విభజన ప్రక్రియ ప్రారంభమైంది: జీఎంవో
న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వేసిన మంత్రుల బృందం సమావేశంపై కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రెస్నోట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఖరారు చేసింది. అన్ని సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తుందని.... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంత్రుల బృందం హామీ ఇస్తుందని పేర్కొంది.
ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, మంత్రుల బృందం అనువైన సిఫార్సులు చేస్తుందని, విధివిధానాలకు సంబంధించి నోడల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్లను ఖరారు చేసినట్లు జీఎంవోలో తెలిపింది. విభజన సమాచారాన్ని పంపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించామని.... ఈ ప్రక్రియ తక్షణమే మొదలు అవుతుందని జీఎంవో ప్రెస్నోట్లో తెలిపింది.
రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం శుక్రవారమిక్కడ ఢిల్లీలో సమావేశమైంది. హోం శాఖ కార్యాలయం ఈ జరిగిన తొలి సమావేశానికి ఐదుగురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రక్షణ మంత్రి ఆంటోని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆర్థిక మంత్రి చిదంబరం ఈ భేటీకి రాలేదు.
హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు గులాంనబీ ఆజాద్, జైరామ్ రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొత్తం 11 అంశాలను పరిశీలించాలని మంత్రుల కమిటీకి నిర్దేశించింది .రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను మంత్రులు కమిటీ పరిశీలించింది. ఈ నెల 19న మరో దఫా సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.