ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ జోరు కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ర్యాలీ, మానవహారాలతో నిరసనకారులు ఆందోళన తెలుపుతూనే ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు ఆందోళనల బాట వీడేది లేదంటున్నారు. ఉద్యమంలో భాగంగా మంగళవారం 63వ రోజు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, విద్యార్థులు, పలు వర్గాల ప్రజల నిరసనలు కొనసాగాయి.
ఒంగోలు నగర టాటా మ్యాజిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కర్నూల్‌రోడ్డు బైపాస్ నుంచి చర్చి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం చర్చి సెంటర్‌లోనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక రామ్‌నగర్ ఒకటో లైన్‌లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. కార్పొరేషన్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ డీఈఓ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఇక మార్కెట్‌యార్డు సిబ్బంది, ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగాయి.
జిల్లాలోని పలు కేంద్రాల్లో సమైక్యాంధ్ర ఆందోళనల పర్వం కొనసాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలు వర్గాల ప్రజలు రోడ్డెక్కి సమైక్యాంధ్ర కోసం నినదిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా అద్దంకిలో సమైక్యవాదులు పట్టువీడని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. ఇప్పటికే పట్టణంలో చేపట్టిన రిలే దీక్షలు 44వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు దీక్షల్లో కూర్చున్నారు. అలాగే రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎన్‌జీఓ, ఆర్టీసీ జేఏసీల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదురుగా రాష్ట్రీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. బల్లికురవ లో సమైక్యాంధ్ర కోసం చేపట్టిన రిలే దీక్షలు 20వ రోజుకు చేరాయి. మేదరమెట్ల మండలం రావినూతలలో సమైక్యాంధ్ర కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చీరాల పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 35వ రోజుకు చేరాయి. అలాగే ఉపాధ్యాయ జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వేటపాలెంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ మత్య్సకారులు రిలే దీక్షలకు కూర్చున్నారు. ఇంకొల్లులో రేషన్‌షాపుల డీలర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. గిద్దలూరులో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగుతున్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర దీక్షా శిబిరంలో పట్టణానికి చెందిన క్రిస్టియన్ మహిళలు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు పట్టణంలో భారీ మానవహారం ఏర్పాటు చేశారు. బేస్తవారిపేటలో కందుల ఓబుల్‌రెడ్డి డీఎడ్ కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొమరోలులో సత్యసాయి సేవా సమితి సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేశారు.
శిబిరంలో భజన కార్యక్రమాలతో నిరసన తెలిపారు. కంభంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనిగిరిలో సమైక్యపోరు హోరెత్తుతోంది. రాష్ట్రవిభజనకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, డ్వామా ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. తొలుత పట్టణంలో నిరసన ర్యాలీ చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. మరోపక్క టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హనుమంతునిపాడు మండలం ఉమ్మనపల్లిలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. సీఎస్‌పురం మండలం డీజీపేటలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసన ర్యాలీ చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు.
మార్కాపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. చిడతలు వాయిస్తూ సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగించారు. పొదిలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనకారులు బస్సును లాగి ఆందోళన వ్యక్తం చేశారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో తోపుడుబండిైపై ఉచితంగా ప్రజలకు టీ అందజేసి నిరసన తెలిపారు. దోర్నాలలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 29వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కుమ్మరి, శాలివాహనుల ఆధ్వర్యంలో సింహగర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్లపైనే మట్టి కుండలు తయారు చేసి వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు పేర్కొన్నారు.
63వ రోజుకు చేరిన సమైక్యాంధ్ర ఉద్యమం
Published Wed, Oct 2 2013 4:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement