‘ఉద్యమ’ నామ సంవత్సరం | 2013 samaikyandhra movement year | Sakshi
Sakshi News home page

‘ఉద్యమ’ నామ సంవత్సరం

Published Mon, Dec 30 2013 2:57 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

2013 samaikyandhra movement year

విజయనగరం క్రైం, న్యూస్‌లైన్:జిల్లాలో ఈ ఏడాది ఉద్యమ పిడికిళ్లు బలంగా బిగుసుకున్నాయి. నినాదాలతో వీధి వీధీ హోరెత్తిపోయింది. ప్రధానంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఊళ్లకు ఊళ్లు పాల్గొని పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. దీనికి తోడు ఉద్యోగుల ఆందోళనలు కూడా భారీ ఎత్తున జరి గాయి. ఇవన్నీ కలిసి ఈ ఏడాదిని ‘ఉద్యమ నామ సంవత్సరం’గా మార్చేశాయి.   
 
 సమైక్యాంధ్ర ఉద్యమం...
 జిల్లాలో జరిగిన ఉద్యమాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం అతి పెద్దది. జూలై ఒకటిన ప్రారంభమైన ఈ ఉద్యమం వినూత్న రీతిలో దాదాపు రెండు నెలల పాటు ఏకధాటిగా కొనసాగింది. సామాన్యులే నాయకులుగా మారి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 
 వీరితో పాటు అన్ని ఉద్యోగ సంఘాల వారూ పోరాటంలో పాలు పంచుకున్నారు. అయితే అన్ని చోట్లా శాంతియుతంగానే ఉద్యమం జరగడం జిల్లాకు ఉన్న మంచిపేరును మరోసారి చాటి చెప్పింది. ఒక్క విజయనగరంలోనే కాసింత ఉద్రిక్తత చోటు చేసుకుంది.  
 
 విధ్వంసకర సంఘటనలు...
 అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్జీఓలు ఎంపీలు, మంత్రులకు చెందిన ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 4వ తేదీన మంత్రి బొత్స  సత్యనారాయణ, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ఇళ్లను ఎన్జీఓలు ముట్టడించారు. అయితే ఉద్యమం ఎంతకీ చల్లారకపోవడంతో  కలెక్టర్ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అక్టోబర్ 5న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు బొత్స ఇంటి వద్ద బందోబస్తును పర్యవేక్షిస్తున్న అప్పటి ఎస్పీ కార్తికేయ, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర  పోలీసు అధికారులకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. అదే రోజు సాయంత్రం సమైక్యాంధ్ర ఉద్యమకారులు బొత్సకు చెందిన ఆస్తులు, కళాశాలల ధ్వంసానికి పాల్పడ్డారు. 
 
  బొత్స సొదరుడికి చెందిన సత్య టెలివిజన్ చానల్ కార్యాలయానికి ఆందోళన కారులు నిప్పుపెట్టడంతో పూర్తిగా కాలిపోయిది. బొత్స  మేనల్లుడు చిన్నశ్రీను ఇంటి పై ఆందోళన కారులు దాడికి యత్నించారు. అలాగే మద్యం దుకాణాలు, ఇతర షాపులపై కూడా దాడి చేశారు. డీసీసీబీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఫైళ్లకు నిప్పంటించారు.  
 
 కర్ఫ్యూ...
 సమైక్యాంధ్ర ఉద్యమం హింసాత్మకంగా మారుతోందని భావించిన పోలీసులు జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ పెట్టారు. రాష్ట్ర బలగాలతోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీలు, ఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. కర్ఫ్యూ తర్వాత అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్‌లో చావబాదారు. ప్రజల ఇళ్లల్లోకి చొరబడి మరీ అరెస్ట్‌లు చేశారు.  
 
 జీ(వి)తాల కోసం... 
 జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదంతా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యమాలు చేశారు. 108 ఉద్యోగులు 33 రోజులపాటు సమ్మె చేశారు. జూలై 18న కేంద్రాస్పత్రి ఎదుట 108  ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమ్మె ప్రారంభించారు. 
 అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 23న సమ్మెను ముగించారు. కంప్యూటర్ టీచర్లు, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళనలు చేపట్టారు.  
 
 ధరల దరువు
 విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టించింది. వంగ దొరక్కుండా బెంగ పడేలా చేసింది. బంగాళాదుంప బంగారంతో పోటీ పడేట్లు కనిపించింది. మరోవైపు గ్యాస్ దిమ్మలు బరువెక్కాయి. విద్యుత్ బిల్లులు షాకిచ్చాయి. మొత్తానికి 2013లో ధరలు దరువేశాయి. సామాన్యుడికి అందకుండా నిత్యావసరాలు పైపైకి పరుగులు తీశాయి. దీనికి తోడుగా పెట్రో ధరలు మాటి మాటికీ పెరిగి ‘ధరల పెరుగుదల’ అనే మాటను సామాన్యం చేసేశాయి. వరుస తుఫాన్ల కారణంగా కూరగాయల ధరలు కూడా మండిపోయాయి. స్మార్‌‌టఫోన్లు, సిమ్‌కార్డులు వంటివి మాత్రం అందుబాటులోకి వచ్చాయి.
 
 రికార్డులు బద్దలుగొట్టిన ‘ఉల్లి’
 ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూల్చేసిన ఉల్లి ఈ ఏడాదీ తన విలువను పెంచుకుంది. ఒకానొక దశలో రూ.70 పెడితే గానీ కిలో ఉల్లి దొరకలేదు. ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల నెల నుంచి రెండు నెలలు ఇదే ధర కొనసాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు కూరగాయల పంటలను సర్వనాశనం చేశాయి. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. బంగాళాదుంపలు కిలో రూ.60, బీన్స్ ధర రూ.90 వరకు పెరిగింది. చిక్కుడు, టమోటా, క్యారెట్ ధరలు రూ.60 వరకు పెరిగాయి. దీంతో చాలా మంది కూరగాయలు జోలికి వెళ్లలేదు. గత ఏడాది కూరగాయలకు నెలకు రూ.400 నుంచి రూ.500 ఖర్చయితే ఈ ఏడాది నెలకు రూ.1000 నుంచి రూ.1100 వరకు ఖర్చయింది. 
 
 సన్న బియ్యం ధరలూ...
 సన్న బియ్యం ధరలు ఈ ఏడాది బాగా పెరిగాయి. 2012లో రూ.35 ఉన్న ధర ఈ ఏడాది రూ.45 నుంచి రూ.50కు చేరింది. కేవలం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నెలకు రూ.3వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సన్న బియ్యంలో అతి తక్కువ ధర గల రూ.38 నుంచి రూ.40 ఉన్న బియ్యంతో రైతులు సరిపెట్టుకున్నారు. పప్పుల ధరలు కూడా పెరిగాయి. కందిపప్పు రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. లీటరు ఆయిల్ రూ.60 నుంచి రూ.70 అయింది. రిఫండ్ ఆయిల్ రూ.80 నుంచి రూ.100 అయింది. 
 
 ‘గ్యాస్’ మంటలు
 ప్రభుత్వం ఈ ఏడాది గ్యాస్ ధరలను పెంచేసి కట్టెల పొయ్యిలను మళ్లీ సామాన్యుడి దగ్గరకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని ఎత్తివేయడంతో రూ.440 ఉన్న గ్యాస్ ధర రూ.1100 అయింది. ఆధార్ కార్డు ఉన్న వారికి రాయితీ నగదును బ్యాంకులో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. 
 
 బాబోయ్ పెట్రో ధరలు
 ఈ ఏడాది పెట్రోల్ ధరలు దాదాపు పదిసార్లు పెరిగాయి. డీజిల్ ధరలు పద్నాలుగు సార్లు పెరిగాయి. ఒకే ఏడాదిలో ఇన్ని సార్లు పెరగడం రికార్డు అనే చెప్పాలి. రూ.73 ఉన్న పెట్రోల్ లీటరు ధర రూ.78 అయింది. డీజిల్ ధర రూ.51.35 నుంచి రూ.58.6కు పెరిగింది. 
 
 అవీ... ఇవీ...
 ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే కొబ్బరి, బాణసంచా ధరలు కూడా పెరగడంలో పోటీ పడ్డాయి. బైక్‌లు, కార్ల ధరలూ పెరి గాయి. అయితే బంగారం మాత్రం కాస్త తగ్గింది.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర 2012 డిసెంబర్‌లో *30,570 ఉంటే ఈ ఏడాది డిసెంబర్‌కు 29,340 ఉంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement