ప్రదేశ్ చిచ్చు కమిటీ
పీసీసీ అధ్యక్ష పదవులపై కాంగ్రెస్‌లో రగిలిన అసమ్మతి
పొన్నాల ఎంపికపై సీనియర్ల అసంతృప్తి..
సీమాంధ్రలోనూ అదే సీన్
నేడు దిగ్విజయ్ రాక, నేతలతో మంతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను(పీసీసీ) ఏర్పాటుచేసిన కాంగ్రెస్ అధిష్టానానికి అసమ్మతి పెల్లుబుకి ఆదిలోనే హంసపాదులా మారింది. పీసీసీ పగ్గాలను తమకు అప్పగిస్తారని ఆశతో ఎదురుచూసిన సీనియర్లు అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ పీసీసీకి జరిగిన ఎంపికలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా సీమాంధ్రలోనూ అదే పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. ఈ ఎంపికలపై సీనియర్ నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారిక ప్రకటన వెలువడే ముందువరకు కూడా జానా పేరే ఖరారవుతున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా పొన్నాల పేరును అధికారికంగా ప్రకటించడం జానారెడ్డి వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పొన్నాల పేరును ప్రకటించే ముందు దీనిపై ఏఐసీసీ పెద్దలు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలతో చర్చించారు. పొన్నాల ఎంపికే మింగుడుపడనిదిగా ఉంటే కమిటీలో తనకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవడం జానారెడ్డిని తీవ్రంగా బాధిస్తోంది. పైగా సొంత జిల్లా నల్లగొండకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించడం కూడా పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. దీనిపై ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.
డీఎస్ తీవ్ర మనస్తాపం
పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా, విధేయుడిగా మసలుకుంటూ వచ్చిన పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు కూడా తెలంగాణ పీసీసీ ఎంపిక వ్యవహారం షాక్‌కు గురిచేసింది. గతంలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్న సెంటిమెంటు ఉండడంతోపాటు తెలంగాణ అంశంపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని సమర్పిస్తూ వారి కనుసన్నల్లో మెలగుతూ వచ్చారు. సోనియాకు సన్నిహితంగా ఉన్న తనకు పీసీసీ పగ్గాలు తప్పకుండా వస్తాయని ఆయన ఎంతో ఆశతో ఎదురుచూశారు. అయితే సీనియర్ అయిన ఆయన్ను పక్కనపెట్టి జూనియర్ అయిన పొన్నాల లక్ష్మయ్యను ఎంపికచేయడం డీఎస్ వర్గీయుల్లో అసంతృప్తి నింపింది. ‘‘మొన్నటి వరకు తనకే పదవి ఖరారన్న నమ్మకంతో ఉన్నారు. కమిటీ ప్రకటన వచ్చాక డీఎస్ మనోవేదనకు గురయ్యారు.
ఎవరితోనూ మాట్లాడడం లేదు’’ అని డీఎస్‌కు అత్యంత సన్నిహిత నేత ఒకరు పేర్కొన్నారు. పైగా డీఎస్ సొంత జిల్లాకు చెందిన షబ్బీర్ అలీకి కమిటీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం కూడా ఆయన వర్గానికి ఇబ్బందికరంగా మారింది. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి రానుండడంతో ఆయన సమక్షంలోనే దీనిపై తేల్చుకొనేందుకు డీఎస్ వర్గీయులు సిద్ధపడుతున్నారు.
సీమాంధ్రలోనూ అదే పరిస్థితి
ఇక తెలంగాణ స్థాయిలో కాకున్నా సీమాంధ్రలోనూ పీసీసీ కమిటీ ఏర్పాటు పట్ల పార్టీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమైక్య పీసీసీ కాకపోయినా ఏపీ పీసీసీకి తననే కొనసాగిస్తారని బొత్స భావించారు. తనను తప్పించడం ఖాయమని తేలడంతో బొత్స చివరి నిమిషంలో సోనియాగాంధీని కలసి తనను బాధ్యతలనుంచి తప్పించి కొత్తవారిని నియమించాలని కోరారని చెబుతున్నారు. అంతకు వారం రోజుల ముందునుంచే బొత్స స్థానంలో వేరొకరి పేరుపై అధిష్టానం తీవ్ర కసరత్తు సాగిస్తూ వచ్చింది. రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా ఉన్న ఎస్సీ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు రాష్ట్రానికి చెందిన కొందరు నేతలతో బీసీ నేతలపై చర్చలు జరిపారు.
అంతిమంగా రఘువీరారెడ్డిని ఎంపికచేయడంతో బొత్స నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. అదేసమయంలో తమ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తారని ఆశించిన కేంద్రమంత్రి చిరంజీవి కూడా తాజా కమిటీలో సముచిత ప్రాధాన్యం దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారని సమాచారం. గత ఆరునెలల కాలంగా పార్టీ అధిష్టానాన్ని తరచూ కలుస్తూ తనకు అవకాశం వస్తుందని ఎదురుచూసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పెద్దదెబ్బే తగిలింది. కమిటీ నాయకత్వ పగ్గాల మాట అటుంచి కమిటీలో ఎలాంటి బాధ్యత అప్పగించకపోవడంతో ఆయన సన్నిహితులు ఆగ్రహంతో రగులుతున్నారు.
నేడు దిగ్విజయ్‌రాక.. అసమ్మతులతో చర్చలు
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం ఉదయం పదిన్నరకు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈనెల 15 వరకు ఆయన రాష్ట్రంలోనే ఉండనున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడమే ప్రధానంగా ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో రాజకీయంగా ఎక్కువ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న తరుణంలో అసమ్మతి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారుతుందని అధిష్టానం భావిస్తోంది. దీంతోపాటు తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుల వ్యవహారంపై కూడా దిగ్విజయ్ ఆ పార్టీ నేతలతో చర్చలు సాగించనున్నారు. పొత్తులపై ఒకపక్క చర్చిస్తూనే పార్టీ నేతలను ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారని, ఇందుకోసం ఇరుప్రాంత పీసీసీలతోనూ, ఇతర నేతలతోనూ దిగ్విజయ్ మాట్లాడనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. పార్టీ టికెట్ల వ్యవహారంపైనా ఆయన అభిప్రాయాలు తీసుకోవచ్చంటున్నారు. టీజేఏసీ నేతలతోనూ చర్చలు జరపనున్నారు.