ఆగేది ఉద్యమం కాదు.. విభజన
Published Thu, Jan 30 2014 1:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఎవరు అడ్డుకున్నా ఆగదని, ఆగేది రాష్ట్ర విభజన అనే సత్యాన్ని స్వార్థపు తెలంగాణ రాజకీయ శక్తులు తెలుసుకునే సమయం ఆసన్నమైందని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టిన విభజన ప్రక్రియ రాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు స్థాయిలో ఎక్కడైనా ఆగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త కార్వనిర్వాహక మండలి (జేఈసీ) ఆధ్వర్యంలో బుధవారం ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నగరంలో బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించాయి.
నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద మౌన దీక్ష..
జిల్లా వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 120 బస్సుల్లో తరలివచ్చిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులతో బయలుదేరిన ర్యాలీని స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద లావు రత్తయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేపట్టిన ర్యాలీకి సమైక్యాంధ్ర జేఏసీ, పరిరక్షణ సమితి నాయకులు మద్ధతు పలికి, బీఆర్ స్టేడియం నుంచి పాదయాత్ర చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో పార్లమెంటులో బిల్లును ఓడించే బాధ్యత ఇక ఎంపీల భుజస్కంధాలపైనే ఉందన్నారు.
ఫిబ్రవరి 7న పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై జరిగే చర్చలో సీమాంధ్ర ఎంపీలు కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రజా ప్రతినిధుల ఇళ్ళ ముందు మౌన దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రజా ప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని, పార్లమెంటులో విభజనకు వ్యతిరేకంగా ఓటు వేయని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, విద్యార్థులు, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ, పార్లమెంటులలో కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దీక్షలకు సంఘీభావం..
ర్యాలీలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం హిందూ కళాశాల సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించిన విజ్ఞాన్ రత్తతయ్య, జేఏసీ నాయకులు రాజకీయ వేదికపై రిలే దీక్షలో కూర్చున్న మహిళలకు సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి ఏసీ కళాశాల, అరండల్‌పేట ఫ్లై ఓవర్, లాడ్జి సెంటర్, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం మీదుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో విద్యాసంస్థల జేఈసీ అధ్యక్షుడు డాక్టర్ జి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి వాసిరెడ్డి విద్యాసాగర్, కన్వీనర్ కోలా శేషగిరిరావు, రిటైర్డు డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఆర్. రాము, ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధాకర్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఎండీ హిదాయత్, కసుకుర్తి హనుమంతరావు, విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, మన్నవ సుబ్బారావు, జి.శ్రీకూర్మనాథ్, మద్ధినేని సుధాకర్, పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement