జానారెడ్డితో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ పెద్దలు వ్యవహరించిన తీరుపట్ల జానారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనైన నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ కూడా దిగ్విజయ్‌తోపాటు జానారెడ్డిని కలిశారు.
టీపీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో హైకమాండ్ అనుసరించిన తీరు, ఈ విషయంలో ఏర్పడిన గందరగోళంపై చర్చించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు రాహుల్‌గాంధీ కార్యాలయం ఫోన్‌చేసి ఢిల్లీ రావాలని కోరారని, ఆ సమయంలో జానారెడ్డికి ఫోన్‌చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. జరిగినదంతా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు, కేసీఆర్ ప్రతిపాదనలపైనా వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, పొత్తు సాధ్యంకాని పక్షంలో ఒంటరిగా పోటీచేసేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు సమాచారం.