డీఎస్, జానా ఎంపికపై డీకే అరుణ వర్గం అసహనం
-
ప్రతిపక్ష నేతలుగా ఎన్నుకున్న సీఎల్పీ
-
వయలార్ రవి, దిగ్విజయ్ ప్రకటన
-
సీఎల్పీ భేటీలో నేతల నుంచి అభిప్రాయ సేకరణ
-
తొలుత ఓటింగ్ నిర్వహిస్తామన్న పెద్దలు
-
అవసరం లేదన్న సీనియర్లు.. డీఎస్ ఎంపికపై డీకే అరుణ వర్గం అసహనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ తొలి ప్రతిపక్ష నేతగా కుందూరు జానారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నేతగా ధర్మపురి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వీరిరువురు ఎన్నికైనట్లు ప్రకటించారు. అంతకుముందు ఈ ఇద్దరి నేతల ఎన్నిక అనేక మలుపులు తిరిగింది. పలువురు నేతలు ఈ పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. సీఎల్పీ సమావేశంలోనూ అభిప్రాయ సేకరణ ఆసక్తికరంగా సాగింది. కొందరు నేతలు జానా, డీఎస్ పేర్లను వ్యతిరేకించినా.. అధిష్టానం పెద్దలు మాత్రం వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఓటింగ్ వద్దన్న సీనియర్లు
సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ దూతలుగా వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్ హాజరవగా, వీరికి సహాయకులుగా రామచంద్ర కుంతియా, తిరునావక్కరసార్‌లు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకుగాను 20 మంది హాజరయ్యారు. సమావేశంలో తొలుత దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. వెంటనే సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి లేచి ‘‘ఓటింగ్ నిర్వహిస్తే బయటకు వేరే సంకేతాలు వెళ్తాయి. పార్టీ ఇప్పటికే కష్టకాలంలో ఉంది. గెలిచింది 21 మంది ఎమ్మెల్యేలే. కలిసికట్టుగా నడవాల్సిన ఈ సమయంలో ఓటింగ్ నిర్వహిస్తే ఎమ్మెల్యేలో చీలిక వస్తుంది’’ అని సూచించారు. ఈ వాదనను పార్టీ నేత జీవన్‌రెడ్డి బలపరిచారు. డీకే అరుణ ఆ సమయానికి సమావేశానికి రాలేదు. సమావేశంలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కాకపోవడంతో అధిష్టానం పెద్దలు అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే వచ్చి అభిప్రాయాన్ని చెప్పాలంటూ వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు. ఈలోపు అక్కడికి చేరిన అరుణ.. ‘‘మరికొంత సమయం కోరదాం’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో అన్నారు. కానీ ఉత్తమ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో డీకే అరుణ తెలంగాణలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్న జిల్లా తమదేనని, ఈసారి సీఎల్పీ నేతగా తనకు అవకాశమివ్వాలని దిగ్విజయ్‌ను కోరారు. కానీ అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత మెజారిటీ సభ్యులు జానారెడ్డికి మద్దతు ఇచ్చారని దిగ్విజయ్ తెలిపారు. అక్కడి నుంచే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. దీంతో జానారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాలని సోనియా ఆదేశించారు. ‘‘ఓటమి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయండి’’ అని జానారెడ్డికి సోనియా సూచించారు. అనంత రం హైకమాండ్ పెద్దలు జానారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు.
ముందే మద్దతు కూడగట్టిన జానా
సీఎల్పీ నేత విషయంలో జానారెడ్డి సోమవారమే చక్రం తిప్పారు. తనకు పోటీగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడారు. గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో మంతనాలు జరిపి మద్దతు కూడగట్టడంలో సఫలీకృతులయ్యారు. డీకే అరుణ సైతం ముగ్గురు నేతలను కలిసి మద్దతు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. డీకే అరుణ వర్గం ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా సీఎల్పీ నేతను ఎన్నుకుంటామని చెప్పిన హైకమాండ్ పెద్దలు ఓటింగ్ నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఆసక్తికరంగా కౌన్సిల్ ప్రతిపక్ష నేత ఎన్నిక
మధ్యాహ్నం ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పోటీపడ్డారు. మొత్తం 17 మందికిగాను 16 మంది ఎమ్మెల్సీలు హాజరైన ఈ భేటీలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో వయలార్, దిగ్విజయ్ పక్క గదిలోకి వెళ్లి ఒక్కొ సభ్యుడిని పిలిచి అభిప్రాయసేకరణ జరిపారు. వీరిలో 8 మంది డీఎస్‌కు, మరో 8 మంది షబ్బీర్‌కు మద్దతు తెలిపారు. అయితే హైకమాండ్ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. తెలంగాణ మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం అందులో 7 ఖాళీలున్నాయి. మిగతా 33 మందిలో.. కాంగ్రెస్‌కు 17, టీఆర్‌ఎస్‌కు 4, టీడీపీకి 7, ఎంఐఎంకు ఇద్దరు సభ్యులతోపాటు ఇతరులు ముగ్గురున్నారు.