చివరకు మిగిలిందేమిటి?
తెలంగాణ కోసం అష్టకష్టాలు పడ్డాం
పార్టీ ఫణంగా పెట్టినా ఆదరించలేదు
జేఏసీ నేతల ఎదుట జానారెడ్డి నిర్వేదం
హైదరాబాద్: ‘తెలంగాణ కోసం అష్టకష్టాలు పడ్డాం. ఎన్నో త్యాగాలు చేశాం. సొంత పార్టీనే ఎదిరించాం. పదవులనూ త్యజించాం. చివరకు సీమాంధ్రలో పార్టీనే ఫణంగా పెట్టాం. ఇంత చేసినా మాకు ఒరిగిందేమిటి? ప్రజలు మమ్ముల్ని ఆదరించలేదు. ఇంతకంటే ఇక మేం చేయగలిగిందేముంది?’ తెలంగాణ ఉద్యోగసంఘాల నేతల ఎదుట కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి నిర్వేదంగా చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం సాయంత్రం జేఏసీ నేతలు సి.విఠల్, మణిపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సతీశ్ తదితరులు జానారెడ్డి ఇంటికి వెళ్లి రాజ్యసభలో పోలవరం బిల్లును అడ్డుకునేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నందున పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే వీగిపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా జానారెడ్డి పైవిధంగా స్పందించారు. జేఏసీ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణ కోసం పార్టీలో, బయటా ఎంతో శ్రమించినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని జానారెడ్డి వాపోయారు. ఇదిలా ఉండగా, ముంపు గ్రామాల విలీనం పై కాంగ్రెస్ అధినేత్రితో సోనియాతో చర్చిస్తానని జానారెడ్డి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు