కోటి ఎకరాల ఆయకట్టు | Million-acre basin | Sakshi
Sakshi News home page

కోటి ఎకరాల ఆయకట్టు

Published Thu, Nov 10 2016 4:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

కోటి ఎకరాల ఆయకట్టు - Sakshi

కోటి ఎకరాల ఆయకట్టు

ఇదే కేసీఆర్ లక్ష్యం: హరీశ్‌రావు
అందుకోసం ఇంజనీర్‌లా కృషి చేస్తున్నారు
► ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ ప్రజలకు అంకితం
► సభా వేదికపై జగదీశ్-జానా సంవాదం
► టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో జానా కూడా లబ్ధి పొందారంటూ జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు
► తానేమీ పొందలేదన్న విపక్ష నేత
► మీరెందుకు గెలవలేదన్న సభికులను నవ్వుల్లో
► ముంచెత్తిన జానా వ్యాఖ్యలు  

సాక్షి, నల్లగొండ: ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లో అంతర్భాగమైన లో లెవల్ కెనాల్ (ఎల్‌ఎల్‌సీ)ను నల్లగొండ జిల్లా పెదవూర మండలం పుల్యా తండా వద్ద బుధవారం ఆయన ప్రజలకు అంకితం చేశారు. అనంతరం సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే కె.జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తు చేశారు. అందులో రైతన్నకు గుండెకాయలాంటి సాగునీటిని సాకారం చేసేందుకు కేసీఆర్ ఓ ఇంజనీర్‌లా పనిచేస్తున్నారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తామంతా సమష్టిగా పని చేసి పూర్తి చేస్తున్నామన్నారు. లో లెవల్ కెనాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల శంకుస్థాపనలే మిగిలాయన్నారు. లో లెవల్ కెనాల్‌కు సంబంధించిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది కల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ రెండో దశ పనులను కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు కూడా నీళ్లిస్తామని వివరించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగికి కూడా నీరిస్తామని, అయితే, రైతులు వరి పంట కన్నా ఆరుతడి పంటలు వేసుకోవడమే మేలని సూచించారు. ఏ పంట వేసినా మార్చి 31 కల్లా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు.

జానా-జగదీశ్‌రెడ్డి సంవాదం
ప్రసంగాల సందర్భంగా  జానారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి నడుమ సంవాదం చోటుచేసుకుంది. జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి లో లెవల్ కెనాల్‌ను పూర్తి చేయడమే సమాధానమన్నారు. ‘‘తెలంగాణ వచ్చింది గనకే రెండున్నరేళ్లలో పనులు పూర్తయ్యాయి. లేదంటే మరో 20, 30 ఏండ్లు పట్టేవి. లో లెవల్ కెనాల్ పనులు ప్రారంభమై 19 ఏళ్లు కావ స్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలూ దీన్ని నిర్లక్ష్యం చేశాయి’’ అన్నారు. జానా స్పందిస్తూ, కెనాల్‌కు పంప్‌హౌస్ పనులు ప్రారంభమై ఏడేండ్లే అరుయిందన్నారు. ఏడేండ్లయినా సరే వాటిని తామే పూర్తి చేశామని జగదీశ్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందని మనిషి లేడన్నారు. జానారెడ్డి కూడా లబ్ధి పొందారని చమత్కరించారు. దీనికి స్పందించిన జానా, తానేమీ లబ్ధి పొందలేదని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎండాకాలంలో కరెంటు లేక జానారెడ్డి ఇంట్లో జనరేటర్లు నడిచేవి. ఆ లెక్కన ఆయనకిప్పుడు కనీసం 100-200 లీటర్ల డీజిల్ అయినా మిగిలే ఉంటుంది. దీన్ని ప్రతిపక్ష నాయకులతో సహా అందరూ అంగీకరించాల్సిందే’’ అని అన్నారు.
 
పరస్పరం గౌరవించుకుంటే మంచిది: జానా

అనంతరం ప్రసంగించిన జానా  తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ‘‘గత ప్రభుత్వాలు చేసిన పనులనే టీఆర్‌ఎస్ కొనసాగించి పూర్తి చేసింది. అందుకు వారు అభినందనీయులు’’ అని అన్నారు. ‘‘ఎల్‌ఎల్‌సీ నిర్మాణానికి రూ.220 కోట్లు ఖర్చయితే అందులో కేవలం రూ.32 కోట్లు మాత్రమే టీఆర్‌ఎస్ ఇచ్చింది. అందులో నూ రూ.10 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే నికరంగా టీఆర్‌ఎస్ ఇచ్చింది రూ.22 కోట్లే. మిగతా మొత్తాన్ని గత ప్రభుత్వాలే ఖర్చు చేశాయి’’ అని వ్యాఖ్యానించారు. ఎవరు చేసినా అందరూ పరస్పరం గౌరవించుకుని, సమన్వయం తో ముందుకెళ్లాలే తప్ప తామే అంతా చేశామని చెప్పడం కూడా సరైంది కాద న్నారు. ‘‘టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు తామే పూర్తి చేశామంటున్నారు.

అసలు మేం మొదలుపెట్టకపోతే వీళ్లు పూర్తి చేసేవా రా?’’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల్లో ఒకరు జానానుద్దేశించి ‘అయితే ఎన్నికల్లో మీరెదుకు గెలవలేదు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుందని జానా అన్నారు. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంద రూ హిల్లరీ గెలుస్తారని చెప్పారు. కానీ ట్రంప్ గెలిచాడు’’ అని చమత్కరించ డంతో సభా ప్రాంగణం నవ్వులతో నిండి పోయిది. కార్యక్రమంలో నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్,  అటవీ అభివృద్ధి కార్పొరే షన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభా కర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement