K.Jana reddy
-
కోటి ఎకరాల ఆయకట్టు
ఇదే కేసీఆర్ లక్ష్యం: హరీశ్‌రావు ► అందుకోసం ఇంజనీర్లా కృషి చేస్తున్నారు ► ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ ప్రజలకు అంకితం ► సభా వేదికపై జగదీశ్-జానా సంవాదం ► టీఆర్ఎస్ ప్రభుత్వంతో జానా కూడా లబ్ధి పొందారంటూ జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు ► తానేమీ పొందలేదన్న విపక్ష నేత ► మీరెందుకు గెలవలేదన్న సభికులను నవ్వుల్లో ► ముంచెత్తిన జానా వ్యాఖ్యలు సాక్షి, నల్లగొండ: ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లో అంతర్భాగమైన లో లెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)ను నల్లగొండ జిల్లా పెదవూర మండలం పుల్యా తండా వద్ద బుధవారం ఆయన ప్రజలకు అంకితం చేశారు. అనంతరం సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే కె.జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తు చేశారు. అందులో రైతన్నకు గుండెకాయలాంటి సాగునీటిని సాకారం చేసేందుకు కేసీఆర్ ఓ ఇంజనీర్లా పనిచేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తామంతా సమష్టిగా పని చేసి పూర్తి చేస్తున్నామన్నారు. లో లెవల్ కెనాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల శంకుస్థాపనలే మిగిలాయన్నారు. లో లెవల్ కెనాల్‌కు సంబంధించిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది కల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ రెండో దశ పనులను కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు కూడా నీళ్లిస్తామని వివరించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగికి కూడా నీరిస్తామని, అయితే, రైతులు వరి పంట కన్నా ఆరుతడి పంటలు వేసుకోవడమే మేలని సూచించారు. ఏ పంట వేసినా మార్చి 31 కల్లా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు. జానా-జగదీశ్‌రెడ్డి సంవాదం ప్రసంగాల సందర్భంగా జానారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి నడుమ సంవాదం చోటుచేసుకుంది. జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి లో లెవల్ కెనాల్‌ను పూర్తి చేయడమే సమాధానమన్నారు. ‘‘తెలంగాణ వచ్చింది గనకే రెండున్నరేళ్లలో పనులు పూర్తయ్యాయి. లేదంటే మరో 20, 30 ఏండ్లు పట్టేవి. లో లెవల్ కెనాల్ పనులు ప్రారంభమై 19 ఏళ్లు కావ స్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలూ దీన్ని నిర్లక్ష్యం చేశాయి’’ అన్నారు. జానా స్పందిస్తూ, కెనాల్‌కు పంప్‌హౌస్ పనులు ప్రారంభమై ఏడేండ్లే అరుయిందన్నారు. ఏడేండ్లయినా సరే వాటిని తామే పూర్తి చేశామని జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందని మనిషి లేడన్నారు. జానారెడ్డి కూడా లబ్ధి పొందారని చమత్కరించారు. దీనికి స్పందించిన జానా, తానేమీ లబ్ధి పొందలేదని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎండాకాలంలో కరెంటు లేక జానారెడ్డి ఇంట్లో జనరేటర్లు నడిచేవి. ఆ లెక్కన ఆయనకిప్పుడు కనీసం 100-200 లీటర్ల డీజిల్ అయినా మిగిలే ఉంటుంది. దీన్ని ప్రతిపక్ష నాయకులతో సహా అందరూ అంగీకరించాల్సిందే’’ అని అన్నారు. పరస్పరం గౌరవించుకుంటే మంచిది: జానా అనంతరం ప్రసంగించిన జానా తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ‘‘గత ప్రభుత్వాలు చేసిన పనులనే టీఆర్ఎస్ కొనసాగించి పూర్తి చేసింది. అందుకు వారు అభినందనీయులు’’ అని అన్నారు. ‘‘ఎల్ఎల్సీ నిర్మాణానికి రూ.220 కోట్లు ఖర్చయితే అందులో కేవలం రూ.32 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ ఇచ్చింది. అందులో నూ రూ.10 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే నికరంగా టీఆర్ఎస్ ఇచ్చింది రూ.22 కోట్లే. మిగతా మొత్తాన్ని గత ప్రభుత్వాలే ఖర్చు చేశాయి’’ అని వ్యాఖ్యానించారు. ఎవరు చేసినా అందరూ పరస్పరం గౌరవించుకుని, సమన్వయం తో ముందుకెళ్లాలే తప్ప తామే అంతా చేశామని చెప్పడం కూడా సరైంది కాద న్నారు. ‘‘టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తామే పూర్తి చేశామంటున్నారు. అసలు మేం మొదలుపెట్టకపోతే వీళ్లు పూర్తి చేసేవా రా?’’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల్లో ఒకరు జానానుద్దేశించి ‘అయితే ఎన్నికల్లో మీరెదుకు గెలవలేదు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుందని జానా అన్నారు. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంద రూ హిల్లరీ గెలుస్తారని చెప్పారు. కానీ ట్రంప్ గెలిచాడు’’ అని చమత్కరించ డంతో సభా ప్రాంగణం నవ్వులతో నిండి పోయిది. కార్యక్రమంలో నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, అటవీ అభివృద్ధి కార్పొరే షన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభా కర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలి'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురువారం హైదరాబాద్‌లో పిలుపునిచ్చారు. ఓ పార్టీలో గెలిచి... మరోపార్టీలోకి వెళ్లడం అప్రజాస్వామికమని ఆయన అరోపించారు. గతంలో నేను రాజీనామా చేశాకే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించదని చెప్పారు. పార్టీ మారేవారిని అనర్హులుగా ప్రకటించేలా చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి జానారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మెదక్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జానారెడ్డి పైవిధంగా స్పందించారు. -
’సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలి?’
-
'ఆ పదాన్ని' వాడటం సరికాదు
హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ వారంతా హుందాగా వ్యవహారించాలని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు. సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వాలి ఈ సందర్భంగా కేంద్రం, గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరికి వారు అభిప్రాయాలు చెబుతూ గందరగోళ పరచడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నత్తనడకన సాగుతుందో లేదో ప్రభుత్వమే పరిశీలించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్, కేసులు నడుస్తున్నాయి... ఆ ఆంశంపై పదేపదే మాట్లాడలేనని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా జానారెడ్డి....శుక్రవారం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. -
'జానారెడ్డి అవినీతిని త్వరలో బయట పెడతాం'
హైదరాబాద్: ప్రతిపక్ష నేత జానారెడ్డి చేసిన అవినీతిని త్వరలోనే బయట పెడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంగళవారం వారు అసెంబ్లీలో మాట్లాడుతూ...జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని, త్వరలో ఆయన అవినీతిని బయటపెడతామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా జానారెడ్డికి జైలుకు పోతానన్న భయం పట్టుకుందన్నారు. ఆయన అక్రమాస్తులపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు. అంతేకాకుండా జానారెడ్డిని సొంతపార్టీ ఎమ్మెల్యేలే గుర్తించడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేరును నల్గొండ పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. -
సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలి: జానారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర పార్టీ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కె.జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని... ఆ దిశగా అడుగులు వేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
కాంగ్రెస్ ‘రైతు భరోసా’ యాత్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గురువారం జిల్లాలో పర్యటించనుంది. జి ల్లాలో కరువు పరిస్థితులు, కరెంట్ కోత లు, రైతుల ఆత్మహత్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు కా ర్యాచరణ సిద్ధం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో టీపీపీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం జిల్లా లో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలి సింది. పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత డి.శ్రీనివాస్, మా జీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ప ర్యటనలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర నియోజకవర్గాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా మూడు నెలల వ్యవధిలో 12 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, దోమకొండ, మాచారెడ్డి, లింగంపేట తదితర మండలాలలో పంటచేలకు రైతులు నిప్పంటించడం.. వరి చేలలో పశువులను వదిలిన సంఘటనలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కూడ పరామర్శిస్తారని తెలిసింది. ‘రైతు భరోసా’ యాత్రలో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పార్టీ సీనియర్లు కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస్, మహ్మద్ అలీ షబ్బీర్‌తో పాటు పలువురు పాల్గొననున్నారు. -
పొన్నాల వల్లే అపోహలు
ఆయన వ్యవహారశైలే ఊహాగానాలకు కారణం: జానా ఏదైనా మీడియాకు సూటిగా చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్య న్యూఢిల్లీ: పార్టీలో సమన్వయలోపం వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్య వహారశైలే అపోహలకు, ఊహాగానాలకు కారణమైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానిం చారు. సమన్వయలోపంపై విలేకరులు ప్రశ్నిం చినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పి ఉంటే పత్రికల్లో అలాంటి కథనాలకు ఆస్కారం ఉండేది కాదని పేర్కొన్నారు. జయశంకర్ జ యంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని తె లంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జయశంకర్ చిరస్మరణీయుడు. క్రమశిక్ష ణ, నిబద్ధతతో కూడిన వ్యక్తిత్వం గల ఆయన త న వృత్తికి న్యాయం చేయడమే కాకుండా సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. సమగ్ర, సామాజిక అభివృద్ధితో కూడిన తెలంగాణ కావాలన్న ఆయన ఆకాంక్షను నెరవేర్చడమే మనం సమర్పించే నిజమైన నివాళి..’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ పర్యటనపై చాలా ఊహాగానాలు ఉన్నాయని, పీసీసీ చీఫ్ పదవికి పోటీపడుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘పత్రికలు ఏవో కథనా లు రాస్తే వాటికి ఏం సమాధానం చెప్పగలను.’ అన్నారు. డీఎస్, పొన్నాల మీపై అసహనంతో ఉన్నారన్న విష యాన్ని ప్రస్తావించగా... ‘నేను చేసే పనిని హ ర్షించేవారిలో డీఎస్ ఒకరు... ఇక పొన్నాల లక్ష్మయ్యతో అంతకంటే బాగుంది.’ అన్నారు. ‘మా వద్ద సమన్వయ లోపం ఉందని ఆయన అంటే.. నా సమక్షంలో చెప్పాలని, నీకు జరిగిన ఇబ్బంది ఏంటి? అని అడుగుతా.. పార్టీకి నష్టం జరగకుం డా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరో వచ్చి మీ వద్ద సమన్వయం లేనట్టుందని ప్రశ్నించినప్పుడు.. గట్టిగా అలాంటిదేమీ లేదని, పార్టీ బలోపేతానికి అందరం కృషిచేస్తున్నామని పొన్నాల సూటిగా చెప్పి ఉండాల్సింది.’ అన్నారు. -
సీఎల్పీ ఉపనేతగా జీవన్‌రెడ్డి
జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) ఉపనేత పదవి దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి జీవన్‌రెడ్డి పేరును ప్ర కటించారు. జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన టి.జీవన్‌రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుందని ముం దుగా ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ ఆ పదవి జానారెడ్డికి దక్కింది. దీంతో టీపీసీసీ అధ్యక్ష పీఠం అందివచ్చే అవకాశం ఉందనుకున్నారు. కాంగ్రెస్ జాబితాలో జీవన్‌రెడ్డి పేరు లేకపోవడం, సీఎ ల్పీ ఉపనేత పదవి రావడంతో టీపీసీసీ పదవి లేనట్టేనని తేలిపోయింది. జీవన్‌రెడ్డి 1983లో రాజ కీయ ఆరంగేట్రం చేసి టీడీపీ నుం చి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచా రు. కాంగ్రెస్‌లో చేరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఈయనకు ఉప ప్రతిపక్ష నాయకుడి హోదా రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
అధికారమే లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిది?: జానా
హైదరాబాద్: వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులతో ఏర్పాటు చేయనున్న సమావేశం ఆధిపత్య ప్రదర్శన కోసం కాదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఆధిపత్య పోరెక్కడిదని ప్రశ్నించారు. తాను సీఎల్పీ నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో విభేదాలున్నాయన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. పొన్నాల ప్రమేయం లేకుండా ఈ సమావేశం జరుగనుందని పత్రికల్లో వచ్చిన కథనాలపై బుధవారం జానారెడ్డి స్పందించారు. మాజీ మంత్రులు డీకే అరుణ, టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. సమావేశానికి పొన్నాలే ముఖ్యఅతిథి అని తెలిపారు. -
చివరకు మిగిలిందేమిటి?
తెలంగాణ కోసం అష్టకష్టాలు పడ్డాం పార్టీ ఫణంగా పెట్టినా ఆదరించలేదు జేఏసీ నేతల ఎదుట జానారెడ్డి నిర్వేదం హైదరాబాద్: ‘తెలంగాణ కోసం అష్టకష్టాలు పడ్డాం. ఎన్నో త్యాగాలు చేశాం. సొంత పార్టీనే ఎదిరించాం. పదవులనూ త్యజించాం. చివరకు సీమాంధ్రలో పార్టీనే ఫణంగా పెట్టాం. ఇంత చేసినా మాకు ఒరిగిందేమిటి? ప్రజలు మమ్ముల్ని ఆదరించలేదు. ఇంతకంటే ఇక మేం చేయగలిగిందేముంది?’ తెలంగాణ ఉద్యోగసంఘాల నేతల ఎదుట కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి నిర్వేదంగా చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం సాయంత్రం జేఏసీ నేతలు సి.విఠల్, మణిపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సతీశ్ తదితరులు జానారెడ్డి ఇంటికి వెళ్లి రాజ్యసభలో పోలవరం బిల్లును అడ్డుకునేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నందున పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే వీగిపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా జానారెడ్డి పైవిధంగా స్పందించారు. జేఏసీ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణ కోసం పార్టీలో, బయటా ఎంతో శ్రమించినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని జానారెడ్డి వాపోయారు. ఇదిలా ఉండగా, ముంపు గ్రామాల విలీనం పై కాంగ్రెస్ అధినేత్రితో సోనియాతో చర్చిస్తానని జానారెడ్డి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు -
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి
9 నుంచి నాలుగు రోజులపాటు శాసనసభ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత కె. జానారెడ్డి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. శాసనసభా సాంప్రదాయం ప్రకారం సీనియర్ సభ్యునికే ఈ గౌరవం దక్కుతుంది. జానారెడ్డి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అసెంబ్లీకి పోటీ చేయగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుత శాసనసభ్యుల్లో అందరికంటే ఆయనే సీనియర్. మరోవైపు అసెంబ్లీ తొలి సమావేశాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. ఈ నెల 9న ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే శాసనసభ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 10న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 11న గవర్నర్ ప్రసంగం, 12న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలతో సమావేశాలు ముగుస్తాయని ఆయన వివరించారు. స్పీకర్‌పై ఉత్కంఠ స్పీకర్‌గా ఎవరికి అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ ఇంకా ఎవరి పేరూ ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ సీనియర్ నేతలు కొప్పుల ఈశ్వర్, ఆజ్మీరా చందూలాల్, ఎస్.మధుసూదనాచారి పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. వీరిలో కొప్పుల ఈశ్వర్, చందూలాల్ ఇప్పటికే స్పీకర్ పదవిపై అయిష్టం వ్యక్తం చేశారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరిని స్పీకర్ పదవికి ఒప్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
డీఎస్, జానా ఎంపికపై డీకే అరుణ వర్గం అసహనం
ప్రతిపక్ష నేతలుగా ఎన్నుకున్న సీఎల్పీ వయలార్ రవి, దిగ్విజయ్ ప్రకటన సీఎల్పీ భేటీలో నేతల నుంచి అభిప్రాయ సేకరణ తొలుత ఓటింగ్ నిర్వహిస్తామన్న పెద్దలు అవసరం లేదన్న సీనియర్లు.. డీఎస్ ఎంపికపై డీకే అరుణ వర్గం అసహనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ తొలి ప్రతిపక్ష నేతగా కుందూరు జానారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నేతగా ధర్మపురి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వీరిరువురు ఎన్నికైనట్లు ప్రకటించారు. అంతకుముందు ఈ ఇద్దరి నేతల ఎన్నిక అనేక మలుపులు తిరిగింది. పలువురు నేతలు ఈ పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. సీఎల్పీ సమావేశంలోనూ అభిప్రాయ సేకరణ ఆసక్తికరంగా సాగింది. కొందరు నేతలు జానా, డీఎస్ పేర్లను వ్యతిరేకించినా.. అధిష్టానం పెద్దలు మాత్రం వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఓటింగ్ వద్దన్న సీనియర్లు సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ దూతలుగా వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్ హాజరవగా, వీరికి సహాయకులుగా రామచంద్ర కుంతియా, తిరునావక్కరసార్లు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకుగాను 20 మంది హాజరయ్యారు. సమావేశంలో తొలుత దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. వెంటనే సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి లేచి ‘‘ఓటింగ్ నిర్వహిస్తే బయటకు వేరే సంకేతాలు వెళ్తాయి. పార్టీ ఇప్పటికే కష్టకాలంలో ఉంది. గెలిచింది 21 మంది ఎమ్మెల్యేలే. కలిసికట్టుగా నడవాల్సిన ఈ సమయంలో ఓటింగ్ నిర్వహిస్తే ఎమ్మెల్యేలో చీలిక వస్తుంది’’ అని సూచించారు. ఈ వాదనను పార్టీ నేత జీవన్‌రెడ్డి బలపరిచారు. డీకే అరుణ ఆ సమయానికి సమావేశానికి రాలేదు. సమావేశంలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కాకపోవడంతో అధిష్టానం పెద్దలు అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే వచ్చి అభిప్రాయాన్ని చెప్పాలంటూ వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు. ఈలోపు అక్కడికి చేరిన అరుణ.. ‘‘మరికొంత సమయం కోరదాం’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో అన్నారు. కానీ ఉత్తమ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో డీకే అరుణ తెలంగాణలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్న జిల్లా తమదేనని, ఈసారి సీఎల్పీ నేతగా తనకు అవకాశమివ్వాలని దిగ్విజయ్‌ను కోరారు. కానీ అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత మెజారిటీ సభ్యులు జానారెడ్డికి మద్దతు ఇచ్చారని దిగ్విజయ్ తెలిపారు. అక్కడి నుంచే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. దీంతో జానారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాలని సోనియా ఆదేశించారు. ‘‘ఓటమి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయండి’’ అని జానారెడ్డికి సోనియా సూచించారు. అనంత రం హైకమాండ్ పెద్దలు జానారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. ముందే మద్దతు కూడగట్టిన జానా సీఎల్పీ నేత విషయంలో జానారెడ్డి సోమవారమే చక్రం తిప్పారు. తనకు పోటీగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడారు. గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో మంతనాలు జరిపి మద్దతు కూడగట్టడంలో సఫలీకృతులయ్యారు. డీకే అరుణ సైతం ముగ్గురు నేతలను కలిసి మద్దతు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. డీకే అరుణ వర్గం ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా సీఎల్పీ నేతను ఎన్నుకుంటామని చెప్పిన హైకమాండ్ పెద్దలు ఓటింగ్ నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆసక్తికరంగా కౌన్సిల్ ప్రతిపక్ష నేత ఎన్నిక మధ్యాహ్నం ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పోటీపడ్డారు. మొత్తం 17 మందికిగాను 16 మంది ఎమ్మెల్సీలు హాజరైన ఈ భేటీలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో వయలార్, దిగ్విజయ్ పక్క గదిలోకి వెళ్లి ఒక్కొ సభ్యుడిని పిలిచి అభిప్రాయసేకరణ జరిపారు. వీరిలో 8 మంది డీఎస్‌కు, మరో 8 మంది షబ్బీర్‌కు మద్దతు తెలిపారు. అయితే హైకమాండ్ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. తెలంగాణ మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం అందులో 7 ఖాళీలున్నాయి. మిగతా 33 మందిలో.. కాంగ్రెస్‌కు 17, టీఆర్ఎస్కు 4, టీడీపీకి 7, ఎంఐఎంకు ఇద్దరు సభ్యులతోపాటు ఇతరులు ముగ్గురున్నారు. -
కేసీఆర్‌ది దురహంకారం
ఆయనలా దిగజారి మాట్లాడలేను: జానారెడ్డి మిర్యాలగూడ : తాను ఓడిపోతానని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దురహంకారంగా మాట్లాడుతున్నాడని, ఆయనలా దిగజారి మాట్లాడలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తామనే లెక్కలు మాత్రం చెప్పనని, కానీ, అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. తమకంటే అధిక సీట్లు వస్తాయని ఎవరికి వారుగా ప్రకటించుకుంటున్నారే తప్ప.. ఎన్ని సీట్లు వస్తాయని ఎవరూ చెప్పలేరన్నారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందనీ, అధిష్టానం నిర్ణయంతోనే ముఖ్యమంత్రి నియామకం జరుగుతుందని స్పష్టంచేశారు. -
ఓటుకు ‘జానా’ దూరం!
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ కూడా ఉంది. కానీ ఆయన ఓటు వేయలేకపోయారు. అది ఎలాగనుకుంటున్నారా? నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సిబ్బంది నివాసం ఉండడానికి క్వార్టర్లు నిర్మించారు. కాలక్రమేణా ఇతరులూ ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సాగర్‌ను అధికారులు అటు గ్రామపంచాయతీగాను, ఇటు మునిసిపాలిటీగాను గుర్తించలేదు. దీంతో ఇక్కడి వాసులకు కేవలం సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే ఓటేసే అవకాశముంది. నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చేసాగర్లోని హిల్‌కాలనీలో 6,150 మంది, పైలాన్‌కాలనీలో6,248 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో జానారెడ్డి కుటుంబసభ్యులూ ఉన్నారు. 89వ పోలింగ్ కేంద్రం పరిధిలో 897 వరుస సంఖ్య నుంచి జానారెడ్డి కుటుంబసభ్యుల ఓట్లు నమోదై ఉన్నాయి. -
జానారెడ్డితో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ పెద్దలు వ్యవహరించిన తీరుపట్ల జానారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనైన నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ కూడా దిగ్విజయ్‌తోపాటు జానారెడ్డిని కలిశారు. టీపీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో హైకమాండ్ అనుసరించిన తీరు, ఈ విషయంలో ఏర్పడిన గందరగోళంపై చర్చించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు రాహుల్‌గాంధీ కార్యాలయం ఫోన్‌చేసి ఢిల్లీ రావాలని కోరారని, ఆ సమయంలో జానారెడ్డికి ఫోన్‌చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. జరిగినదంతా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తు, కేసీఆర్ ప్రతిపాదనలపైనా వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, పొత్తు సాధ్యంకాని పక్షంలో ఒంటరిగా పోటీచేసేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు సమాచారం. -
ప్రదేశ్ చిచ్చు కమిటీ
పీసీసీ అధ్యక్ష పదవులపై కాంగ్రెస్‌లో రగిలిన అసమ్మతి పొన్నాల ఎంపికపై సీనియర్ల అసంతృప్తి.. సీమాంధ్రలోనూ అదే సీన్ నేడు దిగ్విజయ్ రాక, నేతలతో మంతనాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను(పీసీసీ) ఏర్పాటుచేసిన కాంగ్రెస్ అధిష్టానానికి అసమ్మతి పెల్లుబుకి ఆదిలోనే హంసపాదులా మారింది. పీసీసీ పగ్గాలను తమకు అప్పగిస్తారని ఆశతో ఎదురుచూసిన సీనియర్లు అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ పీసీసీకి జరిగిన ఎంపికలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా సీమాంధ్రలోనూ అదే పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. ఈ ఎంపికలపై సీనియర్ నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారిక ప్రకటన వెలువడే ముందువరకు కూడా జానా పేరే ఖరారవుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పొన్నాల పేరును అధికారికంగా ప్రకటించడం జానారెడ్డి వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పొన్నాల పేరును ప్రకటించే ముందు దీనిపై ఏఐసీసీ పెద్దలు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలతో చర్చించారు. పొన్నాల ఎంపికే మింగుడుపడనిదిగా ఉంటే కమిటీలో తనకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవడం జానారెడ్డిని తీవ్రంగా బాధిస్తోంది. పైగా సొంత జిల్లా నల్లగొండకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించడం కూడా పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. దీనిపై ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. డీఎస్ తీవ్ర మనస్తాపం పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా, విధేయుడిగా మసలుకుంటూ వచ్చిన పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు కూడా తెలంగాణ పీసీసీ ఎంపిక వ్యవహారం షాక్‌కు గురిచేసింది. గతంలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్న సెంటిమెంటు ఉండడంతోపాటు తెలంగాణ అంశంపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని సమర్పిస్తూ వారి కనుసన్నల్లో మెలగుతూ వచ్చారు. సోనియాకు సన్నిహితంగా ఉన్న తనకు పీసీసీ పగ్గాలు తప్పకుండా వస్తాయని ఆయన ఎంతో ఆశతో ఎదురుచూశారు. అయితే సీనియర్ అయిన ఆయన్ను పక్కనపెట్టి జూనియర్ అయిన పొన్నాల లక్ష్మయ్యను ఎంపికచేయడం డీఎస్ వర్గీయుల్లో అసంతృప్తి నింపింది. ‘‘మొన్నటి వరకు తనకే పదవి ఖరారన్న నమ్మకంతో ఉన్నారు. కమిటీ ప్రకటన వచ్చాక డీఎస్ మనోవేదనకు గురయ్యారు. ఎవరితోనూ మాట్లాడడం లేదు’’ అని డీఎస్‌కు అత్యంత సన్నిహిత నేత ఒకరు పేర్కొన్నారు. పైగా డీఎస్ సొంత జిల్లాకు చెందిన షబ్బీర్ అలీకి కమిటీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం కూడా ఆయన వర్గానికి ఇబ్బందికరంగా మారింది. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి రానుండడంతో ఆయన సమక్షంలోనే దీనిపై తేల్చుకొనేందుకు డీఎస్ వర్గీయులు సిద్ధపడుతున్నారు. సీమాంధ్రలోనూ అదే పరిస్థితి ఇక తెలంగాణ స్థాయిలో కాకున్నా సీమాంధ్రలోనూ పీసీసీ కమిటీ ఏర్పాటు పట్ల పార్టీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమైక్య పీసీసీ కాకపోయినా ఏపీ పీసీసీకి తననే కొనసాగిస్తారని బొత్స భావించారు. తనను తప్పించడం ఖాయమని తేలడంతో బొత్స చివరి నిమిషంలో సోనియాగాంధీని కలసి తనను బాధ్యతలనుంచి తప్పించి కొత్తవారిని నియమించాలని కోరారని చెబుతున్నారు. అంతకు వారం రోజుల ముందునుంచే బొత్స స్థానంలో వేరొకరి పేరుపై అధిష్టానం తీవ్ర కసరత్తు సాగిస్తూ వచ్చింది. రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా ఉన్న ఎస్సీ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు రాష్ట్రానికి చెందిన కొందరు నేతలతో బీసీ నేతలపై చర్చలు జరిపారు. అంతిమంగా రఘువీరారెడ్డిని ఎంపికచేయడంతో బొత్స నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. అదేసమయంలో తమ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తారని ఆశించిన కేంద్రమంత్రి చిరంజీవి కూడా తాజా కమిటీలో సముచిత ప్రాధాన్యం దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారని సమాచారం. గత ఆరునెలల కాలంగా పార్టీ అధిష్టానాన్ని తరచూ కలుస్తూ తనకు అవకాశం వస్తుందని ఎదురుచూసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పెద్దదెబ్బే తగిలింది. కమిటీ నాయకత్వ పగ్గాల మాట అటుంచి కమిటీలో ఎలాంటి బాధ్యత అప్పగించకపోవడంతో ఆయన సన్నిహితులు ఆగ్రహంతో రగులుతున్నారు. నేడు దిగ్విజయ్రాక.. అసమ్మతులతో చర్చలు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం ఉదయం పదిన్నరకు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈనెల 15 వరకు ఆయన రాష్ట్రంలోనే ఉండనున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడమే ప్రధానంగా ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో రాజకీయంగా ఎక్కువ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న తరుణంలో అసమ్మతి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారుతుందని అధిష్టానం భావిస్తోంది. దీంతోపాటు తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్తో పొత్తుల వ్యవహారంపై కూడా దిగ్విజయ్ ఆ పార్టీ నేతలతో చర్చలు సాగించనున్నారు. పొత్తులపై ఒకపక్క చర్చిస్తూనే పార్టీ నేతలను ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారని, ఇందుకోసం ఇరుప్రాంత పీసీసీలతోనూ, ఇతర నేతలతోనూ దిగ్విజయ్ మాట్లాడనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. పార్టీ టికెట్ల వ్యవహారంపైనా ఆయన అభిప్రాయాలు తీసుకోవచ్చంటున్నారు. టీజేఏసీ నేతలతోనూ చర్చలు జరపనున్నారు.