ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యవాదులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వెలువడే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా వరుసగా బుధవారం 57వ రోజు జిల్లా అంతటా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. ఒంగోలు నగరంలో ఏపీఆర్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు వాటర్ ట్యాంకర్లతో ప్రదర్శన చేపట్టి చర్చి సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు బైక్ ర్యాలీ ప్రారంభించారు. కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 50వ రోజుకు చేరాయి. 50 మంది న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు కాలనీ నుంచి చర్చి సెంటర్ వరకు కేసీఆర్ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు బస్సుయాత్ర ప్రారంభించారు.
రోడ్డుపైనే వంటావార్పు: అద్దంకి పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ రహదారిపై వంటా-వార్పు చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు 2 వేల మందితో హైవేపై మానవహారం నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. బల్లికురవలో సమైక్యవాదుల రిలే దీక్షలు 14వ రోజుకు చేరాయి. చీరాల పట్టణంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు వరుసగా 29వ రోజు కొనసాగాయి. అలాగే వేటపాలెంలో సమైక్యవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. పర్చూరులో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. గిద్దలూరులో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ర్యాలీ చేపట్టారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో హిందూ, ముస్లిం ఐక్య కూటమి సభ్యులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయుల ర్యాలీ, మానవహారం, రిలే నిరాహార దీక్షలు చేశారు. కొమరోలులో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేశారు. కంభంలో ఆర్యవైశ్య మహిళలు పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీగా కందులాపురం సెంటరు వరకు వెళ్లి మానవహారం, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
గుడ్లూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎర్రన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కనిగిరిలో పట్టణంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 10వ రోజుకు చేరాయి. అలాగే దొరువు బజార్ ముస్లిం యువకులు నిరసన ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మని ద హనం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మార్కెట్‌యార్డు సిబ్బంది రిలే దీక్షలో కూర్చున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. పట్టణంలో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హనుమంతునిపాడులో రాష్ట్ర విభజనకు నిరసనగా యూటీఎఫ్ ఉపాధ్యాయులు జన చైతన్య యాత్ర ప్రారంభించారు. సీఎస్‌పురంలో సమైక్యవాదులు రోడ్డుపై ఆటలు ఆడి నిరసన తెలిపారు. పామూరు మండలం బొట్లగూడూరులో గ్రామస్తులు రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. మార్కాపురంలో న్యాయవాదులు, ఉద్యోగులు కోర్టు ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విద్యార్థులు రిలే దీక్షలు ప్రారంభించారు.
అలాగే తిప్పాయపాలెంలో అంగన్‌వాడీలు వంటా-వార్పు నిర్వహించారు. పొదిలిలో సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు వంటా-వార్పు ఏర్పాటు చేశారు. యర్రగొండపాలెంలో రెడ్డి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో 450 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకులు, తెలుగుతల్లి, భారతమాత వేషధారణలతో, ఎడ్లబండ్లతో ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించారు. దోర్నాలలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. తోపుడు బండ్ల వ్యాపారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మండల సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పలు గ్రామాల్లో ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడులోని డైట్ కళాశాల అధ్యాపకులు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు.
వరుసగా 57వ రోజూ భారీ ఆందోళనలు, నిరసనలు
Published Thu, Sep 26 2013 4:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement