని రక్షిస్తాం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వరుసగా 70వ రోజు ఆందోళనలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సైతం సమ్మె చేపట్టడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. నగరంలోని పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ కార్యాలయాలతో పాటు సుమారు 60 వాణిజ్య బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. అలాగే నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన ఉద్యోగులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆ సమయంలో ఆందోళనకారులను ఎంపీ ఇంటివద్ద పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తాను ఎంపీ పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించడం లేదని ఉద్యోగులకు మాగుంట సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాజీనామా లేఖను వారందరికీ చూపించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతో నిరసన... జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతో సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మరోసారి ముట్టడించారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో వాటిని ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్జీఓలు, ఉద్యోగులు కలిసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించి నిరసన తెలిపారు. పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తోరోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు రోడ్డుపై ఆందోళనకు దిగి నిరసన తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. చీరాల పట్టణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. విజ్ఞాన్ భారతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. మార్కాపురంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలను మూసివేయించి కేంద్ర ప్రభుత్వ సర్వీసులను అడ్డుకున్నారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తల దీక్షను ఉద్యోగులు అడ్డుకున్నారు. సమైక్యం కోసం చేస్తున్నారా..విభజన కోసం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఏ విషయం ప్రకటించిన తర్వాతే దీక్షలు చేయాలంటూ హెచ్చరించారు. కొండపిలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కొనసాగింది. టీడీపీ కార్యకర్తల రిలేదీక్షలు జరుగుతున్నాయి. కందుకూరులోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. పర్చూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 20వ రోజుకు చేరాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు దీక్షలు ప్రారంభమయ్యాయి. గిద్దలూరు నియోజకవర్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. వైఎస్ జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వివేకానందకాలనీ యువకులు కూర్చున్నారు. విద్యుత్ ఉద్యోగులు స్థానిక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జేఏసీ నాయకులతో కలిసి రాస్తారోకో చేశారు. టీడీపీ నాయకుల రిలేనిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. కనిగిరిలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. రాష్ట్రవిభజనకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్ఎంయూ కార్మికులు రిలే దీక్షకు కూర్చున్నారు. ముందుగా రోడ్డుపై బైఠాయించి తమలపాకులు తిని నిరసన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపై బత్తాకాయలు అమ్మి నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు వేర్పాటువాదుల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి చర్చిసెంటర్లో వాటిని దహనం చే శారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలేదీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కనిగిరి, వెలిగండ్ల, హెచ్ఎం పాడు, సీఎస్ పురం, పామూరులో టీడీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. దర్శిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. యర్రగొండపాలెంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దీక్షలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూసివేయించి నిరసన తెలిపారు.