
'పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలి'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురువారం హైదరాబాద్లో పిలుపునిచ్చారు. ఓ పార్టీలో గెలిచి... మరోపార్టీలోకి వెళ్లడం అప్రజాస్వామికమని ఆయన అరోపించారు. గతంలో నేను రాజీనామా చేశాకే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించదని చెప్పారు. పార్టీ మారేవారిని అనర్హులుగా ప్రకటించేలా చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి జానారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మెదక్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జానారెడ్డి పైవిధంగా స్పందించారు.