అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు చిత్తూరు జిల్లాలోని కుప్పం వరకు సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతోంది. దీంతో 13 జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. తిరుపతిలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ రోజు బంద్కు పిలుపు నిచ్చింది. ఆ నేపథ్యంలో ఒక్క ప్రైవేట్ వాహనం తిరుమలకు వెళ్లలేదు. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో సమైక్య ఉద్యమం 56వ రోజుకు చేరుకుంది. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సమైక్యవాదులు మహా మానవహారం నిర్వహించనున్నారు.
తనకల్లు నుంచి విడపనకల్లు, కొడికొండ నుంచి తరిడికొండ వరకు సమైక్యవాదుల మానవహారం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ నుంచి గండి దేవస్థానం వరకు 8 వేల మంది విద్యార్థులు మానవహారం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సమైక్యంధ్రాకు మద్దతుగా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు మూసివేశారు. విశాఖ జిల్లా అంతటా సమైక్య ఉద్యమం నిరసన సెగలు కక్కుతుంది.