పాదయాత్ర శిబిరం వద్ద భట్టివిక్రమార్కను పరీక్షిస్తున్న డాక్టర్
కేతేపల్లి: బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేని ఆ పార్టీ నాయకులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఉత్తర తెలంగాణ మొదలుకుని నల్లగొండవరకు సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, ప్రజల సంపద దోచుకుంటున్న ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే తాను పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో సాగింది.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నక్కలగండి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పనులు పూర్తి చేయిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కేసీఆర్‌కు.. ఇప్పటికీ కుర్చీ దొరకలేదా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా పూర్తి చేయని ‘పాలమూరు–రంగారెడ్డి’ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయించడంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య పాల్గొన్నారు.
భట్టివిక్రమార్కకు అస్వస్థత
కాగా, భట్టివిక్రమార్క మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి వచ్చిన వైద్యులు కేతేపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద ఆయనకు చికిత్స అందించారు. తీవ్రమైన వడగాలులు, ఎండలను లెక్కచేయకుండా 96 రోజులుగా పాదయాత్ర చేస్తుండటంతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. జ్వరం, తలనొప్పితో ఆయన బాధపడుతున్నారని, బీపీ కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు.
ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో బీపీ కంట్రోల్‌లోకి వచ్చిందన్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఆయన నకిరేకల్ హైవే నుంచి కొర్లపాడు మీదుగా కేతేపల్లికి, అక్కడి నుంచి భాగ్యనగరం శివారు వరకు మొత్తం 12.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంది. అస్వస్థతకు గురికావడంతో నకిరేకల్ హైవే నుంచి బయలుదేరి కొర్లపాడు మీదుగా 6 కిలోమీటర్లు నడిచి కేతేపల్లికి చేరుకున్నారు. అక్కడే పాదయాత్రకు విరామం ప్రకటించారు.
బుధవారం ఉదయం వరకు జ్వరం, తలనొప్పి తగ్గితే పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని భట్టి విక్రమార్క కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పి.నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు భట్టిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment