తమ్మినేని పచ్చి అబద్ధాలకోరు
► ఆయన వ్యాఖ్యలు అసెంబ్లీని అవమానించేలా ఉన్నాయి: హరీశ్
► సీపీఎంకి ఎజెండాయే లేదు.. ఇలాగైతే వారికి కార్యకర్తలే మిగలరు
సాక్షి, హైదరాబాద్: ‘‘సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతు న్నారు. ఆయన వ్యాఖ్యలు అసెంబ్లీని, శాసన సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయి. మొదట్నుంచీ తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని జీర్ణిం చుకోలేకపోతోంది. ఆ పార్టీకి ఏ ఎజెండా లేదు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పేదల ఎజెండా మింగుడు పడడం లేదు’’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ , మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇతర నాయకులతో కలసి విలేకరులతో మా ట్లాడారు.
తమ్మినేని దుర్మార్గంగా మాట్లాడు తున్నారని, వారి పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను అడిగితే అసెంబ్లీలో ఏం జరిగిం దో, ఏం అంశాలు చర్చించామో తమ్మినేనికి తెలిసేదని అన్నారు. ‘‘శాసనసభలో వన్ మ్యాన్ షో జరిగిందని తమ్మినేని అన్నారు. నిజమే వన్ మ్యాన్ షో జరిగింది. సభలో ఆ పార్టీకి ఉన్నదే ఒక్క సభ్యుడు. బయట తమ్మినేని వన్ మ్యాన్ షో చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఆయన ఆడుతున్న పచ్చి అబద్ధాలతోనే సీపీఎం పాదయాత్ర నిబద్ధత ఏపాటితో తేలిపోయిందన్నారు.
పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంటులో కాంగ్రెస్, సీపీఎం మాట్లాడలేదని, కానీ తెలంగాణ అసెంబ్లీలో వారి సభ్యులు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. పేదలు పేదలుగానే ఉండిపో వాలన్నది సీపీఎం విధానమా అని నిలదీశా రు. పాదయాత్రను పార్టీ ఫుల్‌టైమ ర్లతో సాగిస్తున్నారని, వారి వెనుక కార్యకర్తలే లేర న్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే భవిష్య త్‌లో ఆ పార్టీకి కార్యకర్తలే మిగలరన్నారు.
దేశానికే ఆదర్శంగా అసెంబ్లీ..
తమ్మినేని కళ్లుండీ చూడలేక పోతున్నారని హరీశ్ అన్నారు. ‘‘శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చి తెలంగాణ శాసన సభ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక్క రోజు కూడా సమయం వృథా కాకుండా సమావేశాలు నిర్వహించుకున్నాం. అర్థవంతమైన చర్చ జరిగిందని ప్రజలు హర్షిస్తున్నారు. నోట్ల రద్దుపై చర్చించిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. 18 రోజులు సభ జరిగితే 15 అంశాలపై చర్చించాం. కానీ ఓట్లు రాలని నాయకులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై సవివరమైన చర్చ జరిగి, సభ్యులంతా మాట్లాడితే అసలు చర్చే జరగలే దనడం సీపీఎం అవివేకానికి నిదర్శనం. గతంలో ఏ ముఖ్యమంత్రీ శాసనసభ సమావేశాలకు ఇంత సమయం ఇవ్వలేదు. 18 రోజుల్లో సీఎం కేసీఆర్ 8.30 గంటలు మాట్లాడారు. సింగరేణి అంశంలో ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చాం. 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సభలో ప్రకటిస్తే అసలు బీసీల గురించే మాట్లాడలేదని అనడం విడ్డూరంగా ఉంది. ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భృతి ప్రకటించాం.
మైనార్టీలకు 200 గురుకుల పాఠశాలల మంజూరుతోపాటు ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించాం. సైనికుల సంక్షేమం కోసం గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇవన్నీ తమ్మినేనికి ఎందుకు కనబడటం లేదు’’ అని నిలదీశారు. తమ్మినేని వంటి అబద్ధాలకోరుకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు.
బెంగాల్‌లో ఏం ఒరగబెట్టారు?
మంత్రి జగదీశ్‌రెడ్డి
శాసన సభలో అర్ధవంతమైన చర్చ జరగాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగారని మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. దశాబ్దాల పాలనతో పశ్చి మ బెంగాల్ ప్రజలకు సీపీఎం ఏం ఒరగ బెట్టిందని ప్రశ్నించారు. ప్రతీ ఎన్నికల్లో సీపీఎంకు భంగపాటేనని అన్నారు.