హైదరాబాద్‌లోనే పాగా వేస్తాం: అశోక్‌బాబు
ఒంగోలు,న్యూస్‌లైన్: ‘‘హైదరాబాద్ మాది.. మనందరిది.. అక్కడే పాగా వేసి ఉంటాం’’ అని ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విభజనకు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. టీ నోట్ బిల్లును తగులబెడితే హైదరాబాద్‌లో ఉండనీయమంటూ తెలంగాణ నేతలు బెదిరిస్తున్నారని, అయితే తాము భయపడేది లేదన్నారు.
విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. తాము బయట ఎంత ఉద్యమం చేసినా, ఇప్పుడు అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ ప్రాంత శాసన సభ్యులపై ఉందన్నారు. ‘తెలంగాణ బిల్లు అసెంబ్లీ అనే గ్రౌండ్‌కు వచ్చింది. తాము ఇప్పటి వరకు గ్రౌండ్ బయట ఉండి పోరాడాం. బిల్లుఅనే బాల్‌ను కొట్టాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్లయిన సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉంది’ అని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో విభజనకు సంబంధించి ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయాలని, చర్చ పెడితే వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన కోరారు.
బంద్ తేదీల రీషెడ్యూల్
గుంటూరు: ఇకపై ప్రజాసంఘాలు, రాజకీయ వ్యవస్థతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహిస్తామని అశోక్‌బాబు తెలిపారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో చేపట్టనున్న బంద్ తేదీలను రీ షెడ్యూల్ చేస్తామని, 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై అప్రమత్తంగా వ్యవహరించి నిరసన కార్యక్రమాల్ని రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో విభజనబిల్లుపై ఏకవాక్య తీర్మానంతోపాటు, చర్చ కూడా జరగాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ఏపీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. ఆంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
భోగి మంటల్లో టీ బిల్లు దహనం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం సమైక్యవాదులు భోగిమంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎక్కడికక్కడ బిల్లు ప్రతులను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో భోగిమంటల్లో టీ నోట్ బిల్లు ప్రతులను ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు దహనం చేశారు. అనంతపురంలోని ఎన్‌జీఓ కార్యాలయం ఎదుట బిల్లు ప్రతులను మంటల్లో వేశారు. అవి పూర్తిగా దహమనయ్యే వరకు సమైక్య నినాదాలు చేశారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం హైవే కూడలిలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు 68 పేజీల బిల్లు ప్రతులను చింపి భోగిమంటల్లో తగులబెట్టారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 19న హైదరాబాదు ఇందిరాపార్కులో వెరుు్య మంది విద్యార్థులతో ఒక్క రోజు నిరాహారదీక్ష చేపడతున్నట్లు తెలిపారు.