చీరాల, న్యూస్‌లైన్: నేసిన వస్త్రాలు అమ్ముడుపోక చేనేత కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో దసరా, దీపావళి తదితర ప్రధాన పండుగల సమయాల్లో చేనేతల పరిస్థితి ఆశాజనకంగా ఉండేది. అప్పటి వరకు నేసిన వస్త్రాలు అమ్ముడుపోయి చేతినిండా డబ్బులుండేవి. మామూలు రోజుల్లో ఉపాధి కరువై మగ్గం సాగక, పూట గడవక పస్తులతో పోరాడుతుండేవారు. ప్రస్తుతం కనీసం పండుగ రోజుల్లో కూడా పట్టెడన్నం తినే పరిస్థితి లేక చేనేతలు ఇబ్బంది పడుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వం తీరే. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం వస్త్రాలను కొనుగోలు చేసే విషయంలో సవతి తల్లి ప్రేమను కనబరుస్తోంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆప్కో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కొనుగోళ్లు చేసి మమ అనిపిస్తోంది.
మాస్టర్ వీవర్ల వద్ద పేరుకుపోతున్న నిల్వలు: జిల్లాలో 24 వేల చేనేత మగ్గాలున్నాయి. ఇరవై వేల పైచిలుకు చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1.60 లక్షల మంది చేనేతలు పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడ్డారు. జిల్లాలో 56 వరకు ఆప్కో సొసైటీలుండగా చీరాలలోనే 30 సంఘాలు పనిచేస్తున్నాయి. నిత్యం కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తేనే పూట గడిచేది. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల అమ్మకాలు పూర్తిగా స్తంభించి జిల్లాలో రూ. 8 కోట్ల విలువైన చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా చేనేత మగ్గాలపై ఐదు వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అమ్మకాలు లేకపోవడం, ఆప్కో కొనుగోళ్లు చేయకపోవడంతో చేనేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్కో మాస్టర్ వీవర్ వద్ద రూ. 10 నుంచి రూ. 20 లక్షల విలువైన చేనేత వస్త్రాల నిల్వలున్నాయని సమాచారం.
అప్పులపాలవుతున్న చేనేతలు: వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూతనివ్వకపోవడంతో మాస్టర్‌వీవర్లు చేనేత కార్మికులకు పని కల్పించడం లేదు. దీంతో పూట గడవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ, తదితర నూలును ముంబాయి, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మూడు నెలల వ్యవధిలో వచ్చిన వినాయకచవితి, దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ అయిన శ్రావణమాసంలో కూడా చేనేత వస్త్రాల అమ్మకాలు అరకొరగానే జరగడంతో ఎక్కడికక్కడ నిల్వలు పేరుకుపోయాయి. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాల అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్న అమాత్యుల హామీలు బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా కార్మికులకు పస్తులే మిగిలాయి.
వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి
పడవల లక్ష్మణస్వామి, హ్యాండ్లూమ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు.
మిగిలింది పస్తులే..!
Published Wed, Nov 6 2013 5:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement