ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పావుగంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం తారస్థాయికి చేరుకున్నప్పటికీ సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని విమర్శించారు. తాము రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెబుతున్నారని, ప్రభుత్వం పడిపోతేనే విభజన వెనక్కు వెళుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పైగా తాము రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ అందుబాటులో లేరంటూ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. 75 రోజుల నుంచి సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ ఇక్కడి మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి జీఓ అమలుకు ప్రభుత్వం కమిటీని వేసి మోసగించిందన్నారు. సీమాంధ్రలో తాము ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా చాలా శాంతియుతంగా ఉద్య మం నిర్వహిస్తున్నామని, పరిపాలన పూర్తిగా స్తంభించిందన్నారు. ప్రజల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు తమ ఉద్యమానికి అండగా ఉన్నారని, కేంద్రం దిగివచ్చి రాష్ట్ర విభజనపై వెనక్కు తగ్గే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
లేకుంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ భరతం పడతామని బషీర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తున్నారని, వారి ఉద్యమంలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు మమేకం కాకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. కోస్తా జిల్లాల్లో తుఫాన్ హెచ్చరికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందని తెలిపారు. తుఫాన్ ముప్పు తప్పడంతో రెవెన్యూ యంత్రాంగమంతా యథావిధిగా సమ్మెలో పాల్గొంటున్నట్లు కేఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకు లు కే శరత్‌బాబు,పీ రాజ్యలక్ష్మి, నాసర్ మస్తాన్‌వలి, రోజ్‌కుమార్, ఏడుకొండలు,శివకుమా ర్, కోయ కోటేశ్వరరావు, ఊతకోలు శ్రీనివాసరావు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీలు, కేంద్ర మంత్రులవి నాటకాలు
Published Wed, Oct 16 2013 7:23 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement