కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూత
Published Tue, Feb 11 2014 1:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు చేపట్టిన ఏపీ ఎన్జీవోలు సోమవారం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ మూయించారు. ఉదయం 9 గంటల నుంచే రోడ్ల మీదకొచ్చిన ఎన్జీవో సంఘ నాయకులు, ఉద్యోగులు సమైక్య పరిరక్షణ వేదిక జెండాలను పట్టుకుని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా, ప్రావిడెంట్‌ఫండ్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసుల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగుల్ని అడ్డుకుని సమైక్య రాష్ట్రానికి మద్దతు పలకాలని కోరారు. విధులను పక్కనబెట్టి సమైక్య నినాదాన్ని కేంద్రానికి తెలియజేయాలని కోరారు. దీంతో గుంటూరులోని తపాలా కార్యాలయాలు, బీఎస్‌ఎన్‌ఎల్, ప్రావిడెంట్, ఎల్‌ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.
ఉద్యోగులు 11 గంటలకల్లా ఇంటిముఖం పట్టారు. గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట,వినుకొండ, సత్తెనపల్లి వంటి ప్రధాన పట్టణాల్లో ఎన్జీవోల ఆందోళనలు ఉధ్రుతంగా జరిగాయి. గుంటూరు కలెక్టరేట్ నుంచి బయలు దేరిన ఎన్జీవోల నిరసన ర్యాలీ జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఉద్యమం విజయవంతానికి ఉద్యోగులంతా సహకరించాలన్నారు. ఈనెల 12న జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు తెలిపారు. ఎన్జీవో సంఘ నాయకులు వెంకయ్య, నాగరాజు, కోటేశ్వరరావు, శ్రీకష్ణ, దయానందరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement