తెలంగాణపై మంత్రుల కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. సమావేశానికి జైరాం రమేష్, నారాయణ స్వామి, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ హాజరు అయ్యారు. అయితే షిండే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి అనారోగ్య కారణాలతో ఆంటోనీ, విదేశీ పర్యటనలో ఉన్న చిదంబరం అందుబాటులో లేరు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .... ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై చర్చించనుంది.
కాగా విభజన ప్రకటన, భగ్గుమన్న సీమాంధ్ర, రెండు నెలలకు పైగా తీవ్ర ఉద్యమం, ఊరూ వాడా ఏకమైనా కేంద్రం నుంచి కనీస స్పందన కరువైంది. దీనికి తోడు రాష్ట్రానికి వరుస అవమానాలు తప్పటం లేదు.. ఏకపక్షంగా విభజన నిర్ణయమన్న విమర్శలను పట్టించుకోకుండా తాను ఏం చేయదలుచుకుందో,.... అదే నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్రం మొండిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
సీడబ్ల్యూసీ నిర్ణయం, క్యాబినెట్ ముందుకు టీ నోట్, విభజనకు మంత్రుల కమిటీ, విధివిధానాలు ఇలా ఏ దశలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల మనోగతాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తాజాగా ఏడుగురు మంత్రులతో విభజన కమిటీని ఏర్పాటు చేసినా, విధివిధానాలు ఖరారు చేసినా ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు.
దానికి సంబంధించిన నోట్ కాపీని కూడా ప్రభుత్వానికి పంపలేదు. విభజన ప్రక్రియలో ప్రతి సమాచారం రాష్ట్రం నుంచి అధికారులు అందించాల్సి ఉంటుంది. మంత్రుల కమిటీ మొదటి సమావేశం జరుగుతున్నా ఎలాంటి సమాచారం లేదు. దీంతో నోట్ కాపీ అధికారికంగా అందుతుందని భావించిన ప్రభుత్వ వర్గాలు నివ్వెరపోతున్నాయి.
మొదట్లో పదిమంది మంత్రులతో కమిటీ, రాష్ట్రానికి చెందిన వారికి కూడా చోటు ఉంటుందని చెప్పినా, అవన్నీ పక్కన పెట్టి, తాము తీసుకున్న నిర్ణయాన్ని వీలైనంత తొందరగా అమల్లో పెట్టే వారినే కమిటీలో నియమించారనే ప్రచారం జరుగుతోంది.. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం దారుణమని అధికారిక వర్గాలు అంటున్నాయి.