జీఓఎంకు తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నివేదిక
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో ఏర్పాటయిన మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదికను తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం విడుదల చేసింది. ఈ- మెయిల్ ద్వారా నివేదికను జీఓఎంకు పంపింది. ఫతేమైదాన్ క్లబ్‌లో నేడు సమావేశమయిన తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నేతలు విభజన అంశంపై సమర్పించే నివేదికను ఖరారు చేశారు.
శాంతి భద్రతలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంచడానికి అంగీకరిస్తున్నట్టు నివేదికలో తెలిపామని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు ప్రత్యక చట్టాలు అవసరం లేదన్నారు. వాటి గురించి ఆలోచించడమంటే హైదరాబాద్ వాసులను అవమాన పరచడమేనని అన్నారు. విభజనతో వచ్చే కష్టనష్టాలను భరిస్తూ తెలంగాణను పునర్‌నిర్మించుకుంటామన్నారు. విభజనపై సీమాంధ్రుల్లో నెలకొన్న భయాలను నివృత్తి చేయడం, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం వంటివి నివేదికలో పొందుపరిచామని వెల్లడించారు.