విభజనతో సమస్యలు వస్తాయి: రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం (జీఓఎం)కు విజ్ఞప్తి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన జీఓఎంతో భేటీ అయ్యారు.
అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని రెండుగా విభజించినంత మాత్రాన ఇరుప్రాంతాల్లో నెలకొన్న అసమానతలు కానీ అభివృద్ధిలో ఏర్పడిన వ్యత్యాసాలు కానీ మారవని జోఓఎంకు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని జీఓఎంకు వివరించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ నెల 3వ తేదీన జీవోఎంకు రాసిన లేఖను రాఘవులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాఘవులుతోపాటు ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ఈరోజు ఉదయం జీఓఎం ఎదుట హాజరై విభజనపై తమ వైఖరిని వివరించారు.
గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కరువు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని జీవోఎంను కోరినట్లు చెప్పారు. వివిధ జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్య సంస్థలు అన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్న సంగతిని ఈ సందర్బంగా జీవోఎంకు గుర్తు చేసినట్లు వివరించారు.
అలాంటి సంస్థలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీనివా, చిత్తూరు జిల్లాలో గాలేరు నగరి, కడపలో కల్వకుర్తి నెట్టెంపాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెలుగొండ, నల్గొండ జిల్లాకు ఉపయోగపడే ఎల్ఎల్బీసీ ప్రాజెక్ట్లు పూర్తికి సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. ముస్లీంలు అధికంగా ఉన్న పట్టణాల్లో లౌకిక విద్యను అందించేందుకు సత్వరమే కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరారు.