జిల్లాలో 50వ రోజుకు చేరిన సమైక్యాంధ్ర ఉద్యమం | Prakasam Samaikyandhra protests @ 50 days | Sakshi
Sakshi News home page

జిల్లాలో 50వ రోజుకు చేరిన సమైక్యాంధ్ర ఉద్యమం

Published Thu, Sep 19 2013 4:21 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Prakasam Samaikyandhra protests @ 50 days

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనతో రగిలిన సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరినీ ఉద్యమబాట పట్టిస్తోంది. మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు, న్యాయవాదులు, వివిధ వృత్తుల వారు ఇలా..అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర సమైక్యతను కాపాడేందుకు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారు. జీతాలు రావని తెలిసినా...ఉద్యమ పథంలో ఉద్యోగులు దూసుకుపోతున్నారు. ఉద్యమ సెగ ఢిల్లీ పీఠాన్ని తాకేలా రోజుకోరీతిగా నిరసనలు తెలుపుతున్నారు. రాష్ర్ట విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన రాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా సమైక్యవాదులు ఆందోళనలకు దిగారు. బుధవారంతో ఉద్యమం ప్రారంభమై 50 రోజులు గడిచినా..సమైక్యవాదులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. రెట్టించిన ఉత్సాహంతో నిరసనలు హోరెత్తిస్తున్నారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీఓలు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మె 35వ రోజుకు చేరింది.  
 
 స్వచ్ఛందంగా బంద్‌లు: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లాలో అనేకమార్లు బంద్ జరిగింది. వివిధ జేఏసీల నాయకులు బంద్‌కు పిలుపునిచ్చిన ప్రతిసారీ వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. తెలుగు జాతిని ముక్కలు కాకుండా చూసేందుకు ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధమని సమ్మెకు దిగిన ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో జిల్లావ్యాప్తంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 50వ రోజు ఉద్యమంలో భాగంగా ఒంగోలు నగరంలో ఉద్యోగులు ఆందోళనలు కొనసాగించారు. నగరపాలక సిబ్బంది, ఉద్యోగులు రోడ్లపై కూరగాయలు అమ్మి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. 
 
 నియోజకవర్గ కేంద్రాల్లో జోరుగా ఆందోళనలు 
 సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. అద్దంకి  బంగ్లా రోడ్‌లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అద్దంకిలో గ్రామ పంచాయతీల వారీగా సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రక్రియను చేపట్టారు. మొదటగా మండలంలోని నాగులపాడు, వెంకటాపురం గ్రామాల్లో ప్రారంభించారు. ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పంగులూరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. 
 
 చీరాలలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. వెల్డింగ్ షాపుల యజమానులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ చేపట్టిన వేటపాలెం మండల బంద్ విజయవంతమైంది. కారంచేడు కాల్వ సెంటర్‌లో ఉద్యోగులు  రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక మార్టూరు మండలం కోలలపూడిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు.   చినగంజాంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దర్శిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. కందుకూరులో  ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా- వార్పు చేసి నిరసన తెలిపారు. కనిగిరిలో  సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మహిళలు రిలేదీక్షలో కూర్చున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థల వారు రోడ్డుపై వంటా- వార్పు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 ఎమ్మెల్యే ఉగ్రకు సమైక్య సెగ:
 కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు 10వ రోజుకు చేరాయి. పీసీపల్లి మండలం పడమటిపల్లెలో సమైక్యాంధ్రకు మద్దతుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్యులు క్షీరాభిషేకం చేసి రిలే దీక్షలు చే పట్టారు. హెచ్‌ఎం పాడులో టీడీపీ రిలే దీక్షలు 9వ రోజుకు చేరాయి. సీఎస్‌పురంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. పామూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, రిలే దీక్షలు ప్రారంభించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతుంది. పట్టణంలో జర్నలిస్టుల రిలే దీక్షలు నిరంతరం కొనసాగుతున్నాయి. అలాగే మార్కాపురం, తర్లుపాడులో ఉపాధ్యాయ జేఏసీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. పొదిలిలో సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యోగులు రోడ్లు శుభ్రం చేసి నిరసన తెలిపారు. పెద్దారవీడులో అంగన్‌వాడీలు, మహిళా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు. 
 
 తెలంగాణ ప్రాంత అధ్యాపకుల రిలే దీక్షలు: యర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కళాశాలలో విద్యాబోధన చేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రజకసంఘం ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించి రోడ్డుపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే వంటా-వార్పు చేపట్టారు.   
 
 త్రిపురాంతకంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దోర్నాలలో ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు 16వ రోజుకు చేరాయి. సమైక్యవాదులు వెలిగొండ టన్నెల్ వరకు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. గిద్దలూరులో అరుణోదయ పాఠశాల విద్యార్థులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. జేఏసీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పశువైద్యులు, సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేశారు. కొమరోలులో టైలర్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్‌లతో మానవహారం, వంటా వార్పు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కంభంలో ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్‌లు, ప్రభుత్వ ఉద్యోగులు 50 మంది దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. దాదాపు 350 అడుగుల భారీ జాతీయ జెండాతో 3 వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement