ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. సెలవులు, పండుగలు, ఇతర వ్యాపకాలేమీ లేకుండా అన్నివర్గాల ప్రజలు లక్ష్యసాధనలో మమేకం అవుతున్నారు. ఉద్యమస్ఫూర్తి ఎక్కడా తొణక్కుండా ఎన్జీవోలు, సమైక్యవాదులు కార్యాచరణలతో ముందుకుసాగుతున్నారు. 33వ రోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా వినూత్న నిరసనలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు అలుపెరగకుండా ఉద్యమాన్ని కొనసాగించాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షల్లో రెవెన్యూ, ఆర్టీసీ, నీటిపారుదల శాఖ, రిటైర్డు ఉద్యోగులు కూర్చున్నారు. ఈ దీక్షలకు మద్దతు పలికిన చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యత అంటూనే ప్రజలను మోసగించడం ప్రజాప్రతినిధులకే చెల్లుతోందన్నారు.
ఈ విధానాలకు స్వస్తి పలకకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు రైల్వే సీజనల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో, ఫోర్‌మెన్ వర్కర్స్ యానియన్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సెకిళ్ళ ర్యాలీలు నిర్వహించారు. భీమవరం ప్రకాశంచౌక్ వద్ద విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించి మానవహారంగా ఏర్పడ్డారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో జేఏసీ నాయకులు ముచ్చర్ల సంజయ్ నేతృత్వంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సెంటర్‌లో నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న గెడ్డం బాబు, మాఘం వెంకటసుబ్బారావుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆచంటలో జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న దీక్షలో నియోజకవర్గ పాత్రికేయులు పాల్గొన్నారు. పెనుగొండలో తాపీ పనివారు సోనియా, కేసీఆర్‌లకు సమాధులు కట్టి నిరసన తెలిపారు. యలమంచిలి మండలంలో ఉపాధ్యాయులు చేపట్టిన బైక్ ర్యాలీకి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్‌సీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు స్వాగతం పలికారు. చించినాడ, దొడ్డిపట్లలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్లో టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు.
పెదఅమిరం ఏసుక్రీస్తు సహవాస సంఘ చర్చి ఆధ్వర్యంలో 500 మంది విశ్వాసులు ర్యాలీ, రాస్తారాకో, మానవహార ం చేశారు. ఈ నిరసనలో పాతపాటి సర్రాజు, ఎమ్మెల్యే శివ పాల్గొన్నారు. ఆకివీడులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారాకో చేశారు. జంగారెడ్డిగూడెంలో వాక ర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ చేపట్టారు. కామవరపుకోటలో రోడ్‌పై జేఏసీ సభ్యులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. చింతలపూడిలో కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు, స్థానిక మార్కెట్ కమిటీ వద్ద నుంచి ఫైర్‌స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. గోపాలపురంలో ఉపాధ్యాయులు 48 గంటల నిరవధిక నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. గోపాలపురం, నల్లజర్లలో టీడీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
33వ రోజూ ఆందోళనల హోరు
Published Mon, Sep 2 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement