APNGO president
-
స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి
గుంటూరు మెడికల్: ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. స్థానిక ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహా తీసుకోకుండా.. ఉద్యోగుల్ని సంప్రదించకుండా విడుదల చేసిన షెడ్యూల్‌ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్, బర్డ్ ఫ్లూ భయాందోళనల్లో ప్రజలున్నారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని.. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మొండిగా వ్యవహరిస్తే.. ఎన్నికలను బహిష్కరించి కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని.. ఉద్యోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సీపీఎస్ రద్దుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కరోనా వల్ల రెవెన్యూ తగ్గి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సీపీఎస్ రద్దుతో పాటు పీఆర్సీ విషయంలో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే అవి పరిష్కారమవుతాయని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షుడు బండి చంద్రశేఖరరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వి.కృపావరం, రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.రంగారావు, నాయకులు ఘంటసాల శ్రీనివాసరావు, సీహెచ్.రాంబాబు, ఎం.ఎన్.మూర్తి, కె.ఎన్.సుకుమార్, సీహెచ్.అనిల్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నిర్వహించాలి: వైఎస్సార్ టీఎఫ్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వేసవి సెలవుల్లో నిర్వహించాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జాలిరెడ్డి, జి సుదీర్ ఓ ప్రకటనలో కోరారు. కరోనాతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయాందోళనతో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని, ముందుగా వారికి వ్యాక్సిన్ అందించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత వేసవి సెలవుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని ప్రకటనలో తెలిపారు. -
అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..
సాక్షి, అమరావతి: తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని.. అశోక్‌బాబు చెప్పేవన్నీ అవాస్తవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అశోక్‌బాబు తనను ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా చేయాలని చూశారని ధ్వజమెత్తారు. ‘‘అశోక్‌బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో పేరు ఎత్తితే సహించేదిలేదని’’ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్‌బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. (చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు) ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు టీడీపీకి మద్దతు తెలిపామని అశోక్‌బాబు మాట్లాడటం సిగ్గుచేటని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశోక్‌బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్‌బాబు అని, వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అశోక్‌బాబుపై బొప్పరాజు నిప్పులు చెరిగారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’) ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్సీ పదవి.. గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించానని స్వయంగా అశోక్‌బాబే ఒప్పుకున్నారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవిని అశోక్ బాబు సంపాదించారని, వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైనతే హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపైన కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. -
అశోక్‌బాబు కుట్రలు చేస్తున్నారు: దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు తమపై దాడి చేస్తున్నారంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో దేవీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఎక్కడా ఏపీ ఉద్యోగులపై ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ఉద్యోగులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. అంతర్గత కలహాలతో కుస్తీ పడుతున్న ఏపీ ఎన్జీవోలు... తెలంగాణ ప్రభుత్వంతో యుద్దం చేసే ప్రయత్నాలను మానుకోవాలని దేవీ ప్రసాద్ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏపీ ఎన్జీవో సంఘంలోని హైదరాబాద్ ఉద్యోగులు న్యాయమైన వాటా కోసం పట్టుపడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోను ఏపీకి తరలించే క్రమంలో నిధులు, వాటాల కోసం ఆ సంస్థ ప్రతినిధులకు సమాధానం చెప్పలేక అశోక్‌బాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. -
హైదరాబాద్‌లోనే పాగా వేస్తాం: అశోక్‌బాబు
ఒంగోలు,న్యూస్‌లైన్: ‘‘హైదరాబాద్ మాది.. మనందరిది.. అక్కడే పాగా వేసి ఉంటాం’’ అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విభజనకు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. టీ నోట్ బిల్లును తగులబెడితే హైదరాబాద్‌లో ఉండనీయమంటూ తెలంగాణ నేతలు బెదిరిస్తున్నారని, అయితే తాము భయపడేది లేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. తాము బయట ఎంత ఉద్యమం చేసినా, ఇప్పుడు అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ ప్రాంత శాసన సభ్యులపై ఉందన్నారు. ‘తెలంగాణ బిల్లు అసెంబ్లీ అనే గ్రౌండ్‌కు వచ్చింది. తాము ఇప్పటి వరకు గ్రౌండ్ బయట ఉండి పోరాడాం. బిల్లుఅనే బాల్‌ను కొట్టాల్సిన బాధ్యత బ్యాట్స్మెన్లయిన సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉంది’ అని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో విభజనకు సంబంధించి ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయాలని, చర్చ పెడితే వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన కోరారు. బంద్ తేదీల రీషెడ్యూల్ గుంటూరు: ఇకపై ప్రజాసంఘాలు, రాజకీయ వ్యవస్థతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహిస్తామని అశోక్‌బాబు తెలిపారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో చేపట్టనున్న బంద్ తేదీలను రీ షెడ్యూల్ చేస్తామని, 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై అప్రమత్తంగా వ్యవహరించి నిరసన కార్యక్రమాల్ని రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో విభజనబిల్లుపై ఏకవాక్య తీర్మానంతోపాటు, చర్చ కూడా జరగాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ఏపీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. ఆంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. భోగి మంటల్లో టీ బిల్లు దహనం సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం సమైక్యవాదులు భోగిమంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎక్కడికక్కడ బిల్లు ప్రతులను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో భోగిమంటల్లో టీ నోట్ బిల్లు ప్రతులను ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు దహనం చేశారు. అనంతపురంలోని ఎన్జీఓ కార్యాలయం ఎదుట బిల్లు ప్రతులను మంటల్లో వేశారు. అవి పూర్తిగా దహమనయ్యే వరకు సమైక్య నినాదాలు చేశారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం హైవే కూడలిలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు 68 పేజీల బిల్లు ప్రతులను చింపి భోగిమంటల్లో తగులబెట్టారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 19న హైదరాబాదు ఇందిరాపార్కులో వెరుు్య మంది విద్యార్థులతో ఒక్క రోజు నిరాహారదీక్ష చేపడతున్నట్లు తెలిపారు. -
17, 18న ‘సకలం బంద్’
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం మరోసారి ఆందోళన ఉధృతం చేసేందుకు ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని వర్గాలు సన్నద్ధం కావాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఏపీఎన్జీవో భవన్లో శుక్రవారం జరిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాల అనంతరం.. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తుది విడత అసెంబ్లీ సమావేశాల్లో విభజన బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులందరూ తమ అభిప్రాయాలు చెప్పే విధంగా వారిపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణను రూపొందించామన్నారు. కార్యాచరణను విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా భోగిమంటల్లో టి-బిల్లు ప్రతులను దహనం చే యాలని, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులతో బహిరంగ ప్రమాణాలు చేయించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈనెల 17, 18 తేదీల్లో ‘సకలం బంద్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రైళ్లు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను ఎక్కడికక్కడే స్తంభింప జేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ విభజన అంశంపై స్పష్టత రాకపోతే ఈనెల 20న లక్షలాదిమందితో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అసెంబ్లీ బయట ఆందోళన ద్వారా లోపల ఉన్న ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచడమే తమ ఆందోళనల ఉద్దేశమని ఆయన తెలిపారు. దాడులు హేయనీయం: సమైక్యవాదాన్ని వినిపిస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై విభజనవాదులు భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్యగా అశోక్‌బాబు అభివర్ణించారు. సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిపై శుక్రవారం జరిగిన దాడిని ఖండించారు. గతంలో ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిలపై కూడా ఇటువంటి దాడులు జరిగాయని గుర్తుచేశారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తేనే.. పార్లమెంట్లో కూడా బిల్లును వ్యతిరేకించేం దుకు జాతీయ పార్టీలన్నీ ముందుకు వస్తాయన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ కో కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మార్పీఎస్(ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, విద్యార్థి జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేయండి: వి.లక్ష్మణరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ చేపట్టానికి నిరసనగా ఈనెల 17, 18వ తేదీల్లో తలపెట్టిన సీమాంధ్ర బంద్‌ను విజయవ ంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ భోగి మంటల్లో తె లంగాణ బిల్లు ప్రతులను దహనం చేయాలని కోరారు. విభజన బిల్లును వ్యతిరేకించని ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేయాలని సూచించారు. -
'అశోక్ సమైక్య ఉద్యమాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు'
సమైక్య ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడుగా అశోక్ బాబు నీరుగార్చారని ఏపీఎన్జీవో రెండో ప్యానల్ నేతలు బషీర్, సత్యనారాయణలు ఆరోపించారు. ఆదివారం వారిరువురు అశోక్ బాబుపై నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమంలో రాజకీయ పార్టీలను కలుపుకోని పోవడంలో అశోక్‌బాబు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషిస్తున్న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రావడం అయింది, వెళ్లటం అయింది కానీ ఆయన్ని అశోక్ బాబు అడ్డుకున్నదాఖలాలు లేవని వారు ఉదాహరించారు. అలాగే టి.బిల్లు అసెంబ్లీకి వస్తే ముట్టడిస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో ఏ ఒక్కటి అశోక్ బాబు చేయలేదని ఆయన వ్యవహారశైలీని బషీర్, సత్యనారాయణలు ఎండగట్టారు. సొంత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని అశోక్ బాబు వాడుకున్నారని వారు ఆరోపించారు. అందుకే అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోటీకి దిగినట్లు వారిరువురు తెలిపారు. తప్పుడు ఓటర్ల జాబితాతో ఏపీఎన్జీవో ఎన్నికల్లో... అశోక్‌బాబు అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అశోక్ బాబు ఎంత ఖర్చు చేసిన నిజాయితీపరులైన ఎన్జీవోలు తమ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు. -
అశోక్‌బాబుకు ఓయూ పోలీసుల నోటీసు
హైదరాబాద్: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఏపీఎన్జీవో ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయనగా ఇప్పుడు అర్ధాంతరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చిన అశోక్ బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అశోక్ బాబుకు నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న అశోక్ బాబు హాజరు కావలంటూ పోలీసులు అదేశించినట్టు సమాచారం.