రోజులు గడిచేకొద్ది సమైక్య ఉద్యమం మరింత బలపడుతోంది. జిల్లాలో ఉద్యమం 48వ రోజైన సోమవారం ఉధృతంగా సాగింది
సాక్షి, నెల్లూరు: రోజులు గడిచేకొద్ది సమైక్య ఉద్యమం మరింత బలపడుతోంది. జిల్లాలో ఉద్యమం 48వ రోజైన సోమవారం ఉధృతంగా సాగింది. నగరంలో నృత్యకళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘కలిసుంటే కలదు సుఖం.. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరి జీవితాల్లో వెలుగులుంటాయని’ నినదించారు. ముత్తుకూరుకు సమీపంలోని బ్రహ్మదేవిలో బ్రహ్మగర్జన పేరుతో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ నేతృత్వంలో జలదీక్ష పేరుతో వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అధికారులు, ఉపాధ్యాయుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు.
ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించింది. నెల్లూరు గాంధీబొమ్మ కూడలిలో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్‌జీఓలు ఎన్‌జీఓ హోం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నృత్య కళాకారులు నర్తకి సెంటర్ నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకా క్షీరాభిషేకం, రాస్తారోకో నిర్వహిం చారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బ్రహ్మగర్జన జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు-ముత్తుకూరు రహదారిని దిగ్బంధించారు. భారీ ర్యాలీ నిర్వహించారు.
గ్రామస్తులు, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పొదలకూరులో భారీ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా టీపీగూడూరు మండలంలోని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు మూడోరోజు మహాలక్ష్మీపురం నుంచి పాదయాత్ర చేపట్టారు. నాలుగు పంచాయతీల్లో ఈ పాదయాత్ర జరిగింది. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షకు ఎంపీడీఓ, తహశీల్దార్, వ్యవసాయాధికారి సంఘీభావం తెలిపారు. డక్కిలిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి సైదాపురం బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కోవూరు ఎన్జీఓహోంలో దళితనాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీతాల కంటే జీవితాలే ముఖ్యమని ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక టవర్‌క్లాక్ కూడలిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం జలదీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నీటితో నింపిన డ్రమ్ముల్లో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తిని విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పంబలేరులో జల దీక్ష నిర్వహించారు. అలాగే ఎల్‌ఏపీ, నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు టవర్‌క్లాక్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 19వ రోజు రిలే దీక్షలు సోమవారం కొనసాగాయి.
ఈ దీక్షలకు మం డలంలోని వెంగళరావునగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. పదో రోజు కృష్ణంపల్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు దీక్షలు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్‌లో 29వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 35వ రోజుకు చేరింది.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 21న లక్షమందితో చేపట్టనున్న ఆత్మఘోష కార్యక్రమంపై ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నేతలు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలను ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైర్ బస్సులతో ర్యాలీ, వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు