బంద్‌నాలు
Published Thu, Feb 13 2014 1:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలోనే సమైక్య ఉద్యమం పతాకస్థాయిని తాకుతోంది. విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు యూపీఏ సర్కారు మల్లగుల్లాలు పడుతుంటే.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ సహా సమైక్యవాదులు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా గురువారం వైఎస్‌ఆర్‌సీపీ, ఎన్జీవోలు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాసేందుకు ప్రభుత్వం తెగబడుతున్నట్లు దాని చర్యలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసుల ద్వారా ఉద్యమానికి సంకెళ్లు వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉన్న పళంగా పోలీస్ చట్టం సెక్షన్ 32ను అమల్లోకి తెస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో ఉద్యమాలు, నిరసనలు, బంద్ లు తీవ్రస్థాయిలో జరిగే అవకాశం ఉంది.
పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు ప్రజలు కూడా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న గురువారం సీమాంధ్ర బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీతోపాటు ఎన్జీవో సంఘాలు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ఉద్యోగ సంఘాల జేఏసీలు పిలుపునిచ్చాయి. సంపూర్ణ బంద్ పాటించేందుకు అన్ని వర్గాలు సమాయత్తమవుతున్న తరుణంలో సెక్షన్ 32 విధించడం విభజన వ్యతిరేక జ్వాలను అడ్డుకునేందుకు యూపీఏ ప్రభుత ్వం పన్నిన పన్నాగమేనని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు.. ప్రజాభిప్రాయాన్ని ఆంక్షల సంకెళ్లతో బంధించేందుకు మాత్రం తెగిస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికి కాం గ్రెస్‌పార్టీ, ప్రభుత్వం తగినమూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
నెలరోజులపాటు సెక్షన్ 32
జిల్లాలో గురువారం ఉదయం 6 గంటల నుంచి పోలీస్ చట్టం 32 సెక్షన్ అమలులోకి వస్తుందని డీఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహించరాదు. ఎంపీలు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఇళ్ల వద్ద. విద్యా, వ్యాపార, ప్రభుత్వ సంస్థల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదు. బందులు, రోడ్ల దిగ్బంధం, దిష్టిబొమ్మల దహనం, రాస్తారారోలు, ర్యాలీలతోపాటు పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడటం నిషేధం. ప్రజలు, సంస్థలు, ఉద్యోగులు, సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ఇది వర్తిస్తుందని, నిషేధాజ్ఞలను ఆతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
Advertisement
Advertisement