ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి
-
9 నుంచి నాలుగు రోజులపాటు శాసనసభ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత కె. జానారెడ్డి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. శాసనసభా సాంప్రదాయం ప్రకారం సీనియర్ సభ్యునికే ఈ గౌరవం దక్కుతుంది. జానారెడ్డి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అసెంబ్లీకి పోటీ చేయగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుత శాసనసభ్యుల్లో అందరికంటే ఆయనే సీనియర్. మరోవైపు అసెంబ్లీ తొలి సమావేశాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. ఈ నెల 9న ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే శాసనసభ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 10న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 11న గవర్నర్ ప్రసంగం, 12న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలతో సమావేశాలు ముగుస్తాయని ఆయన వివరించారు.
స్పీకర్‌పై ఉత్కంఠ
స్పీకర్‌గా ఎవరికి అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ ఇంకా ఎవరి పేరూ ఖరారు చేయలేదు. టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు కొప్పుల ఈశ్వర్, ఆజ్మీరా చందూలాల్, ఎస్.మధుసూదనాచారి పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. వీరిలో కొప్పుల ఈశ్వర్, చందూలాల్ ఇప్పటికే స్పీకర్ పదవిపై అయిష్టం వ్యక్తం చేశారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరిని స్పీకర్ పదవికి ఒప్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.