-
తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో భేటీలు
-
టీ బిల్లు ముసాయిదాలో మార్పుచేర్పులపైనే జీవోఎం దృష్టి
-
హైదరాబాద్, భద్రాచలం అంశాలపైనే ప్రధాన చర్చలు
-
హెచ్‌ఎండీఏ పరిధిని యూటీ చేస్తే, భద్రాచలం ఇచ్చేస్తే విభజనకు ఒప్పుకునే దిశలో సీమాంధ్ర కేంద్రమంత్రులు
-
వంద రోజులకు పైగా సాగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోని నేతలు.. తాయిలాలిస్తే విభజనకు తలూపేందుకు సిద్ధం
-
భద్రాచలాన్ని వదులుకోక తప్పదని సందేహిస్తున్న తెలంగాణ
-
కేంద్రమంత్రులు.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్
-
రెవెన్యూ జిల్లాకే పరిమితమయ్యేలా పట్టుపట్టాలని ఆలోచన
-
రాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలకు అనుగుణంగా
-
తెలంగాణ బిల్లు ముసాయిదాలో మార్పులు జరిగేనా?
-
21న కేంద్ర మంత్రిమండలి భేటీకి ముందే
-
ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం
రాష్ట్ర విభజనపై ఢిల్లీ కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే సిద్ధం చేసిన తెలంగాణ ముసాయిదా బిల్లులో స్వల్ప మార్పుచేర్పులపైనే ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) దృష్టి సారించింది. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్, ఉమ్మడి రాజధాని పరిధి, అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ, భద్రాచలం డివిజన్‌ను ఎటువైపు ఉంచటం.. ఈ కీలకాంశాలు పీటముడిగా మారటంతో వీటిని పరిష్కరించేందుకు తుది కసరత్తుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జీవోఎం సోమవారం వేర్వేరుగా భేటీ కానుంది. మొన్నటివరకూ సమైక్యగళం వినిపించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. పార్టీ అధిష్టానం ఎజెండాను అమలులోకి తెస్తూ సీమాంధ్రకు ప్యాకేజీలంటూ స్వరం మార్చిన విషయం తెలిసిందే.
వంద రోజులకు పైగా సమైక్య రాష్ట్రం కోసం కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని విస్మరించి మరీ.. ప్యాకేజీలు, తాయిలాలు ఇస్తే విభజనకు సరేనంటూ సిద్ధమవుతున్నారు. అలాగే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒకవైపు సమైక్యవాదన వినిపిస్తూ.. మరోవైపు అధికారికంగా విభజనకు తోడ్పాటునందిస్తున్న విషయం విదితమే. విభజన బిల్లులోనే హైదరాబాద్ హెచ్‌ఎండీఏ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటంతో పాటు సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కానీ.. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కేవలం హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే.. అదికూడా ఉమ్మడి రాజధానిగా మాత్రమే గుర్తించాలని పట్టుపడుతున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయటానికి కూడా తెలంగాణ నేతలు అంగీకరించటం లేదు. అలాగే.. భద్రాచలం మాదంటే మాదని ఇరువైపుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో జీవోఎం దాన్ని కూడా అత్యంత కీలకంగా భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తే భద్రాచలం విషయంలో పట్టువిడుపులు తప్పవన్న భావన కొందరు టీ-కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం జరిగే జీవోఎం భేటీల్లో ఈ రెండు అంశాలపై ఒక స్పష్టతకు రావటం.. తదనుగుణంగా ముసాయిదా బిల్లులో మార్పుచేర్పులు చేయటంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలోని జీవోఎం దృష్టి సారిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే.. కీలకమైన అంశాలపై ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వేర్వేరుగా వినిపించే వాదనలను జీవోఎం కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటుంది తప్ప వారు చెప్పే విభజన అనుకూల, వ్యతిరేక వాదనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది. వీరిచ్చే నివేదికల ఆధారంగా.. హైదరాబాద్‌ను యూటీ చేయటం, లేదా ఢిల్లీ తరహాలో పాక్షిక కేంద్ర పాలిత ప్రాంతం, లేదంటే ఒకే గవర్నర్ కింద రెండు రాష్ట్రాల రాజధానులను నడిపించటానికి ఉన్న అవకాశాలు, కేంద్రం పరిధిలోకి తీసుకోవటం వంటి ప్రతిపాదనలపై జీవోఎం కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి రాజధాని పరిధిపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రత, హక్కులు వంటి అంశాలను బిల్లులో చేరుస్తారని సమాచారం. మరోవైపు.. వనరుల పంపిణీ, నీటిపారుదల, ఉద్యోగులు, విద్య తదితర అంశాలకు సంబంధించి విభజన బిల్లులో పూర్తి సమాచారంతో సమగ్రంగా చేర్చకుండా.. దేనికదే ప్రత్యేక బోర్డులు, కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీలు పరిష్కారం చూపుతాయని మాత్రమే బిల్లులో చెప్తారని తెలుస్తోంది. ఇక ఆర్టికల్ 371 (డి) విషయంలో జీవోఎం ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చలు జరపగా.. చిన్న సవరణతో ఇరు ప్రాంతాల్లో దాన్ని కొనసాగించడానికే ఎక్కువ అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఈ నెల 21న కేంద్ర మంత్రిమండలి ముందు తెలంగాణ ముసాయిదా బిల్లు పెట్టే అవకాశాలున్నందున.. సోమవారం నాటి సమావేశాల అనంతరం ముసాయిదా మార్పుచేర్పుల పనుల్లో జీవోఎం తుది కసరత్తు పూర్తి చేస్తుందని సమాచారం.
జీవోఎంతో చర్చలపై విడివిడిగా కసరత్తులు...
విభజన కసరత్తు క్లైమాక్స్‌కు చేరిన దశలో జరుగుతున్న కీలక భేటీలు కావటంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, నేతలు జీవోఎంకు తమ వాదన వినిపించడానికి నివేదికల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు జీవోఎం ముందు హాజరుకానున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉదయం 11.30 గంటలకు జీవోఎం ఎదుట హాజరవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణల నివాసాల్లో ఆ ప్రాంత మంత్రులు, పలువురు రాష్ట్ర నేతలు సమావేశమై.. జీవోఎంకు నివేదించాల్సిన అంశాలపై చర్చించి నివేదికను రూపొందించారు. జీవోఎం కీలకంగా భావిస్తున్న అంశాల్లో ఒకటైన భద్రాచలం విషయంలో వీరు వెసులుబాటు కల్పించే రీతిలో ఈ నివేదికలో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు సమక్షంలో సీమాంధ్ర నేతలు సమావేశమై జీవోఎం వద్ద సీమాంధ్రకు కోరాల్సిన ప్యాకేజీలపై ప్రధానంగా చర్చించి ఆ మేరకు నివేదిక రూపొందించారు.
అధికారులతో నివేదిక సిద్ధం చేయించిన సీఎం
జీవోఎం ముందు హాజరుకావటానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జీవోఎం ముందు హాజరై నివేదిక సమర్పిస్తారు. నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్, ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తయారు చేయించిన నివేదికను ఆయన జీవోఎంకు సమర్పించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గత అసెంబ్లీ సమావేశాల్లో, శాసనమండలిలో స్పష్టంగా చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత పార్టీ కోర్ కమిటీ ముందు కూడా అదే వైఖరి ఉద్ఘాటించారు. ఆనంతర పరిణామాల్లో సీఎం సీమాంధ్ర సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పెద్దలు వాటికి పరిష్కారం చూపిస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చే నివేదికలో.. ప్రధానంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను యూటీ చేయడమా, చేయకపోవడమా, ఒకవేళ చేసినా దాని పరిధి.. ఇలాంటి అంశాలపై సూచనలను కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఆర్టికల్ 371 (డి) విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నందున దానితో పాటు మిగిలిన అంశాలన్నింటిపైనా జీవోఎం ఇప్పటికే స్పష్టతకు వచ్చిందని, పైగా విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలను క్రోడీకరించే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నివేదికను ఉపయోగిస్తారని తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే జీవోఎం ముందు ఒక నివేదిక సమర్పించిన విషయం పత్రికల్లో వచ్చిందే.
ఎవరి వాదన వారిదే...
తెలంగాణ ముసాయిదా బిల్లును ఇప్పటికే సిద్ధం చేసిన జీవోఎం దానికి తుదిరూపమిచ్చే పనిలో నిమగ్నం కాగా.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికీ విభజన అంశంపై ఎవరి అభిప్రాయాలు వారివన్నట్లుగానే మాట్లాడుతున్నారు. విభజన అంశాన్ని సీమాంధ్ర ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా వంద రోజులకు పైగా ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విభజనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు కావాలని కోరుతున్నప్పటికీ.. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంత నేతలు విభజనపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటు తెలంగాణ నేతలదీ అదే పరిస్థితి. మరోవైపు విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను హైకమాండ్ ఆదేశాల మేరకు నెత్తికెత్తుకున్న సీఎం కిరణ్ సైతం తప్పనిసరి పరిస్థితుల్లో సీమాంధ్ర సమస్యలు లేవనెత్తాల్సి వస్తోందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో జీవోఎం ముందు ఏం చెప్పినా విభజన విషయంలో బయట ఎవరివాదన వారు వినిపించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
నేటి జీవోఎం భేటీలు ఇలా...
ఉదయం 10:30కు: తెలంగాణ కేంద్రమంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్‌లతో భేటీ
ఉదయం 11:30కు: సీమాంధ్ర కేంద్రమంత్రులు వి.కిశోర్‌చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, జె.డి.శీలం, కిల్లి కృపారాణిలతో భేటీ
మధ్యాహ్నం 12:30కు: సీఎం కిరణ్‌తో సమావేశం