ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్‌శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో కరెంటు కష్టాలు నెలకొన్నాయి. మూడోరోజైన మంగళవారం కూడా ఉద్యోగులు సమ్మె కొనసాగించడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా పలురకాల పరిశ్రమల నిర్వాహకులతో పాటు చిరువ్యాపారులు సైతం నష్టపోయారు. అన్నిరంగాల ప్రజలూ కష్టాలకు గురయ్యారు. సమ్మె విరమించాలంటూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులతో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కేంద్రం దిగివచ్చి సమైక్య రాష్ట్ర ప్రకటన చేసేంత వరకూ సమ్మె చేస్తామని ఉద్యోగులు తేల్చిచెప్పారు. దీంతో విద్యుత్ సమస్య తీవ్రతరం కానుంది. అయితే, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉద్యోగులు అంగీకరించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఆ సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తి కరెంటుపోతే తాము విధులకు హాజరై మరమ్మతులు చేసేదిలేదని ఉద్యోగులు స్పష్టం చేయడంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
పగలంతా కరెంటు లేనట్టే...
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు-ఆ శాఖ ఉన్నతాధికారులకు కుదిరిన ఒప్పందం ప్రకారం సమ్మె విరమించేంత వరకూ పగలంతా కరెంటు సరఫరా నిలిచిపోనుంది. ఇప్పటికే మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు కరెంటు సరఫరా చేశారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల వల్ల చిమ్మచీకట్లు అలముకున్నాయి. మరమ్మతులు చేసేందుకు సైతం విధులకు హాజరయ్యేది లేదని ఉద్యోగులు చెప్పడంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం తప్పేట్టులేదు. పగలంతా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల దానిపై ఆధారపడి పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అత్యవసర సేవలు సైతం నిలిచిపోవడంతో రోగులు నరకం చవిచూస్తున్నారు. తాగునీటి సరఫరాపై కూడా విద్యుత్ ప్రభావం కనిపిస్తోంది. నీటి సరఫరా సమయంలో మోటార్లు పనిచేయకపోతుండటంతో బోరింగులు బిగించుకునేపనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. మూడు రోజులుగా కరెంటు సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది.
చిరువ్యాపారులకు తీరని నష్టం...
విద్యుత్ ఉద్యోగుల సమ్మె చిరువ్యాపారుల జీవితాలపై పెనుప్రభావం చూపుతోంది. వారితో పాటు రోజువారీ కూలికి వెళ్లే కూలీలను సైతం పస్తులుంచుతోంది. ఒంగోలు నగరంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించే వారు వేలమంది ఉన్నారు. జ్యూష్, కూల్‌డ్రింక్ షాపులు, టిఫిన్ సెంటర్లు, బడ్డీకొట్లు, జెరాక్స్, డీటీపీ, నెట్‌పాయింట్లు, పిండిమరలు, వెల్డింగ్ వర్కర్లు, ఇతర వృత్తుల వారు క రెంటుపైనే ఆధారపడి పనిచేసుకుంటుంటారు. కరెంటు కోతల వల్ల వారంతా ఉపాధి కోల్పోతూ తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా వ్యాపారం చేసుకుంటే 500 నుంచి 700 రూపాయల వరకూ మిగులుతుంది. వాటిలో మళ్లీ అద్దెలు చెల్లించాలి. పగలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల మూడు రోజులుగా వ్యాపారం సాగక వారంతా ఇబ్బందిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అద్దెలు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని విద్యుత్ ఉద్యోగులను తప్పుపట్టడం లేదని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహిస్తున్నారు.
విద్యుత్ శాఖకు రోజుకి రూ.3 కోట్ల నష్టం...
విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలతో పాటు ఆ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల విద్యుత్ శాఖ రోజుకు 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోతోంది. జిల్లాలో అధికంగా పరిశ్రమలున్నాయి. పగలంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యుత్ శాఖ కోల్పోవాల్సి వస్తోంది. అంతేగాకుండా మూడు రోజులుగా ఉద్యోగుల సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే సాధారణంగా రోజుకు 15 ట్రాన్స్‌ఫార్మర్ల వరకూ జిల్లాలో కాలిపోతుంటాయి. ప్రస్తుతం ఉద్యోగుల పర్యవేక్షణ లేకపోవడంతో వాటి సంఖ్య రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. దీనివల్ల కూడా విద్యుత్‌శాఖకు మరికొంత నష్టం కలిగే అవకాశం ఉంది.
మూడో రోజూ కొనసాగిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె
Published Wed, Oct 9 2013 6:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement