కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు, కార్మికులు సమ్మె చేపట్టడంతో జిల్లాలో పలు చోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నెలన్నరగా విద్యుత్ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో సమైక్యాంధ్ర సెంట్రల్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 72గంటల పాటుకు సమ్మెకు దిగి విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్ గేటుకు తాళం వేశారు. అలాగే ఎస్‌ఈ కార్యాలయం తెరచుకోలేదు. ఉద్యోగులు ఈనెల 11వ తేదీనే సంస్థ ఇచ్చిన సెల్‌ఫోన్ సిమ్ కార్డులు ఎస్‌ఈ బసయ్యకు అందజేశారు. గురువారం పలు కారణాలతో జిల్లాలో రెండు ఫీడర్లలో బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. సమ్మె కారణంగా అధికారులు, సిబ్బంది మరమ్మతులకు దూరంగా ఉన్నారు. దీంతో 18 గ్రామాల్లో చీకట్లు ఏర్పడినట్లు ఎస్‌ఈ బసయ్య పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్, చైతన్యపురి కాలనీల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫూజ్ ఆఫ్ కాల్ సమస్య తలెత్తిందని, దీంతో ఆ ప్రాంతాల్లో కూడా అంధకారం ఏర్పడిందన్నారు.
కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫీడర్‌లో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా పరిశ్రమలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. నంద్యాల నుంచి బండిఆత్మకూరుకు వెళ్లే ఫీడర్‌లో బ్రేక్ డౌన్ సమస్య తలెత్తడంతో ఆ ఫీడర్ కింద ఉన్న 12 గ్రామాలకు, మంత్రాలయం సబ్ డివిజన్ పరిధిలోని తుంగభద్ర కాశాపురం ఫీడర్‌లో కూడా బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తి ఆరు గ్రామాలకు సరఫరా నిలిచిపోయిందన్నారరు. అయితే విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రాత్రి 8 గంటలకు పునరుద్ధరించామని ఎస్‌ఈ వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరైంది కాదని వినియోగదారుల నుంచి తనకు అనేక ఫోన్లు వస్తున్నాయన్నారు. అయితే అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్ల మూగబోవడంతో పరిష్కరించడం సమస్యగా మారిందన్నారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.
: సమైక్యాంధ్ర ఉద్యమం
Published Fri, Sep 13 2013 3:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement