మార్కాపురం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని మోటారు వాహనాల శాఖ సిబ్బంది ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడంతో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, నంబర్ కేటాయింపులు, లెసైన్సులు జారీ చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలోని మార్కాపురం, దర్శి, చీరాల, కందుకూరు, ఒంగోలులోని కార్యాలయాల్లో ప్రతిరోజూ సగటున 80 బైకులు, 20 ఆటోలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. దీని ప్రకారం సగటున నెలకు 4 వేల కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లవుతాయి. సమ్మె కారణంగా ఐదుగురు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, స్పెషల్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు కార్యాలయాలకు రాకపోవడంతో తాళాలు వేశారు. మానవతా దృక్పథంతో ఎంవీఐలు నేషనల్ పర్మిట్లు ఉన్న లారీలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎంవీఐలు వచ్చి వాహనాల తనిఖీ చేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాన్ని హైదరాబాదు, తెలంగాణ జిల్లాలకు వెళ్లి అనేక వ్యయప్రయాసలకోర్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. లెసైన్స్ లేని వాహనాలకు పోలీసులు పెనాల్టీ విధిస్తే ఆ జరిమానా నగదు కూడా హైదరాబాదు వెళ్లి చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు కొత్త లెసైన్స్‌ల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో లెసైన్సులు లేకుండా రోడ్డుపైకి వస్తే పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడుతూ చలానాలు కట్టలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం ఎంవీఐ పరిధిలో నెలకు దాదాపు 500 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ల కోసం చలానాలు కడుతుంటారు. సుమారు 200 మంది డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. సమ్మె కారణంగా కొత్త రిజిస్ట్రేషన్లు, వాహనాలకు బ్రేక్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ, ఎల్‌ఎల్‌ఆర్‌ల మంజూరు నిలిచిపోయింది.
వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్
Published Wed, Sep 25 2013 5:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement