సమైక్య ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడుగా అశోక్ బాబు నీరుగార్చారని ఏపీఎన్జీవో రెండో ప్యానల్ నేతలు బషీర్, సత్యనారాయణలు ఆరోపించారు. ఆదివారం వారిరువురు అశోక్ బాబుపై నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమంలో రాజకీయ పార్టీలను కలుపుకోని పోవడంలో అశోక్బాబు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషిస్తున్న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రావడం అయింది, వెళ్లటం అయింది కానీ ఆయన్ని అశోక్ బాబు అడ్డుకున్నదాఖలాలు లేవని వారు ఉదాహరించారు. అలాగే టి.బిల్లు అసెంబ్లీకి వస్తే ముట్టడిస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో ఏ ఒక్కటి అశోక్ బాబు చేయలేదని ఆయన వ్యవహారశైలీని బషీర్, సత్యనారాయణలు ఎండగట్టారు. సొంత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని అశోక్ బాబు వాడుకున్నారని వారు ఆరోపించారు.
అందుకే అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోటీకి దిగినట్లు వారిరువురు తెలిపారు. తప్పుడు ఓటర్ల జాబితాతో ఏపీఎన్జీవో ఎన్నికల్లో... అశోక్బాబు అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అశోక్ బాబు ఎంత ఖర్చు చేసిన నిజాయితీపరులైన ఎన్జీవోలు తమ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు.