వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న గడగపడకూ సమైక్యనాదం ఉద్యమంలా సాగుతోంది. పల్లెల్లో సమైక్య హోరు మారుమోగుతోంది.
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న గడగపడకూ సమైక్యనాదం ఉద్యమంలా సాగుతోంది. పల్లెల్లో సమైక్య హోరు మారుమోగుతోంది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలకు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఊరూవాడా అనూహ్య స్పందన లభిస్తోంది.
జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి మహర్దశ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండి, అన్ని రంగాల్లోను అభివృద్ధి పథంలో పయనిస్తుందని పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం ఇటికాయలపల్లిలో శనివారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ విధివిధానాలు, ఇచ్చిన హామీలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. నెహ్రూ మాట్లాడుతూ వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ కావాలంటే జగన్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్ల పాటు సువర్ణ పాలన అందించే సత్తా జగన్‌కు ఉందన్నారు. ఇంటింటికీ తిరిగి పార్టీ కార్యక్ర మాలను వివరించారు. గండేపల్లి మండలం కె.గోపాలపురంలో నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు.
విభజనకు బాబు, సోనియా కుమ్మక్కు కుట్రలు
ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని ముక్కలు చేసేందుకు చంద్రబాబుతో కలిసి సోనియాగాంధీ కుట్రలు చేస్తోందని పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రామచంద్రపురం మండలం తాటిపల్లిలో శనివారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పార్టీ విధానాలు, జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వివరించారు. జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తారన్నారు. కాకినాడ ముత్తానగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు.
పార్టీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏలేశ్వరంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలన్నీ తీరుతాయన్నారు. పిఠాపురం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం మున్సిపాలిటీలోని 28వ వార్డులో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్, పార్టీ కోఆర్డినేటర్ సీహెచ్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కరప మండలం నడకుదురులో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మామిడికుదురు మండలం నగరంలో పార్టీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.